Ashwin: వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్.. రోహిత్ చెప్పేశాడు
Ashwin: వరల్డ్ కప్ టీమ్‌లోకి అశ్విన్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆసియా కప్ ఫైనల్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ చేసిన కామెంట్స్ చూస్తుంటే.. అక్షర్ స్థానంలో అశ్విన్ వచ్చే సూచనలు ఉన్నాయి.
Ashwin: వరల్డ్ కప్ టీమ్ లో అశ్విన్ కు చోటు దక్కకపోవడంపై చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అంత సీనియర్ బౌలర్, స్వదేశంలో ఆడుతున్న వరల్డ్ కప్ లో లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. అశ్విన్ దీనిపై పెద్దగా రియాక్ట్ కాకపోయినా.. ఫ్యాన్స్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచారు. అయితే మొత్తానికి అతడు జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అశ్విన్ ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఆసియా కప్ ఫైనల్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయపడటం అశ్విన్ కు కలిసిరానుంది. ఫైనల్ కు ముందు అక్షర్ గాయపడటంతో అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్, వరల్డ్ కప్ కి మాత్రం అశ్విన్ పేరు పరిగణనలోకి తీసుకోనున్నట్లు రోహిత్ చెప్పాడు.
"అక్షర్ కు తొడలో చిన్న చీలిక ఏర్పడింది. అది వారం, పది రోజుల్లో నయమయ్యే సూచనలు ఉన్నాయి. నాకు సరిగా తెలియదు. అతని గాయం ఎలా మెరుగవుతుందో చూడాలి. కొందరు వేగంగా కోలుకుంటారు. అక్షర్ కూడా అలాగే కోలుకుంటాడని అనుకుంటున్నాను. ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలు ఆడతాడని అనుకోవడం లేదు. మేము వేచి చూస్తాం" అని అక్షర్ గాయంపై రోహిత్ స్పందించాడు.
ఇక ఈ సందర్భంగా అశ్విన్ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. "స్పిన్నర్ ఆల్ రౌండర్ గా అశ్విన్ కూడా రేసులో ఉన్నాడు. నేను అతనితో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను. అక్షర్ కు చివరి నిమిషంలో గాయమైంది. వాషింగ్టన్ అందుబాటులో ఉండటంతో అతన్ని తీసుకున్నాం. ఏషియన్ గేమ్స్ క్యాంప్ లో ఉండటంతో అతడు క్రికెట్ ఫిట్ గా ఉన్నాడు. ప్లేయర్స్ పాత్రల విషయంలో నాకు పూర్తి స్పష్టత ఉంది. ప్రతి ఒక్కరూ రేసులో ఉన్నారు" అని రోహిత్ చెప్పాడు.
రోహిత్ కామెంట్స్ తో అశ్విన్ అభిమానుల్లో మళ్లీ ఆశలు రేగాయి. వరల్డ్ కప్ కంటే ముందు ఆస్ట్రేలియాతో ఇండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఆసియా కప్ విజయంతో ఊపు మీదున్న టీమిండియా.. టాప్ ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా మధ్య సిరీస్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ కంటే ముందు ఈ సిరీస్ రెండు జట్లకూ కీలకం కానుంది.