Ashwin on World Cup: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కని విషయం తెలుసు కదా. జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ లకు ఓటేసిన సెలక్టర్లు.. అశ్విన్ ను పక్కన పెట్టారు. అయితే తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అతడు.. తన సేవలను టీమ్ కు కావాలంటే ఎప్పుడైనా సిద్ధమే అని అనడం గమనార్హం.
ఇండియన్ క్రికెట్ తన మనసుకు ఎంతో దగ్గర అని అశ్విన్ అన్నాడు. "నేను టీమిండియాకు గత 14-15 ఏళ్లుగా ఆడుతున్నాను. నా కెరీర్లో గొప్ప క్షణాలు ఉన్నాయి. వైఫల్యాలూ ఉన్నాయి. నా కెరీర్లో విజయాలు, వైఫల్యాలు సమానంగా ఉన్నాయి. కానీ ఇండియన్ క్రికెట్ నా మనసుకు ఎంతో దగ్గరగా ఉంటుంది. వాళ్లకు నా సేవలు రేపు అవసరమైనా సరే నేను సిద్ధం. నా వంద శాతం ప్రదర్శన చేస్తా" అని అశ్విన్ స్పష్టం చేశాడు.
అక్షర్ పటేల్ నుంచి అందరూ చాలా ఎక్కువగా ఆశిస్తున్నారని, అతనికి కాస్త సమయం ఇవ్వాలని కూడా అశ్విన్ చెప్పాడు. "ప్రస్తుతం మనం అక్షర్ పటేల్ నుంచి చాలా ఎక్కువ ఆశిస్తున్నాం. అతనికి కాస్త సమయం ఇవ్వాలని నేను భావిస్తున్నాను. ఒకవేల అక్షర్ లేకపోతే ఆ పాత్ర ఎవరు పోషిస్తారు. శార్దూల్. అతని నుంచి ఏం ఆశిస్తున్నారు. 5-6 లేదా 8 ఓవర్లు వేసి 2, 3 వికెట్లు తీయాలనుకుంటున్నారు" అని అశ్విన్ అన్నాడు.
ఆసియా కప్ లో శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో శార్దూల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చాడు అక్షర్ పటేల్. బ్యాట్ తో చివర్లో ఫర్వాలేదనిపించినా.. బంతితోనే అతడు దారుణంగా విఫలయ్యాడు. స్పిన్ కు అనుకూలించే పిచ్ పైనా అక్షర్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్షర్ బదులు వరల్డ్ కప్ జట్టులో అశ్విన్ ను తీసుకోవాలన్న సూచనలూ వచ్చాయి.