Kolkata rape-murder case: కోల్‌కతా రేప్, మర్డర్ కేసుపై స్పందించిన గంగూలీ.. తన కామెంట్స్ దుమారం రేపడంతో వివరణ
19 August 2024, 17:48 IST
- Kolkata rape-murder case: కోల్‌కతా మెడికల్ స్టూడెంట్ రేప్ మర్డర్ కేసుపై గతంలో తాను చేసిన కామెంట్స్ వివాదం రేపడంతో మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి స్పందించాడు. తన కామెంట్స్ పై అతడు వివరణ ఇచ్చాడు. ఒక్క ఘటనతో మొత్తం వ్యవస్థపై ఓ అంచనాకు రావడం సరికాదని అతడు గతంలో చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.
కోల్‌కతా రేప్, మర్డర్ కేసుపై స్పందించిన గంగూలీ.. తన కామెంట్స్ దుమారం రేపడంతో వివరణ
Kolkata rape-murder case: కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ పీజీ విద్యార్థిని రేప్, మర్డర్ దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపుతోందో మనం చూస్తేనే ఉన్నాం. నిజానికి ఈ ఘటనపై అదే కోల్‌కతాకు చెందిన టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించినా.. అతని కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో ఇప్పుడు మరోసారి దీనిపై వివరణ ఇచ్చాడు.
అప్పుడు గంగూలీ ఏమన్నాడంటే?
కోల్‌కతా రేప్ మర్డర్ కేసుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఆగస్ట్ 11న మీడియాతో గంగూలీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై స్పందించాడు. ఓ ఆడబిడ్డ తండ్రిగా ఇది తనను వణికించే ఘటన అని అతడు అన్నాడు. అయితే ఇప్పటికీ ఇండియా, వెస్ట్ బెంగాల్ ఎంతో సురక్షితమైనవని, ఒక్క ఘటనతో ఓ అంచనాకు రావడం సరికాదని గంగూలీ అన్నాడు.
"చాలా దురదృష్టకరం. కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది చాలా భయానక ఘటన. చాలా చాలా భయంకరమైనది. ఎక్కడైనా ఏదైనా జరగొచ్చు. అందువల్ల సెక్యూరిటీ వ్యవస్థ, సీసీటీవీ కెమెరాలు అందుకు తగినట్లు సిద్ధంగా ఉండాలి. ఈ ఘటన ఎక్కడైనా జరగొచ్చు. అయితే ఒక్క ఘటనతో అన్నింటిపై ఓ అంచనాకు రాకూడదు. అందుకే మహిళలకు రక్షణ లేదని అనుకోవడం తప్పు. వెస్ట్ బెంగాల్లోనే కాదు.. ఇండియాలో ఎక్కడైనా మహిళలు సురక్షితంగానే ఉన్నారు. మనం నివసించేది చాలా బెస్ట్ ప్లేస్. ఒక్క ఘటనతో అంచనాకు రావద్దు" అని గంగూలీ అన్నాడు. ఈ కామెంట్సే దుమారం రేపాయి.
గంగూలీ వివరణ
తన కామెంట్స్ వివాదానికి దారి తీయడంతో గంగూలీ వివరణ ఇచ్చాడు. "గత ఆదివారం నేను దీనిపై స్పందించాను. నా స్టేట్మెంట్ ను ఎలా అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. ఇది భయానకమైన ఘటన. నిందితులను శిక్షించాలి. ఇలాంటి భవిష్యత్తులో మళ్లీ జరగనంత కఠినంగా వాళ్లను శిక్షించాలి.
దీనిపై దర్యాప్తు జరుగుతోంది. నిందితులను గుర్తించి పట్టుకుంటారని ఆశిస్తున్నాను. అందరూ నిరసనలు తెలుపుతున్నారు. ఇలాంటి ఘటన ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఇలానే రియాక్ట్ అవుతారు" అని గంగూలీ అన్నాడు.
అసలు ఏం జరిగిందంటే..
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌కు బాధితురాలు భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లింది. ఆమె ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉంది. ఆ తర్వాత శవమై కనిపించింది. అత్యంత దారుణమైన స్థితిలో బాధితురాలు పడి ఉంది. విచారణ చేసిన పోలీసులు ఈ నేరానికి పాల్పడిన సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య అత్యాచారం, హత్య జరిగింది. నివేదిక ప్రకారం, బాధితురాలి బొడ్డు, పెదవులు, వేళ్లు, ఎడమ కాలికి గాయాలు ఉన్నాయి. బాధితురాలి నోరు మూసేసి.. కేకలు వేయకుండా ఆమె తలను గోడ లేదా నేలపైకి నెట్టారని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
కేకలు వేయకుండా ఉండేందుకు బాధితురాలి నోరు, గొంతును నిరంతరం నొక్కి ఉంచారు. మహిళ కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తం కారింది. ఇప్పటికే ఈ ఘటనపై కోల్‌కతాలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతుంది. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని నిరసనలు చేస్తున్నారు.