Shami on Sanjiv Goenka: రాహుల్‌తో మాట్లాడేది ఇలాగేనా! - సంజీవ్ గోయెంకాను ఉతికి ఆరేసిన షమీ
10 May 2024, 12:11 IST
Shami on Sanjiv Goenka: లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయెంకాపై టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ ఫైర్ అయ్యాడు. క్రికెటర్లకు గౌరవమర్యాదలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి స్టేడియంలోనే అవమానించడం సిగ్గుచేటు అంటూ షమీ కామెంట్స్ చేశాడు.
మహ్మద్ షమీ
Shami on Sanjiv Goenka: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ పట్ల లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరు క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది. పలువురు మాజీ క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా సంజీవ్ గోయెంకాపై విమర్శల వర్షం కురిపిస్తోన్నారు. సంజీవ్ గోయెంకాను టీమిండియా పేసర్ మహ్మద్ షమీ ఉతికి ఆరేశాడు
అవమానించడం సరికాదు...
స్టేడియంలోనే అందరి ముందు క్రికెటర్‌ను అవమానించడం సిగ్గుచేటు అని, ఆటగాళ్లను గౌరవించడం ముందు నేర్చుకోమంటూ సంజీవ్ గోయెంకపై షమీ అగ్రహం వ్యక్తం చేశాడు. కేఎల్ రాహుల్, సంజీవ్ గోయెంకా మధ్య జరిగిన ఘటనపై షమీ స్పందించాడు.
గౌరవప్రదమైన స్థానంలో...
ఐపీఎల్ టీమ్ ఓనర్‌గా గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. మిమ్మల్ని ఎంతో మంది ఆరాధిస్తున్నారు. హుందాగా ఎలా ఉండాలన్నది మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇలాంటిది మీరే హద్దులు దాటి ఓ ఆటగాడిని స్టేడియంలో అవమానించడం బాగాలేదు అంటూ సంజీవ్ గోయెంకాను ఉద్దేశించి షమీ కామెంట్స్ చేశాడు.
అనేక మార్గాలు...
ఆటలోని మంచి చెడులు, తప్పొప్పుల్ని చెప్పడానికి అనేక మార్గాలు ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో, హోటల్‌లో రాహుల్‌ను పిలిచి మాట్లాడితే బాగుండేది. అలాగైతే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. అంతే కానీ స్టేడియంలొనే రాహుల్‌తో వాదించాల్సిన అవసరం ఏముంది? క్రికెటర్లకు గౌరవమర్యాదలు ఉన్నాయన్న సంగతి మర్చిపోయి అతడిని అవమానించడం సిగ్గుచేటుగా అనిపిస్తోందని షమీ కామెంట్స్ చేశాడు.
అతడు కెప్టెన్
కేఎల్ రాహుల్ జట్టులోని సాధారణ ఆటగాడు కాదు. అతడో కెప్టెన్ అన్న సంగతి కూడా మర్చిపోతే ఎలా అంటూ సంజీగ్ గోయెంకాపై విమర్శలు గుప్పించాడు. క్రికెట్‌లో రిజల్ట్ అన్నది ఏ ఒక్కరిపై ఆధారపడి ఉండదు. ఇదొక టీమ్ గేమ్. ఇందులో తప్పొప్పుల బాధ్యత ఆటగాళ్లందరిపై సమిష్టిగా ఉంటుంది. కొన్నిసార్లు ప్లాన్స్ తారుమారు అవుతాయి. రిజల్ట్ అనుకూలంగా రాకపోవచ్చు.
ఆటలో అది సహజం. అది అర్థం చేసుకుంటే మంచిది. ఆటగాళ్లకు గౌరవం ఇస్తూ ఎలా మాట్లాడాలన్నది తెలుసుకుంటే బాగుంటుంది. ఇలా స్టేడియంలోనే క్రికెటర్‌ను అవమానిండం తప్పుడు సంకేతాలకు దారితీస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటం అందరికి మంచిది అంటూ షమీ పేర్కొన్నాడు. షమీ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
సన్‌రైజర్స్ చేతిలో చిత్తు...
బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో లక్నో సెట్ చేసిన 166 పరుగుల టార్గెట్‌ను హైదరాబాద్ కేవలం 9.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా ఛేదించి ఘన విజయాన్ని అందుకున్నది. సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగి ఆడారు.
సంజీవ్ గోయెంకా ఫైర్...
హెడ్, అభిషేక్ శర్మలను కట్టడి చేయడంలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. ఈ దారుణ పరాజయంతో కేఎల్ రాహుల్‌పై లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ఫైర్ అయ్యాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్ కెప్టెన్సీపై స్టేడియంలో అందరి ముందే సంజీవ్ గోయెంకా అగ్రహం వ్యక్తం చేశాడు. రాహుల్‌తో సీరియస్‌గా మాట్లాడుడాడు. సంజీవ్ గోయెంకాకు సర్ధిచెప్పేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. రాహుల్ మాటలను సంజీవ్ పెద్దగా పట్టించుకోనట్లుగా కనిపించింది. ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.