James Anderson: ముగిసిన ఇంగ్లండ్ లెజెండ్ ఆండర్సన్ శకం.. సచిన్ స్పెషల్ మెసేజ్
12 July 2024, 18:30 IST
- James Anderson: ఇంగ్లండ్ పేస్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంగ్లండ్ జట్టుకు గుడ్‍బై చెప్పేశాడు. ఆండర్సన్ రిటైర్మెంట్ సందర్భంగా భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ అతడికి అభినందనలు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
James Anderson: ముగిసిన ఇంగ్లండ్ లెజెండ్ ఆండర్సన్ శకం.. సచిన్ స్పెషల్ మెసేజ్
క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసింది. ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. 21 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత రిటైర్ అయ్యాడు. తన చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. స్వదేశంలోని క్రికెట్ మక్కా లార్డ్ మైదానంలో చివరిసారి బరిలోకి దిగాడు స్వింగ్ కింగ్ ఆండర్సన్. వెస్టిండీస్‍తో నేడు (జూలై 12) ముగిసిన తొలి టెస్టుతో ఇంగ్లండ్ తరఫున జేమ్స్ ఆండర్సన్ ప్రస్థానం ముగిసింది. 41 ఏళ్ల వయసులో ఆట నుంచి ఈ లెజెండ్ వైదొలిగాడు. చివరి వికెట్ కూడా అద్భుత బంతితో తీసుకున్నాడు.
704 వికెట్లు.. రికార్డు ఇదే
జేమ్స్ ఆండర్సన్ తన 21 ఏళ్ల కెరీర్లో 188 టెస్టు మ్యాచ్‍లు ఆడాడు. ఏకంగా 704 వికెట్లు పడగొట్టాడు. 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శనలు చేశాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్ల సాధించిన పేసర్ రికార్డు ఆండర్సన్ పేరిటే ఉంది. సచిన్ టెండూల్కర్ (200 టెస్టులు) తర్వాత అత్యధిక టెస్టులు ఆడిన రికార్డు కూడా అతడిదే. 2003లో టెస్టుల్లో ఆండర్సన్ అరంగేట్రం చేశాడు. వన్డేలకు 2015లోనే గుడ్‍బై చెప్పిన అతడు.. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్‍లో కొనసాగాడు.
స్వింగ్ కేరాఫ్ ఆండర్సన్
జేమ్స్ ఆండర్సన్ అద్భుత స్వింగ్ బౌలింగ్‍తో రెండు దశాబ్దాలు అదరగొట్టాడు. ఇంగ్లండ్‍కు తన పేస్ బౌలింగ్‍తో ఎన్ని విజయాలు అందించాడు. కొత్త బంతితో ఇరువైపులా బంతిని స్వింగ్ చేయటంతో పాటు బంతి పాతబడ్డాక రివర్స్ స్వింగ్ చేయడంలోనూ ఆండర్సన్ అంతే సిద్ధహస్తుడు. కళ్లు చెదిరే బంతులతో ఎన్నోసార్లు బ్యాటర్లను బోల్తా కొట్టించాడు జేమ్స్. కెరీర్లో చివరి వరకు ఫిట్‍నెస్‍తో, అంకితభావంతో మెప్పించాడు.
చివరి వికెట్ ఇలా..
ఇంగ్లండ్ గ్రేట్ జేమ్స్ ఆండర్సన్ తన చివరి 704వ టెస్టు వికెట్ కూడా అద్భుతంగా తీసుకున్నాడు. వెస్టిండీస్ బ్యాటర్ జాషువా డిసిల్వను ఔట్ చేశాడు. ఆండర్సన్ ఫుల్ లెంగ్త్ ఔట్ స్వింగర్ బంతి వేయగా.. డిసిల్వ బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్‌కు క్యాచ్ వెళ్లింది. ఇలా తన ఆఖరి టెస్టు వికెట్‍ను కూడా తన మార్క్ స్వింగ్‍తో కైవసం చేసుకున్నాడు ఆండర్సన్.
అభినందనలు తెలిపిన సచిన్
అద్భుతమైన కెరీర్ సాగించిన జేమ్స్ ఆండర్సన్‍కు అభినందనలు తెలిపారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. అతడి రిటైర్మెంట్ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు సచిన్. ఇంగ్లండ్ పేస్ భవిష్యత్తు జేమ్స్ ఆండర్సనే అని 2002లోనే నాసిర్ హుసేన్ చెప్పారని, అది నిజమైందని టెండూల్కర్ గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులందరికీ ఆండర్సన్ చాలా సంతోషాన్ని ఇచ్చారని అన్నారు.
“నువ్వు ఎప్పుడు బౌలింగ్ చేసినా చూడడం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే, నిన్ను ఎదుర్కోవడం మాత్రం ఆనందంగా ఉండదు. కొత్త బంతి అయినా.. రివర్స్ స్వింగ్ అయినా నీ మార్క్ ఉంటుంది. బ్యాటర్లను కష్టాలు పెడతావు. నువ్వు చాలా మందికి రోల్ మోడల్. 188 టెస్టు మ్యాచ్‍లు.. 700కుపైగా వికెట్లు.. అద్భుతం” అని సచిన్ టెండూల్కర్ చెప్పారు. కుటుంబంతో సమయం గడిపే ముఖ్యమైన స్పెల్ కోసం అభినందనలు అని ఆండర్సన్‍కు సందేశం పంపారు సచిన్.
ఇంగ్లండ్ భారీ గెలుపు
వెస్టిండీస్‍తో ఈ తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా సుమారు రెండున్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.