Kedar Jadhav Retirement: అచ్చూ ధోనీ స్టైల్లోనే.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్
03 June 2024, 16:27 IST
- Kedar Jadhav Retirement: టీమిండియా క్రికెటర్ కేదార్ జాదవ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అయితే తన రిటైర్మెంట్ ప్రకటన అచ్చూ మాజీ కెప్టెన్ ధోనీలాగే ఉండటం విశేషం.
అచ్చూ ధోనీ స్టైల్లోనే.. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్
Kedar Jadhav Retirement: టీమిండియా ప్లేయర్ కేదావ్ జాదవ్ సోమవారం (జూన్ 3) అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైరైయ్యాడు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటన చేసిన అతడు.. ఈ విషయంలో మాజీ కెప్టెన్ ధోనీని ఫాలో అయ్యాడు. మిస్టర్ కూల్ నాలుగేళ్ల కిందట ఎలాగైతే తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడో అలాగే కేదార్ కూడా చెప్పడం విశేషం.
కేదార్ జాదవ్ రిటైర్మెంట్
మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీతో కలిసి టీమిండియాతోపాటు ఐపీఎల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన కేదార్ జాదవ్.. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియా తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడిన అతడు.. నాలుగేళ్లుగా జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఇప్పుడు 39 ఏళ్ల వయసులో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పాడు.
2014 నుంచి 2020 మధ్య అతడు టీమిండియాకు ఆడాడు. తన రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్ చేస్తూ.. "నా కెరీర్ మొత్తం సపోర్ట్ చేసినందుకు, ప్రేమను పంచినందుకు అందరికీ థ్యాంక్స్. మధ్యాహ్నం 3 గంటల నుంచి నేను అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైరైనట్లు పరిగణించండి" అని అతడు అనడం విశేషం. నాలుగేళ్ల కిందట ధోనీ కూడా ఇలాగే తన రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు.
కేదార్ జాదవ్ కెరీర్ ఇలా..
కేదార్ జాదవ్ చివరిగా 2020లో న్యూజిలాండ్ తో వన్డే మ్యాచ్ ఆడాడు. తన తొలి మ్యాచ్ ను 2014లో రాంచీలో శ్రీలంకపై ఆడిన అతడు.. కొన్నాళ్లకే జింబాబ్వేపై తన తొలి సెంచరీ చేశాడు. మొత్తంగా 73 వన్డేల్లో 42.09 సగటుతో 1389 రన్స్ చేశాడు. అందులో ఆరు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు ఉన్నాయి. దినేష్ కార్తీక్ అధికారికంగా క్రికెట్ కు గుడ్ బై చెప్పిన రెండు రోజులకే కేదార్ కూడా రిటైరవడం విశేషం.
కేదార్ తన కెరీర్లో ఇంగ్లండ్ పై పుణెలో ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అతడు ఆ మ్యాచ్ లో కేవలం 76 బంతుల్లోనే 120 రన్స్ చేశాడు. దీంతో టీమిండియా 351 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. అదే మ్యాచ్ లో కోహ్లి కూడా సెంచరీ చేశాడు ఇద్దరూ కలిసి 200 పరుగుల భాగస్వామ్యంతో ఇండియాను గెలిపించారు.
2019 వరల్డ్ కప్ ఆడిన టీమిండియాలోనూ కేదార్ జాదవ్ సభ్యుడు. అయితే ఐదు మ్యాచ్ లలో కేవలం 80 రన్స్ చేసి నిరాశపరిచాడు. 2013-14 సీజన్ రంజీ ట్రోఫీలో రాణించిన అతడు నేషనల్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సీజన్లో అతడు 1223 రన్స్ చేసి హయ్యెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. 2018లో ఆసియా కప్ గెలిచిన టీమిండియాలోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు.
ఇక ఐపీఎల్లోనూ అతడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కొచ్చి టస్కర్స్ కేరళ, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరఫున 93 మ్యాచ్ లు ఆడి 1196 రన్స్ చేశాడు.