CSK vs RCB IPL 2024: చెన్నై బోణీ - ఆరంభపోరులోనే ఆర్‌సీబీకి షాక్
23 March 2024, 6:05 IST
CSK vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభపోరులోనే చెన్నై అద్భుత విజయాన్ని అందుకున్నది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీపై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
చెన్నై సూపర్ కింగ్స్
CSK vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‌ను గెలుపుతో మొదలుపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. శుక్రవారం జరిగిన ఆరంభపోరులో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను సీఎస్‌కే ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. కొత్త కెప్టెన్ రుతురాజ్ సారథ్యంలో చెన్నై ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించి జట్టుకు అదిరిపోయే బోణీ అందించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఈ భారీ టార్గెట్‌ను కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చెన్నై ఛేదించింది.
చెపాక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన కోహ్లి 20 బాల్స్‌లో 21 పరుగులు చేసి నిరాశపరిచాడు. కెప్టెన్ డుప్లెసిస్ 23 బాల్స్‌లో ఎనిమిది ఫోర్లతో 35 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. క్రీజులో కుదురుకుంటున్న కోహ్లితో పాటు డుప్లెసిస్‌ను ఔట్ చేసి చెన్నైకి బ్రేకిచ్చాడు ముస్తాఫిజుర్.
మాక్స్‌వెల్ డకౌట్...
ఫామ్‌లేమితో ఇబ్బందులు పడుతోన్న రజత్ పాటిదార్ మరోసారి నిరాశపరిచాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లోనే డకౌట్ అయ్యాడు. హిట్టర్ మాక్స్‌వెల్ సున్నాకే వెనుదిరగడంతో ఆర్‌సీబీ కష్టాల్లో పడింది.78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బెంగళూరును అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ కలిసి గట్టెక్కించారు. వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
అనుజ్, కార్తిక్ అండ...
యంగ్ ప్లేయర్ అనుజ్ రావత్ 25 బాల్స్‌లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అనుజ్ రావత్‌కు దినేష్ కార్తిక్ చక్కటి సహకారం అందించాడు. 26 బాల్స్‌లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 38 రన్స్ చేశాడు.వీరిద్దరు ఏడో వికెట్‌కు యాభై బాల్స్‌లోనే 95 పరుగులు భాగస్వామ్యం జోడించారు. రావత్, కార్తిక్ మెరుపులతో ఆర్‌సీబీ గౌరవప్రదమైన స్కోరును అందుకున్నది. ఇన్నింగ్ లాస్ట్ బౌల్‌కు అనుజ్ రనౌట్ అయ్యాడు. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. చాహర్‌కు ఓ వికెట్ దక్కింది. రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులే ఇచ్చాడు.
రచిన్ రవీంద్ర మెరుపులు...
174 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చెన్నై రచిన్ రవీంద్ర అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం పదిహేను బాల్స్‌లోనే మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 37 రన్స్ చేశాడు. మరో ఎండ్‌లో కెప్టెన్ రుతురాజ్ మాత్రం తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడాడు. పదిహేను బాల్స్‌లో పదిహేను పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. జోరుమీదున్న రచిన్‌ను కరణ్ శర్మ బోల్తా కొట్టించాడు.
చెన్నైని గెలిపించిన దూబే...
రహానే (27 పరుగులు), మిచెల్ (22 రన్స్) నెమ్మదిగా ఆడటంతో చెన్నై సాధించాల్సిన రన్‌రేట్ పెరిగింది. దాంతో ఈ మ్యాచ్ బెంగళూరు వైపు మొగ్గింది. ఆర్‌సీబీ అద్భుతమే చేసేలా కనిపించింది. కానీ శివమ్ దూబే, జడేజా కలిసి బెంగళూరుకు షాకిచ్చారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ జోడి ఆ తర్వాత భారీ షాట్లతో రెచ్చిపోయారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన శివమ్ దూబే 28 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. జడేజా 17 బాల్స్‌లో ఓ సిక్సర్‌తో 25 పరుగులతో దూబేకు చక్కటి సహకారం అందించారు.
ఈ జోడీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడటమే కాకుండా చెన్నైకి విజయాన్ని అందించారు. బెంగళూరు బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీసుకోగా..యశ్‌దయాల్, కరణ్ శర్మలకు తలో వికెట్ దక్కింది. స్టార్ బౌలర్ సిరాజ్ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. నాలుగు వికెట్లు తీసుకున్న ముస్తాఫిజుర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ గెలుపుతో చెన్నైకి రెండు పాయింట్లు దక్కాయి