Asia Cup 2023: ఆ ముగ్గురూ ఇలా ఆడితే పాకిస్థాన్‌పై విజయం మనదే: మంజ్రేకర్
31 August 2023, 10:19 IST
- Asia Cup 2023: ఆ ముగ్గురూ ఇలా ఆడితే పాకిస్థాన్‌పై విజయం మనదే అని అన్నాడు సంజయ్ మంజ్రేకర్. రోహిత్, గిల్, విరాట్ కోహ్లిలలోనూ టెస్ట్ మ్యాచ్ ఆడే స్కిల్ ఇప్పుడు బాగా పనికొస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.
టీమిండియా టాపార్డర్ కు మంజ్రేకర్ స్పెషల్ రిక్వెస్ట్
Asia Cup 2023: ఆసియా కప్ గెలిచినా గెలవకపోయినా సరే.. పాకిస్థాన్ పై గెలవాలి. ఈ సెంటిమెంట్ ఇప్పటిది కాదు. ఎప్పటి నుంచో వస్తున్నదే. ఈసారి కూడా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. మరి పాకిస్థాన్ పై టీమిండియా ఎలా గెలవాలి? దీనికి సమాధానమిస్తున్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. దీనికోసం రోహిత్, గిల్, కోహ్లి ఎలా ఆడాలో సూచిస్తున్నాడు.
స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన మంజ్రేకర్.. ఇండియన్ టాపార్డర్ లోనే అసలు బలమంతా ఉన్నదని చెప్పాడు. "విరాట్ నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తే.. అదృవశాత్తూ ఇండియా మొదటి ముగ్గురు బ్యాటర్లు మంచి టెస్ట్ బ్యాటర్లే. 50 ఓవర్ల క్రికెట్, వన్డే క్రికెట్, వైట్ బాల్ క్రికెట్ అని ఎన్నయినా చెప్పండి.. ఈ ఫార్మాట్లో టీ20 క్రికెట్ లాగా ప్రారంభం అవసరం లేదు" అని మంజ్రేకర్ అన్నాడు.
"ఈ ఫార్మాట్లో కొన్ని టెస్ట్ క్రికెట్ స్కిల్స్ అవసరం. గత వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఇలాగే ఐదు సెంచరీలు చేశాడు. తొలి 10 ఓవర్ల పాటు బౌలర్లను గౌరవించాడు. ఇప్పుడు రోహిత్, గిల్, కోహ్లి తమ టెస్ట్ క్రికెట్ స్కిల్స్ బయటకు తీయాలి. వాళ్లు అలాగే ఆడాలి. మొదట్లో వికెట్లు కోల్పోకపోతే మాత్రం మ్యాచ్ గెలిచినట్లే" అని మంజ్రేకర్ స్పష్టం చేశాడు.
ఎప్పటిలాగే పాకిస్థాన్ పేస్ బౌలర్లకు ఇండియా బ్యాటర్లకు మధ్య సమరంగా దీనిని భావిస్తున్నారు. షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్ లాంటి పాక్ పేసర్లను ఇండియన్ టాపార్డర్ ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఆ పేస్ అటాక్ ను సమర్థంగా ఎదుర్కొంటే చాలు.. మ్యాచ్ పై పట్టు బిగించే అవకాశం ఇండియాకు ఉంటుంది.
శనివారం (సెప్టెంబర్ 2) ఈ దాయాదుల మ్యాచ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లో నేపాల్ ను చిత్తుగా ఓడించిన పాక్.. కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు నాలుగేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్ లో తొలిసారి తలపడుతున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో ఎవరిది పైచేయి అవుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.