Gavaskar on Hardik Pandya: చెత్త బౌలింగ్.. చెత్త కెప్టెన్సీ: హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడిన గవాస్కర్
17 April 2024, 9:52 IST
- Gavaskar on Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడ్డాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీ అని అతడు అనడం గమనార్హం.
చెత్త బౌలింగ్.. చెత్త కెప్టెన్సీ: హార్దిక్ పాండ్యాపై విరుచుకుపడిన గవాస్కర్
Gavaskar on Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మరోసారి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఓటమి, చివరి ఓవర్లో ధోనీ కొట్టిన మూడు సిక్స్ లపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్ తీవ్రంగా మండిపడ్డారు. అతనిది చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీ అని సన్నీ స్పష్టం చేశాడు.
హార్దిక్ పాండ్యాది చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీ
చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా ఏకంగా 26 రన్స్ ఇచ్చిన ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే క్రీజులోకి వచ్చిన ధోనీ తొలి మూడు బంతులను సిక్స్ లుగా మలిచాడు. దీంతో 190లోపు స్కోరుకే పరిమితం అవుతుందునుకున్న సీఎస్కే.. 206 రన్స్ చేసింది. ధోనీ 4 బంతుల్లోనే 20 పరుగులతో అజేయంగా నిలిచాడు.
దీంతో తొలి ఇన్నింగ్స్ తర్వాత లైవ్ టీవీలోనే హార్దిక్ పై గవాస్కర్ విరుచుకుపడ్డాడు. "ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడూ చూడని చెత్త బౌలింగ్ ఇది. నా హీరోకి కావాల్సినట్లుగా బౌలింగ్ చేస్తాను అన్నట్లుగా అనిపించింది. అతడు సిక్స్ లు కొట్టగలిగే బాల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అన్నట్లుగా వేశాడు. ఒక సిక్స్ సరే. రెండో బంతి ఓ లెంత్ బాల్ వేశాడు. అది కూడా అదే లెంత్ బాల్ కోసం వెతుకుతున్న వ్యక్తికి వేశారు. ఇక మూడో బంతి కాళ్లపై ఫుల్ టాస్. అతడు కచ్చితంగా సిక్స్ కొడతాడని తెలుసు" అని గవాస్కర్ అన్నాడు.
"కచ్చితంగా ఇది చెత్త బౌలింగ్, చెత్త కెప్టెన్సీ. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె అంత బాగా ఆడినా సరే.. వాళ్లను 185-190 పరుగులకే పరిమితం చేయాల్సింది" అని సన్నీ అన్నాడు. అటు మరో మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా హార్దిక్ పై మండిపడ్డాడు. పేస్ బౌలర్లను చితక బాదుతుంటే స్పిన్నర్లను ఎందుకు వాడుకోలేదని అతడు ప్రశ్నించాడు.
మరీ ఎక్కువగా నవ్వుతున్నాడు
హార్దిక్ పాండ్యా ఫీల్డ్ లో నటిస్తున్నాడని పీటర్సన్ విమర్శించడం గమనార్హం. అతడు మరీ ఎక్కువగా నవ్వుతున్నాడని, అదంతా నటనగా అర్థమవుతూనే ఉందని కేపీ అన్నాడు. టాస్ ఓడినా నవ్వుతున్నాడు.. కానీ అతడు లోపల బాధపడుతున్నాడని అర్థమవుతూనే ఉంది..
ఫ్యాన్స్ అతన్ని హేళన చేస్తున్నారు. ఓ ఇండియన్ ప్లేయర్ ను కూడా వాళ్లు హేళన చేస్తున్నారంటే.. హార్దిక్ చాలా ఒత్తిడిలో ఉన్నట్లే.. దీనిపై ఏదో ఒకటి చేయాల్సిందే అని పీటర్సన్ స్పష్టం చేశాడు.
రోహిత్ సెంచరీని మించిన ధోనీ మెరుపులు
ధోనీ కేవలం నాలుగంటే నాలుగు బాల్స్ ఆడాడు. అతడు కొట్టిన ఆ 20 పరుగులే చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ మార్జిన్ కావడం విశేషం. అతని ఆ 4 బంతుల ఇన్నింగ్స్ ముందు రోహిత్ శర్మ మెరుపు సెంచరీ కూడా వృథా అయింది. గవాస్కర్ చెప్పినట్లు ధోనీ ఆ మూడు సిక్స్ లు కొట్టకపోయి ఉంటే.. ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్సే గెలిచే అవకాశం స్పష్టంగా ఉండేది.
కానీ ఏ స్టేడియంలో అయితే 13 ఏళ్ల కిందట విన్నింగ్ సిక్స్ తో ఇండియాకు వరల్డ్ కప్ అందించాడో అదే స్టేడియంలో ధోనీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. దానికి హార్దిక్ పాండ్యా బలయ్యాడు. ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్.. ఈ ఒక్క ఓవర్ తో మరోసారి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు.
టాపిక్