ISRO Chief Salary: ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ నెల జీతం అంతేనా?.. ఆశ్చర్యపోతారు..-isro chief s somanaths monthly salary sparks debate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Isro Chief Salary: ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ నెల జీతం అంతేనా?.. ఆశ్చర్యపోతారు..

ISRO Chief Salary: ఇస్రో చీఫ్ సోమ్ నాథ్ నెల జీతం అంతేనా?.. ఆశ్చర్యపోతారు..

HT Telugu Desk HT Telugu
Sep 12, 2023 07:43 PM IST

ISRO Chief S Somanath's Monthly Salary: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కు చీఫ్ గా వ్యవహరిస్తున్న ఎస్ సోమనాథ్ నెల వేతనంపై ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రధాని మోదీతో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (ఫైల్ ఫొటో)
ప్రధాని మోదీతో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (ఫైల్ ఫొటో) (ANI/ PIB )

ISRO Chief S Somanath's Monthly Salary: ప్రముఖ పారిశ్రామిక సంస్థ ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా (Harsh Goenka) మంగళవారం చేసిన ఒక ట్వీట్ వైరల్ గా మారింది. భారతీయ పారిశ్రామిక వేత్తల్లో మహింద్ర అండ్ మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. వారి పోస్ట్ లకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తుంటుంది. అరుదైన, ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన కథనాలతో, సమకాలీన ఘటనలపై తక్షణ స్పందనలతో వారు పోస్ట్ లు, ట్వీట్లు చేస్తుంటారు.

ఇస్రో చీఫ్ సాలరీ

తాజాగా ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకా ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఇస్రో చీఫ్ సోమనాథ్ నెల వేతనంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ట్వీట్ కు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ నెల వేతనం రూ. 2.5 లక్షలు మాత్రమేనని ఆ ట్వీట్ లో హర్ష గోయెంకా వెల్లడించారు. డబ్బు సంపాదన కన్నా తాము కోరుకున్న రంగంలో కృషి చేయాలన్న తపన ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తీరుతో అర్థం అవుతుందని హర్ష గోయెంకా ప్రశంసించారు. ఆ వేతనం న్యాయమైదేనా? అని ఆయన ప్రశ్నించారు. వేతనం కన్నా సైన్స్ అండ్ రీసెర్చ్ రంగంలో ఆయనకున్న ఆసక్తిని, తపనను గుర్తించాలన్నారు. ‘‘ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సాలరీ నెలకు రూ. 2.5 లక్షలు. ఇది న్యాయమైన వేతనమేనా? డబ్బు కన్నా వారిని మోటివేట్ చేసే అంశాలు వేరే ఉంటాయి. ఆసక్తి, తపన ఉన్న సైన్స్, రీసెర్చ్ వంటి అంశాలపై కృషి చేయాలన్న కోరిక వారికి స్ఫూర్తినిస్తుంటుంది. దేశం గర్వించే ఫలితాలను సాధించడంపైననే వారి దృష్టి ఉంటుంది. అలాంటి వ్యక్తులకు తల వంచి నమస్కరిస్తున్నా’’ అని హర్ష గోయెంకా ట్వీట్ చేశారు.

నెటిజన్ల స్పందన

ఈ ట్వీట్ కు గంటల వ్యవధిలోనే 7.46 లక్షల వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. వందల్లో కామెంట్స్ వచ్చాయి. ‘నెలకు రూ. 2.5 లక్షలు కాదు.. సోమనాథ్ సాలరీ నెలకు రూ. 25 లక్షలు, లేదా అంతకన్నా ఎక్కువే ఉండాలి’ అని ఒక నెటిజన్ స్పందించాడు. ‘నిజమే.. డబ్బును మించిన మోటివేషన్స్ చాలా ఉంటాయి. దేశం గర్వించే పని చేయడం అత్యంత స్ఫూర్తిదాయక అంశం’ అని మరో ట్విటర్ యూజర్ రియాక్ట్ అయ్యాడు. ‘‘అది బేసిక్ సాలరీ కావచ్చు.. ఇతర పెర్క్స్, అలవెన్స్ లు కలిపితే, ఇంకా ఎక్కువ సాలరీ రావచ్చు. కానీ అదికూడా తక్కువే’’ అని మరో యూజర్ వ్యాఖ్యానించారు.