KKR vs SRH IPL 2024: చేతులెత్తేసిన హైదరాబాద్.. అదిరిపోయే గెలుపుతో ఫైనల్ చేరిన కోల్‍కతా
22 May 2024, 0:11 IST
- KKR vs SRH IPL 2024 Qualifier 1: ఐపీఎల్ 2024 సీజన్ ఫైనల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో హైదరాబాద్‍ను కోల్‍కతా చిత్తుచేసింది. ఆల్ రౌండ్ షోతో అయ్యర్ సేన అదరగొట్టింది.
KKR vs SRH IPL 2024: చేతులెత్తేసిన హైదరాబాద్.. అదిరిపోయే గెలుపుతో ఫైనల్ చేరిన కోల్‍కతా
KKR vs SRH IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ లీగ్ దశలో దుమ్మురేపి టాప్‍లో నిలిచిన కోల్‍కతా నైట్‍రైడర్స్.. ప్లేఆఫ్స్‌లోనూ దూకుడు కొనసాగించింది. ఫైనల్‍లో అడుగుపెట్టేసింది. సన్‍రైజర్స్ హైదరాబాద్‍పై నేడు (మే 21) జరిగిన ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫయర్‌లో కోల్‍కతా అలవోక విజయం సాధించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ పోరులో 8 వికెట్ల తేడాతో హైదరాబాద్‍ను కోల్‍కతా చిత్తు చేసింది. 38 బంతులు మిగిల్చి మరీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది శ్రేయస్ అయ్యర్ సేన. దీంతో ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్ చేరింది కేకేఆర్.
ఇద్దరు అయ్యర్ల మెరుపులు
160 పరుగుల లక్ష్యాన్ని కోల్‍కతా నైట్‍రైడర్స్ ఊదేసింది. 13.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 164 పరుగులు చేసి కోల్‍కతా గెలిచింది. కోల్‍కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (24 బంతుల్లో 58 పరుగులు; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు నాటౌట్), బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ (28 బంతుల్లో 51 పరుగులు; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు నాటౌట్) దూకుడుగా అజేయ అర్ధ శకతాలు చేశారు. ధనాధన్ బ్యాటింగ్‍తో అలవోకగా జట్టును గెలిపించేశారు. అయ్యర్లు ఇద్దరూ బౌండరీల మోత మోగించారు. అంతకంటే ముందు ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (14 బంతుల్లో 23 పరుగులు), సునీల్ నరైన్ (16 బంతుల్లో 21 పరుగులు) పర్వాలేదనిపించారు. ఆ తర్వాత శ్రేయస్, వెంకటేశ్ సునామీ హిట్టింగ్‍తో ఆడుతూ పాడుతూ టార్గెట్‍ను కరిగించేశారు.
హైదరాబాద్ కెప్టెన్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. అయితే,ఏ దశలోనూ కోల్‍కతా బ్యాటర్లను ఎస్ఆర్‌హెచ్ బౌలర్లు నిలువరించలేకపోయారు. అలాగే, ఫీల్డింగ్‍లోనూ ప్లేయర్లు తడబడ్డారు.
బ్యాటింగ్‍లో హైదరాబాద్ విఫలం
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‍రైజర్స్ హైదరాబాద్ 19.3 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. రాహుల్ త్రిపాఠి (35 బంతుల్లో 55 పరుగులు; 7 ఫోర్లు, ఓ సిక్స్) అర్ధ శతకం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (32), ప్యాట్ కమిన్స్ (30) రాణించారు. అయితే, మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్ (0) తొలి ఓవర్లోనే డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ (3), నితీశ్ సుమార్ రెడ్డి (9), షాబాజ్ అహ్మద్ (0), సన్వీర్ సింగ్ (0) ఫెయిల్ అయ్యారు. అబ్దుల్ సమాద్ (16) కాసేపే నిలిచాడు. త్రిపాఠి హాఫ్ సెంచరీ, చివర్లో కమిన్స్ పోరాటంతో హైదరాబాద్‍కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది.
కోల్‍కతా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో దుమ్మురేపగా.. వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ తలా ఓ వికెట్ తీశారు. ఈ సీజన్‍లో ఇప్పటి వరకు స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయినా.. కీలక మ్యాచ్‍లో సత్తాచాటాడు ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టార్క్.
హైదరాబాద్‍కు ఇంకా ఓ ఛాన్స్
సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఫైనల్ చేరేందుకు మరో ఛాన్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య రేపు (మే 22) జరిగే ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మే 24న క్వాలిఫయర్-2లో హైదరాబాద్ తలపడనుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 26న చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్‍లో కోల్‍కతాతో తలపడుతుంది.
కోల్‍కతా నాలుగోసారి ఫైనల్‍లో..
కోల్‍కతా నైట్‍రైడర్స్ ఐపీఎల్‍లో నాలుగోసారి ఫైనల్స్ చేరింది. గతంలో 2012, 2014, 2021లో తుదిపోరుకు చేరిన కేకేఆర్ ప్రస్తుతం 2024లోనూ టైటిల్ ఫైట్‍లో అడుగుపెట్టింది. 2012, 2014లో ఆ జట్టు ఛాంపియన్‍గా నిలిచింది. మూడో టైటిల్ లక్ష్యంగా మే 26న చెన్నై చెపాక్ స్టేడియంలో ఫైనల్‍లో కేకేఆర్ బరిలోకి దిగనుంది.