KL Rahul: ఎక్కడైనా ఆడతాను.. తుది జట్టులోకి మాత్రం నన్ను తీసుకోండి: రోహిత్, గంభీర్‌తో కేఎల్ రాహుల్
04 December 2024, 13:36 IST
- KL Rahul: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు కేఎల్ రాహుల్ ఓ స్పష్టమైన సందేశాన్ని పంపించాడు. తాను ఏ స్థానంలో అయినా ఆడతాను కానీ.. తుది జట్టులోకి మాత్రం తీసుకోవాలని చెప్పడం విశేషం.
ఎక్కడైనా ఆడతాను.. తుది జట్టులోకి మాత్రం నన్ను తీసుకోండి: రోహిత్, గంభీర్‌తో కేఎల్ రాహుల్
KL Rahul: ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరగబోయే రెండో టెస్టు కేఎల్ రాహుల్ ఆడతాడా? ఒకవేళ ఆడితే ఏ స్థానంలో బరిలోకి దిగుతాడు? వీటిలో తొలి ప్రశ్నకు సమాధానం దొరికినా.. రెండో ప్రశ్నకు మాత్రం అతడు రిప్లై ఇవ్వలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం (డిసెంబర్ 4) రాహుల్ మీడియాతో మాట్లాడాడు.
తుది జట్టులోకి మాత్రం తీసుకోండి: కేఎల్ రాహుల్
తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు కెప్టెన్ తిరిగి రావడంతో ఎక్కడ ఆడతాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. మూడో స్థానంలోకి శుభ్‌మన్ గిల్ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో మరోసారి రాహుల్ మిడిలార్డర్ కు పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. అయితే తాను ఏ స్థానంలో అయినా ఆడతాను కానీ.. తుది జట్టులో మాత్రం తీసుకోండన్న స్పష్టమైన సందేశాన్ని పంపించాడు.
"తుది జట్టులో మాత్రం ఉండాలనుకుంటున్నాను. నన్ను ఎలాగైనా తీసుకోండి. వెళ్లి జట్టు కోసం ఆడాలని భావిస్తున్నాను. పరిస్థితులను బట్టి ఎలా పరుగులు చేయాలన్నది నేను చూసుకుంటాను. నా గేమ్ ను సాధ్యమైనంత వరకు సింపుల్ గా ఉంచాలనుకుంటున్నాను. అదృష్టవశాత్తూ నేను వివిధ స్థానాల్లో ఆడాను. గతంలో అలా ఆడాలని అడిగినప్పుడు నాకు కాస్త సవాలుగా అనిపించేది. మొదటి 20, 25 బంతులు ఎలా ఆడాలి? ఎలా అటాక్ చేయాలన్నది మొదట్లో కాస్త గందరగోళంగా అనిపించేది. కానీ ఇప్పుడు వివిధ ఫార్మాట్లలో వివిధ స్థానాల్లో ఆడాను. మొదటి 25, 30 బంతులు జాగ్రత్తగా ఆడటం ఎంత ముఖ్యమో నాకు తెలుసు" అని కేఎల్ రాహుల్ అన్నాడు.
చెప్పారు.. కానీ నేను చెప్పను: రాహుల్
రెండో టెస్టులో తాను ఏ స్థానంలో ఆడబోతున్నానో టీమ్ తనకు చెప్పిందని, అయితే దానిని బయటకు వెల్లడించనని ఈ సందర్భంగా రాహుల్ అన్నాడు. "నాకు చెప్పారు. కానీ దానిని మీతో పంచుకోకూడదని నాతో చెప్పారు" అని రాహుల్ నవ్వుతూ చెప్పాడు.
తొలి టెస్టులో ఓపెనింగ్ చేయబోతున్నట్లు తనకు చాలా రోజుల ముందే చెప్పారని, దానికి సంసిద్ధం కావడానికి తనకు తగినంత సమయం దొరికిందని రాహుల్ వెల్లడించాడు. పెర్త్ టెస్టులో బౌన్సీ పిచ్ పై రాహుల్ రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన 77 రన్స్ చేయడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టీమిండియాకు 200కుపైగా తొలి వికెట్ భాగస్వామ్యం అందించిన ఘనతను యశస్వితో కలిసి అందుకున్నాడు.
తొలి పింక్ బాల్ టెస్టుపై..
కేఎల్ రాహుల్ తన కెరీర్లో తొలిసారి ఓ డేనైట్ టెస్టు ఆడబోతున్నాడు. మరి ఇందులో పింక్ బాల్ తో ఆడటానికి ఎంత వరకూ సిద్ధంగా ఉన్నాడని ప్రశ్నించగా.. తాను ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్లు తెలిపాడు. "ఇది నా తొలి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్. జట్టులోని కొందరు ప్లేయర్స్ తో పోలిస్తే ఈ విషయంలో నాకు అంతగా అనుభవం లేదు.
పింక్ బాల్ తో ఆడేటప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయో టీమ్మేట్స్ ను తెలుసుకొని అందుకు తగినట్లు మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాక్టీస్ సెషన్ లో ఈ బంతిని చూడటం కాస్త కష్టంగా అనిపించింది. మరిన్ని ప్రాక్టీస్ సెషన్లతో దీనిని అధిగమించవచ్చు" అని రాహుల్ అన్నాడు.