T20 Cricket: ఐదుగురు డకౌట్ - 10 రన్స్‌కు జట్టు ఆలౌట్ - టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో సంచలనం
05 September 2024, 16:30 IST
T20 Cricket: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో మంగోలియా జట్టు పది పరుగులకే ఆలౌటైంది. ఈ జట్టులోని ఐదుగురు బ్యాట్స్‌మెన్స్ డకౌట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో సింగపూర్ జట్టు కేవలం ఐదు బాల్స్‌లోనే విజయాన్ని అందుకున్నది.
టీ20 క్రికెట్
T20 Cricket: ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో సంచలనం నమోదైంది. సింగపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో మంగోలియా జట్టు పది పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మంగోలియా జట్టు పది ఓవర్లలో సరిగ్గా పది పరుగులు మాత్రమే చేసింది. పరుగులు ఖాతా తెరవక ముందే మంగోలియా జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత వికెట్ల పతనం కొనసాగుతూనే వచ్చింది.
ఐదుగురు డకౌట్....
మొత్తంగా మంగోలియా జట్టులో ఐదుగురు క్రికెటర్లు డకౌట్ అయ్యారు. జోయిజవ్ ఖాన్‌తో పాటు వికెట్ కీపర్ గ్యాన్‌గోల్డ్ తలో రెండు పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మంగోలియా టీమ్‌లోని పదకొండు మంది బ్యాట్స్‌మెన్స్ కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగా...రెండు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.
నాలుగు ఓవర్లలో ఆరు వికెట్లు...
సింగపూర్ స్పిన్నర్ హర్ష భరద్వాజ్ నాలుగు ఓవర్లు వేసి మూడు పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసుకున్నాడు. 0.75 ఏకానమీ రేటుతో భరద్వాజ్ పరుగులు ఇచ్చాడు. అతడి దెబ్బకు మంగోలియా బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. టీ20ల్లో బౌలింగ్ పరంగా రెండో అత్యుత్తమ ప్రదర్శన ఇది కావడం గమనార్హం. అక్షయ్ పూరి రెండు వికెట్లతో రాణించాడు.
ఐదు బాల్స్‌లోనే...
మంగోలియా విధించిన 11 పరుగుల టార్గెట్‌ను సింగపూర్ కేవలం ఐదు బాల్స్‌లోనే ఛేదించింది. ఇన్నింగ్స్ మొదలైన ఐదో బాల్‌కు టార్గెట్‌ను చేరుకున్నది. సింగపూర్ ఇన్నింగ్స్ ఐదు నిమిషాల లోపే ముగియడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో సింగపూర్ 9 వికెట్ల తేడాతో మరో 155 బాల్స్ మిగిలుండగానే ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ ద్వారా టీ20 మెన్స్ క్రికెట్‌లో అతి తక్కువ పరుగులకు ఆలౌటైన జట్టుగా మంగోలియా చెత్త రికార్డును మూటగట్టుకున్నది. గతంలోనూ ఈ రికార్డు మంగోలియా జట్టు పేరు మీదటే ఉంది. ఇదివరకు జపాన్ చేతిలో మంగోలియా 12 రన్స్‌కు ఆలౌటైంది. సింగపూర్ మ్యాచ్ ద్వారా తన రికార్డును తానే బద్దలుకొట్టింది మంగోలియా.
టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో మంగోలియాకు ఇది వరుసగా నాలుగో ఓటమి కావడం గమనార్హం. సింగపూర్‌పై ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.