తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Irfan Pathan: అసలు ప్లానింగే లేదు.. అశ్విన్‌ను తీసుకోవడం ఏంటి.. అదృష్టానికి వదిలేశారు: ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: అసలు ప్లానింగే లేదు.. అశ్విన్‌ను తీసుకోవడం ఏంటి.. అదృష్టానికి వదిలేశారు: ఇర్ఫాన్ పఠాన్

Hari Prasad S HT Telugu

20 September 2023, 15:34 IST

google News
    • Irfan Pathan: అసలు ప్లానింగే లేదు.. అశ్విన్‌ను తీసుకోవడం ఏంటి అంటూ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్రంగా మండిపడ్డాడు. ఏడాదిన్నర కాలంగా అసలు వన్డేలు ఆడని అశ్విన్ ను ఆస్ట్రేలియా సిరీస్ కోసం ఎంపిక చేయడంపై ఇర్ఫాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
మహ్మద్ కైఫ్, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్
మహ్మద్ కైఫ్, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్

మహ్మద్ కైఫ్, అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్

Irfan Pathan: వరల్డ్ కప్ 2023 కంటే ముందు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ కోసం సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ ఈ అంశంపై విభేదించారు. అసలు ఈ మధ్యకాలంలో వన్డే క్రికెటే ఆడని అశ్విన్ ను ఎలా ఎంపిక చేస్తారని ఇర్ఫాన్ ప్రశ్నించగా.. వాషింగ్టన్ సుందర్ కంటే సీనియర్ అయిన అశ్వినే బెటరని కైఫ్ అన్నాడు.

వరల్డ్ కప్ టీమ్ లో ఎంపికైన అక్షర్ పటేల్ గాయపడటంతో అనూహ్యంగా అశ్విన్ పేరు తెరమీదికి వచ్చింది. అతనితో మాట్లాడుతాన్నానని, వరల్డ్ కప్ టీమ్ కోసం అశ్విన్ పేరు కూడా పరిశీలించే అవకాశం ఉందని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన రెండు రోజులకే ఆస్ట్రేలియా సిరీస్ కోసం అశ్విన్ ను ఎంపిక చేశారు. దీనిపై తాజాగా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించాడు.

"అక్షర్ గాయపడి ఉండకపోతే అసలు అశ్విన్ పేరు తెరపైకి వచ్చేదే కాదు. అక్షర్ గాయం నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. అతడు వారంలో తిరిగి వస్తాడని టీమ్ చెబుతున్నా.. ఇలాంటి గాయాలు మానడానికి కనీసం 2 నుంచి 3 వారాలు పడుతుంది. అందుకే అనుభవజ్ఞుడైన అశ్విన్ వైపు సెలక్టర్లు చూశారు. అశ్విన్, సుందర్ కు అసలు పోలికే లేదని గమనించండి. అశ్విన్ అన్ని ఫార్మాట్లు కలిపి 700కుపైగా వికెట్లు తీశాడు" అని కైఫ్ అన్నాడు.

అసలు ప్లానింగే లేదు: ఇర్ఫాన్

అయితే మరో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అశ్విన్ ఎంపికను తప్పుబట్టాడు. అసలు ప్లానింగే లేదని, ఏదో అదృష్టానికి వదిలేసినట్లుగా ఉందని ఇర్ఫాన్ మండిపడ్డాడు.

"అశ్విన్ గొప్ప స్పిన్నరే కావచ్చు. కానీ వరల్డ్ కప్ లాంటి తీవ్రమైన ఒత్తిడి ఉండే టోర్నమెంట్లో ఈ మధ్య కాలంలో అసలు వన్డేలే ఆడని ఓ సీనియర్ ప్లేయర్ వెళ్లి వికెట్లు తీస్తాడని అనుకోవడం సరికాదు. మొత్తంగా అదృష్టానికి వదిలేస్తున్నారు. అసలు ప్లానింగే లేదు.

ఒకవేళ అశ్విన్ కోసం ప్లాన్ ఉండి ఉంటే.. అతనికి వరల్డ్ కప్ ముందు కాస్త గేమ్ టైమ్ ఇచ్చే వారు. ఆస్ట్రేలియాతో ఆడితే సరిపోతుందా? 10 ఓవర్లు వేయాలి. జట్టులో ఇమిడిపోవాలి. జట్టుకు కావాల్సిన ఫలితం ఇవ్వాలి. అది అంత సులువు కాదు. ప్లానింగ్ చేసి ఉంటే బాగుండేది" అని ఇర్ఫాన్ స్పష్టం చేశాడు.

తదుపరి వ్యాసం