Sreelekha Mitra On Sourav Ganguly: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశంలో విషాదకరంగా మారింది. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడినట్లు అయింది. యావత్ దేశాన్ని ఈ భయానక ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న విషయం తెలిసిందే.
బాధితురాలి కుటుంబానికి సపోర్ట్‌గా దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు మద్దతు తెలుపుతున్నారు. నేరస్థులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులపైనే ఇలాంటి దారుణమైన ఘటనలు జరగడం పాపులర్ సెలబ్రిటీల నుంచి సాధారణ వ్యక్తులను కలచివేస్తోంది. ఈ చర్యను ఖండిస్తూ అనేకమంది సెలబ్రిటీలు తమ గళాన్ని విప్పుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ ఎక్స్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఈ ఘటనపై స్పందించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన గంగూలీ ఈ ఒక్క ఘటనతో కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ సురక్షితంగా లేదనే వాదన సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
"ఇదో దురదృష్టకరమైన ఘటన. ఈ ఘటనకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలి. నిజంగా ఇది అత్యంత క్రూరమైన చర్య. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కడైనా జరగొచ్చు. అయితే, ఈ ఒక్క ఘటనతో దశంలో భద్రత లేదనే వాదన సరికాదు" అని మీడియాతో సౌరవ్ గంగూలీ తెలిపారు.
సౌరవ్ గంగూలీ ఇంకా కొనసాగిస్తూ.. "భారత్ అద్భుతమైన దేశం. పశ్చిమ బెంగాల్ అయినా.. మరే ఇతరా రాష్ట్రంలో అయినా మంచి భద్రతనే ఉంది. కానీ, ఇలాంటి ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలి. హాస్పిటల్స్‌లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి. మహిళళ రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి" అని వ్యాఖ్యలు చేశారు.
అయితే, సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రా మండిపడ్డారు. అత్యంత ఘోరమైన హత్యాచార ఘటనను ఓ సాధారణ సంఘటనగా గంగూలీ చెప్పడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
"గంగూలీ మీ వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఓ క్రికెటర్‌గా మిమ్మల్ని, మీటీవీ షోను నెత్తిన పెట్టుకున్నందుకు, మహారాజాగా నిన్ను పిలుచుకున్నందుకు మాకు బుద్ధి వచ్చేలా మాట్లాడారు. అత్యంత క్రూరమైన ఈ ఘటనను సాధారణ సంఘటనగా చెప్పడానికి మీకు నోరు ఎలా వచ్చింది?" అని నటి శ్రీలేఖ మిత్రా ప్రశ్నించారు.
నటి శ్రీలేఖ మిత్రా కామెంట్స్‌పై కూడా సౌరవ్ గంగూలీ స్పందించారు. తన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకున్నారో తనకు తెలియట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. "ఇది చాలా భయంకరమైన ఘటన. నేరస్థులకు కఠినమైన శిక్ష విధించాలని నేను డిమాండ్ చేశాను. అలాగే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకున్నాను. నా వ్యాఖ్యలను మీరు ఎలా తీసుకున్నారో నాకు తెలియడం లేదు" అని గంగూలీ క్లారిటీ ఇచ్చారు.