తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024 Auction: రేపే ఐపీఎల్ 2024 వేలం.. ఈ ఐదుగురిపై కోట్ల వర్షం ఖాయం.. ఎప్పుడు ఎక్కడ చూడాలి?

IPL 2024 auction: రేపే ఐపీఎల్ 2024 వేలం.. ఈ ఐదుగురిపై కోట్ల వర్షం ఖాయం.. ఎప్పుడు ఎక్కడ చూడాలి?

Hari Prasad S HT Telugu

18 December 2023, 9:11 IST

google News
    • IPL 2024 auction: ఐపీఎల్ 2024 కోసం మరోసారి వేలం జరగనుంది. మంగళవారం (డిసెంబర్ 19) దుబాయ్ వేదికగా జరగబోయే ఈ వేలంలో ఐదుగురు విదేశీ ప్లేయర్స్ పై అందరి కళ్లూ ఉన్నాయి.
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ (AFP)

ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్

IPL 2024 auction: ఐపీఎల్ 2024 సీజన్ కోసం మరోసారి ప్లేయర్స్ మినీ వేలం జరగబోతోంది. 10 ఫ్రాంఛైజీల్లోని మొత్తం 77 ఖాళీల కోసం ఏకంగా 333 ప్లేయర్స్ పోటీ పడబోతున్నారు. అయితే వీళ్లలో ఓ ఐదుగురు విదేశీ ప్లేయర్స్ పైనే అందరి కళ్లూ ఉన్నాయి. వేలంలో వీళ్ల కోసం ఆయా ఫ్రాంఛైజీలు కోట్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ప్లేయర్స్ అందరూ గత నెలలో ముగిసిన వరల్డ్ కప్ లో రాణించిన వాళ్లే. వీళ్లలో కప్పు గెలిచిన ఆస్ట్రేలియా టీమ్ కు చెందిన ఇద్దరు, న్యూజిలాండ్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్ల నుంచి ఒక్కో ప్లేయర్ ఉన్నారు. ఈసారి వేలంలో భారీ ధర పలుకుతారని భావిస్తున్న ప్లేయర్స్ లో ఈ ఐదుగురు ఉన్నారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం.

మిచెల్ స్టార్క్, ఆస్ట్రేలియా

చివరిసారి 2015లో ఐపీఎల్లో ఆడిన ఈ ఆస్ట్రేలియా స్టార్ లెఫ్టామ్ పేస్ బౌలర్.. ఈసారి వేలం కోసం మళ్లీ తన పేరు నమోదు చేయించుకున్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ కు ముందు ఐపీఎల్ ద్వారా ఈ ఫార్మాట్లో పట్టు సంపాదించాలన్నది మిచెల్ స్టార్క్ ఉద్దేశంగా కనిపిస్తోంది. వేలంలో స్టార్క్ కే అత్యధిక ధర పలికే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. అతని కోసం రూ.20 కోట్ల వరకైనా బిడ్డింగ్ సాగొచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ స్టార్క్ 27 ఐపీఎల్ మ్యాచ్ లలో 7.17 ఎకానమీతో 34 వికెట్లు తీశాడు.

ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా

టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలను దూరం చేసిన ప్లేయర్ ట్రావిస్ హెడ్. ఈ ఏడాది మొదట్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో, గత నెలలో వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీలతో ఆస్ట్రేలియాను విజేతగా నిలిపాడు. దూకుడుగా ఆడగలిగే ఈ ప్లేయర్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయం. టాపార్డర్ లో ఇలాంటి బ్యాటర్ కోసం చూస్తున్న టీమ్స్.. ట్రావిస్ హెడ్ కోసం వేలంలో పోటీ పడే అవకాశం ఉంది.

గెరాల్డ్ కొయెట్జీ, సౌతాఫ్రికా

సౌతాఫ్రికాకు చెందిన ఈ పేస్ బౌలర్ మొన్నటి వరల్డ్ కప్ లో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. 8 మ్యాచ్ లలో 19.8 సగటుతో అతడు 20 వికెట్లు తీయడం విశేషం. ఎస్ఏ20 లీగ్ లోనూ జోబర్గ్ సూపర్ కింగ్స్ తరఫున 17 వికెట్లు తీశాడు. ఆ లీగ్ లో కొయెట్జీని తీసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీయే ఐపీఎల్ వేలంలోనూ అతని కోసం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.

రచిన్ రవీంద్ర, న్యూజిలాండ్

వరల్డ్ కప్ అందించిన మరో సెన్సేషనల్ బ్యాటర్ రచిన్ రవీంద్ర. న్యూజిలాండ్ కు చెందిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మూడు సెంచరీలు సహా వరల్డ్ కప్ లో 578 రన్స్ చేశాడు. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రచిన్ పై కన్నేశాయి. వేలంలో అతనికి భారీ ధర రావడం ఖాయమని క్రికెట్ పండితులు స్పష్టం చేస్తున్నారు.

వానిందు హసరంగ, శ్రీలంక

శ్రీలంకకు చెందిన ఈ స్పిన్ బౌలర్.. లోయర్ ఆర్డర్ లో బ్యాట్ తోనూ మెరుపులు మెరిపించగలడు. గతేడాది ఐపీఎల్లో 26 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఈసారి కూడా వేలంలో హసరంగ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడొచ్చు.

ఐపీఎల్ 2024 వేలం ఎప్పుడు? ఎక్కడ?

ఐపీఎల్ 2024 వేలం దుబాయ్ లోని కోకా కోలా అరెనాలో మంగళవారం (డిసెంబర్ 19) జరగబోతోంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ వేలం ప్రారంభం కానుంది. టీవీలో అయితే ఈ వేలం లైవ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో చూడొచ్చు. ఇక ఆన్‌లైన్ లో అయితే జియో సినిమా యాప్ లో వేలం లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.

తదుపరి వ్యాసం