Gavaskar on Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకూ ఆ వరల్డ్ కప్ టికెట్ ఇవ్వాలి: గవాస్కర్
Gavaskar on Golden Ticket: ధోనీ, ఇస్రో చీఫ్‌లకూ ఆ వరల్డ్ కప్ గోల్డెన్ టికెట్ ఇవ్వాలని మాజీ క్రికెటర్ గవాస్కర్ అన్నాడు. వరల్డ్ కప్ ను ప్రతి స్టేడియంలో వీఐపీ బాక్స్ లో కూర్చొని చూసే విధంగా వివిధ రంగాల ప్రముఖులకు బీసీసీఐ గోల్డెన్ టికెట్ ఇస్తున్న విషయం తెలిసిందే.
Gavaskar on Golden Ticket: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఈసారి ఇండియాలో జరగనున్న విషయం తెలుసు కదా. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకూ జరగనున్న ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ పలు రంగాల ప్రముఖులకు గోల్డెన్ టికెట్ ఇస్తోంది. ఈ టికెట్ తో ప్రతి వరల్డ్ కప్ మ్యాచ్ నూ వీళ్లు వీఐపీ బాక్స్ లో కూర్చొని చూసే వీలుంటుంది.
ఇప్పటికే బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈ గోల్డెన్ టికెట్ అందుకున్నారు. అయితే ఈ టికెట్ ను టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ, ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ కు కూడా ఇవ్వాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. స్పోర్ట్స్ స్టార్ కు రాసిన కాలమ్ లో ఈ గోల్డెన్ టికెట్ పై సన్నీ స్పందించాడు.
1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన గవాస్కర్.. బీసీసీఐ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రశంసించాడు. "సంబంధిత రంగాల్లోని ప్రముఖులను గౌరవించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా తీసుకున్న నిర్ణయం ప్రశంసించదగినది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ ఈ టికెట్లను అందుకున్నారు. లిస్టులో ఇంకా ఎవరున్నారో తెలియదు.
కానీ ఇండియాను చంద్రుడిపైకి తీసుకెళ్లిన ఇస్రో చీఫ్ కూడా అందులో ఉంటారని ఆశిస్తున్నాను. ఇండియాకు ఆడిన ప్రతి ఒక్కరికీ ఈ టికెట్లు ఇవ్వడం కుదరదు. కానీ ఆయా రాష్ట్రాల అసోసియేషన్లు తమ దగ్గర మ్యాచ్ జరిగే సమయంలో అక్కడి వారికి ఈ టికెట్లు ఇవ్వాలని చెబితే మాత్రం అది మంచి నిర్ణయం. ఇక ఇండియా వరల్డ్ కప్ అందించిన ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ గోల్డెన్ టికెట్ కు అర్హులు. కపిల్ దేవ్, ఎమ్మెస్ ధోనీలకు ఈ టికెట్లు ఇవ్వాలి. ఇక ఒలింపిక్స్, వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నీరజ్ చోప్రా పేరును కూడా పరిశీలించాలి" అని గవాస్కర్ చెప్పాడు.
వీళ్లు వచ్చి మ్యాచ్ లు చూస్తారా లేదా అన్నదానితో సంబంధం లేదని, కానీ ఆ గోల్డెన్ టికెట్లు అందుకున్న వాళ్లు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని గవాస్కర్ అన్నాడు. "సాధారణంగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలలో ఇలాంటివి ఇస్తుంటారు.
ఇండియాలో ఎంతో మంది స్పోర్ట్స్ లెజెండ్స్ ఉన్నారు. వాళ్లను ఈ గోల్డెన్ టికెట్ తో గుర్తిస్తే బీసీసీఐ ఇమేజ్ మరింత పెరుగుతుంది. టెన్నిస్ లో రోహన్ బోపన్న, టేబుల్ టెన్నిస్ లో శరత్ కమల్ పేర్లు కూడా పరిశీలించాలి. వాళ్లు మ్యాచ్ లను చూసినా చూడకపోయినా వాళ్లను గుర్తించడం అనేది ముఖ్యం" అని గవాస్కర్ తన కాలమ్ లో రాశాడు.