Mitchell Starc: 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌కు తిరిగొస్తున్న ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్-mitchell starc set to return to ipl after 9 years ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Mitchell Starc: 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌కు తిరిగొస్తున్న ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్

Mitchell Starc: 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌కు తిరిగొస్తున్న ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్

Hari Prasad S HT Telugu
Sep 07, 2023 11:45 AM IST

Mitchell Starc: 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌కు తిరిగొస్తున్నాడు ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్. వచ్చే ఏడాది ఐపీఎల్లో తాను ఆడనున్నట్లు అతడు చెప్పాడు.

మిచెల్ స్టార్క్
మిచెల్ స్టార్క్ (Action Images via Reuters)

Mitchell Starc: ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఆడనున్నాడు. చివరిసారి 2015లో ఈ మెగా లీగ్ లో ఆడిన అతడు.. తర్వాత ఆస్ట్రేలియా టీమ్ పై ఎక్కువ దృష్టి సారించడం, కుటుంబంతో గడపడం కోసం ఇన్నాళ్లూ దూరంగా ఉన్నాడు. ఈ ఏడాది జరగబోయే మినీ వేలంలో స్టార్క్ తన పేరు నమోదు చేసుకోనున్నాడు.

నిజానికి 2018 ఐపీఎల్ వేలంలోనూ స్టార్క్ ఉన్నాడు. అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా రూ.9.4 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ వెన్ను గాయంతో అతడు ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత మళ్లీ ఐపీఎల్ కు తిరిగి రాలేదు. వచ్చే ఏడాది మాత్రం తాను ఆడబోతున్నట్లు స్టార్క్ స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు ఐపీఎల్ మంచి ప్రాక్టీస్ అవుతుందని అతడు భావిస్తున్నాడు.

"నేను కచ్చితంగా వచ్చే ఏడాది ఐపీఎల్ కు తిరిగి వెళ్తున్నాను. టీ20 వరల్డ్ కప్ కు ఇది మంచి ప్రాక్టీస్ లా పనికొస్తుంది. టీ20 వరల్డ్ కప్ లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లు ఐపీఎల్ ను ఓ మంచి అవకాశంగా భావించాలి. అందుకే నా పేరును వేలంలో నమోదు చేసుకుంటున్నాను" అని స్టార్క్ చెప్పాడు. గత కొన్నాళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ తోపాటు కుటుంబానికి స్టార్క్ ప్రాధాన్యత ఇస్తున్నాడు.

అంతేకాదు ఆస్ట్రేలియా తరఫున 100 టెస్టులు ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు. తనకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎక్కువ అవకాశాలు వచ్చాయని, అయితే వంద టెస్టులు ఆడేలా తాను మెరుగైన స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ఎంపిక చేసిన జట్టులోనూ మిచెల్ స్టార్క్ ఉన్నాడు.

జోష్ హేజిల్‌వుడ్, కెప్టెన్ కమిన్స్ తోపాటు స్టార్క్ లతో కూడిన ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. అయితే వన్డే వరల్డ్ కప్ తర్వాత తన భవిష్యత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్టార్క్ చెప్పాడు. అయితే ఎంతో మంది యువ పేసర్లు అందుబాటులోకి వస్తున్న వేళ వరల్డ్ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ నుంచి స్టార్క్ తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Whats_app_banner