తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Auction Dates: ఐపీఎల్ 2025 వేలం తేదీ ఖరారు, 1,574 మంది ప్లేయర్లు రిజిస్టర్.. కానీ 13% మందిని మాత్రమే కొనుగోలు

IPL 2025 Auction Dates: ఐపీఎల్ 2025 వేలం తేదీ ఖరారు, 1,574 మంది ప్లేయర్లు రిజిస్టర్.. కానీ 13% మందిని మాత్రమే కొనుగోలు

Galeti Rajendra HT Telugu

05 November 2024, 22:10 IST

google News
  • IPL 2025 Auction News: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలతో పాటు ప్లేస్‌పై కూడా అధికారిక ప్రకటన వచ్చేసింది. వేలానికి 1,574 మంది ప్లేయర్లు తమ పేర్లని రిజిస్టర్ చేసుకున్నా.. కొనుగోలు చేసేది ఎంత మందినో తెలుసా? 

ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ
ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ

ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీ

ఐపీఎల్ 2025 మెగా వేలం తేదీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం రాత్రి ప్రకటించింది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా ఈ మెగా వేలానికి ఆతిథ్యం ఇవ్వనుంది.

204 మందికే ఛాన్స్

ఈ మెగా వేలం కోసం వివిధ దేశాలకి చెందిన మొత్తం 1,574 మంది ఆటగాళ్లు తమ పేర్లని రిజిస్టర్ చేసుకున్నారు. అయితే వేలంలో 10 ఫ్రాంఛైజీలు కలిపి గరిష్టంగా 204 మంది ఆటగాళ్లని మాత్రమే కొనుగోలు చేసే వెసులబాటు ఉంది.

ఈ 204 స్లాట్‌లలో 70 మంది విదేశీ ఆటగాళ్లకి అవకాశం ఉంటుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ తమ జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాలి. అలానే మ్యాచ్ తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లకి మించి ఆడించకూడదు.

రేసులో 1574 మంది

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాని అక్టోబరు 31న టోర్నీలోని 10 ఫ్రాంఛైజీలు ఇప్పటికే సమర్పించాయి. 10 ఫ్రాంచైజీలు రిటెన్షన్ కోసం రూ.558.5 కోట్లని ఖర్చు చేసి.. కేవలం 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.

ఐపీఎల్ 2025 మెగా వేలానికి 1,574 మంది రిజిస్టర్ చేసుకోగా.. ఇందులో 1,165 మంది ఇండియన్ ప్లేయర్లు, 409 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఇందులోనే 320 మంది క్యాప్డ్ ప్లేయర్‌లు, 1,224 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. అలానే 30 మంది అసోసియేట్ నేషన్స్ ప్లేయర్‌లు కూడా ఉండటం గమనార్హం.

భారత్‌తో పాటు ఏ ఏ దేశాల ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నారంటే?

  • దక్షిణాఫ్రికా - 91 మంది
  • ఆస్ట్రేలియా - 76
  • ఇంగ్లాండ్ - 52
  • న్యూజిలాండ్ - 39,
  • వెస్టిండీస్ 33
  • ఆఫ్ఘనిస్తాన్ - 29
  • శ్రీలంక - 29
  • బంగ్లాదేశ్ - 13
  • నెదర్లాండ్స్ - 12
  • యుఎస్‌ఏ - 10
  • ఐర్లాండ్ - 9
  • జింబాబ్వే - 8
  • కెనడా - 4
  • స్కాట్లాండ్ - 2
  • యూఏఈ - 1
  • ఇటలీ - 1

సన్‌రైజర్స్ హైదరాబాద్ సాహసం

ఒక ఫ్రాంచైజీకి గరిష్టంగా రూ.120 కోట్లని బీసీసీఐ కేటాయించింది. ఇందులో రూ.75 కోట్ల వరకు రిటెన్షన్ కోసం ఖర్చు చేసుకునే వెసులబాటుని ఇచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్‌ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ ఏకంగా రూ.23 కోట్లని రిటెన్షన్ కోసం ఖర్చుచేసింది.

విరాట్ కోహ్లీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.21 కోట్లు ఖర్చు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లతో అట్టిపెట్టుకుంది. రిటెన్షన్‌లో ఈ ముగ్గురు ప్లేయర్లే టాప్-3లో ఉన్నారు. అయితే.. వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ,శ్రేయాస్ అయ్యర్‌లో ఒకరికి భారీ ధర దక్కే అవకాశం ఉంది. అలానే విదేశీ స్టార్ ప్లేయర్లకీ అదృష్టం వరించే అవకాశాలు లేకపోలేదు.

తదుపరి వ్యాసం