Online Bookie: హనుమకొండలొ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్..నాలుగు సార్లు పట్టుబడినా మారని తీరు-an online cricket betting bookie was arrested in hanumakonda ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Online Bookie: హనుమకొండలొ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్..నాలుగు సార్లు పట్టుబడినా మారని తీరు

Online Bookie: హనుమకొండలొ ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్..నాలుగు సార్లు పట్టుబడినా మారని తీరు

HT Telugu Desk HT Telugu
Aug 15, 2024 08:17 AM IST

Online Bookie: ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులకు అలవాటు పడిన ఓ బుకీ ఇప్పటికే నాలుగు సార్లు అరెస్ట్ అయ్యాడు. అయినా తీరు మార్చుకోకుండా మళ్లీ బెట్టింగ్ దందానే కొనసాగిస్తున్నాడు. దీంతో ఐదోసారి పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. నిందితుడిని మాడిశెట్టి ప్రసాద్‌గా గుర్తించారు.

ఆన్‌లైన్‌ క్రికెట్ బుకీ అరెస్ట్
ఆన్‌లైన్‌ క్రికెట్ బుకీ అరెస్ట్ (HT_PRINT)

Online Bookie: హనుమకొండ జిల్లా కేంద్రంలోని గోపాలపూర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన మాడిశెట్టి ప్రసాద్ అనే 40 ఏళ్ల వ్యక్తి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగులను జీవనోపాధిగా ఎంచుకున్నాడు. ముంబైకి చెందిన గ్యాంగ్ లతో పరిచయాలు పెంచుకుని, 2016 నుంచి క్రికెట్ బెట్టింగ్ దందా మొదలు పెట్టాడు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా పందెం కాయడం, వాట్సాప్ ద్వారా బెట్టింగ్ రాయుళ్లతో వ్యవహారం అంతా నడిపించేవాడు. మొదట హైదరాబాద్ లో ఉంటూ ఈ తతంగం అంతా నడిపించగా..2019లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చందానగర్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

వరంగల్ కు మకాం మార్చి దందా

హైదరాబాద్ లో పోలీసులకు చిక్కిన ప్రసాద్ జైలు శిక్ష అనుభవించి, బయటకు వచ్చాడు. కానీ ఆదాయ మార్గంగా ఎంచుకున్న బెట్టింగులను మాత్రం వదలలేక పోయాడు. దీంతో హైదరాబాద్ నుంచి వరంగల్ కు మకాం మార్చి మళ్లీ అదే దందా మొదలు పెట్టాడు. ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు నిత్యం లక్షలు, కోట్లలో లావాదేవీలు నడిపించేవాడు.

కాగా 2021లో దందా జోరుగా నడుస్తున్న సమయంలో వరంగల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు అక్కడి వ్యవహారం చూసి షాక్ అయ్యారు. ప్రసాద్ ఇంట్లో నోట్లు కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి. దీంతో అతడిని పట్టుకున్న పోలీసులు రూ.2 కోట్ల నగదును సీజ్ చేశారు. అనంతరం ప్రసాద్ తో పాటు మరికొందరిని జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన ప్రసాద్ మరోసారి బెట్టింగ్ దందాకే మొగ్గు చూపాడు.

బుకీగా ఆదాయం ఫుల్లుగా ఉండటంతో.. అదే మార్గంలో నడవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2022 జూన్ లో మరోసారి ప్రసాద్ పోలీసులకు చిక్కాడు. ఆ సమయంలో 20 లక్షల నగదు పోలీసులు సీజ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులతో ఉన్న లింక్ ల నేపథ్యంలో అక్కడి ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.

ఐదోసారి పోలీసులకు చిక్కి.. మళ్లీ జైలుకి..

క్రికెట్ బెట్టింగ్ బుకీగా ఎదిగిన మాడిశెట్టి ప్రసాద్ ఇప్పటికే నాలుగు సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. పోలీస్ అధికారులు కూడా కఠిన సెక్షన్లు పెట్టకుండా నామమాత్రపు సెక్షన్లు పెట్టి వదిలేయడంతో నాలుగు సార్లు జైలుకు వెళ్లి బయటకు వచ్చిన ఆయన.. మళ్లీ బుకీగా బెట్టింగ్ దందా కొనసాగించాడు.

ఈ క్రమంలో ప్రస్తుతం ఇంగ్లండ్ లో మెన్స్ క్రికెట్ తో పాటు విమెన్ 100 బాల్స్ టోర్నీ నడుస్తుండటంతో దానిపై బెట్టింగ్ లు నిర్వహిస్తున్నాడు. వరంగల్ లో మరో 50 మందితో బెట్టింగులు పెట్టిస్తూ.. పెద్ద మొత్తంలో డబ్బు పోగేస్తున్నాడు. దీంతో విషయం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెవిన పడింది. ఈ మేరకు వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ పవన్ కుమార్, కేయూ సీఐ సంజీవ్ నేతృత్వంలోని టీమ్ మాడిశెట్టి ప్రసాద్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.

కాగా అతడు బుకీగా బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. తనతో పాటు తన బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 12 బ్యాంక్ ఖాతాల్లోని రూ.29 లక్షలతో పాటు ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదును సీజ్ చేశారు. మూడు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రసాద్ ను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner