Mitchell Starc Catch : మిచెల్ స్టార్క్ క్యాచ్.. ఇంతకీ ఇది ఔట్ OR నాటౌట్.. మీరు ఏమంటారు?
Ashes 2023 : యాషెస్ టెస్టులో ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ పట్టిన క్యాచ్ వివాదాస్పదంగా మారింది.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ పట్టిన క్యాచ్ పై కొత్త వివాదం నెలకొంది. రెండో ఇన్నింగ్స్‌లో 371 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆటగాడు బెన్ డకెట్‌ను స్టార్క్ అద్భుత క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించగా థర్డ్ అంపైర్ దానిని రద్దు చేశాడు. దీంతో గ్రౌండ్లో ఆందోళన నెలకొంది. ఆటగాళ్ల నుంచి నిరసనలు, మాజీ ఆటగాళ్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ యాషెస్‌లో ఆసీస్ క్యాచ్ అప్పీళ్లు చాలా వివాదాస్పదమయ్యాయి.
ఆసీస్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కుప్పకూలడంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. 12.5 ఓవర్లలో 45 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత బెన్ డకెట్, బెన్ స్టోక్స్ జట్టు కోసం కష్టపడ్డారు. కెమెరాన్ గ్రీన్ బౌన్సర్‌కు డకెట్ వెనకకు బ్యాటింగ్ చేశాడు. బౌండరీ లైన్ దగ్గర స్టార్క్ అద్భుతమైన క్యాచ్‌ని అందుకున్నాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో డకెట్ తిరిగి పెవిలియన్ బాట పట్టాడు. అయితే థర్డ్ అంపైర్ మాత్రం నౌటౌట్ గా ఇచ్చాడు.
ఇంగ్లండ్ ఐదో వికెట్ గా డకెట్ ది పడినప్పుడు ఆసీస్ శిబిరంలో సంబరాలు ఎక్కువసేపు సాగలేదు. స్టార్క్ క్యాచ్‌ను పూర్తి చేయడానికి ముందు బంతి నేలను తాకినట్లు థర్డ్ అంపైర్ కనుగొన్నాడు. థర్డ్ అంపైర్ ప్రకారం.. స్టార్క్ బంతిని గాలిలో క్యాచ్ పట్టాడు..కానీ చాలా ఫాస్ట్ గా బంతిని పిచ్‌కు తాకిస్తూ.. ముందుకు కదిలాడు. అయితే ఈ నిర్ణయాన్ని స్టార్క్, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ వ్యతిరేకించారు. అలాగే ఆసీస్ మాజీ ఆటగాళ్లు కూడా అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆసీస్ పేస్ లెజెండ్ గ్లెన్ మెక్‌గ్రాత్ స్పందిస్తూ.. 'ఇది నేను చూసిన అతిపెద్ద మూర్ఖత్వం. బంతి స్టార్క్ ఆధీనంలో ఉంది. ఒకవేళ అది ఔట్ కాకపోతే మిగతా క్యాచ్‌లన్నీ ఎలా ఔట్. అంపైర్ నిర్ణయంతో నేను విభేదిస్తున్నాను' అని మెక్‌గ్రాత్ అన్నాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం షాకింగ్ గా ఉందని ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేర్కొన్నాడు. స్టార్క్ బంతిపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నాడని ఫించ్ కూడా వాదించాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ ఇది నాటౌట్ ఎలా అని ప్రశ్నిస్తూ ముందుకు వచ్చాడు. ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కెమెరూన్ గ్రీన్ క్యాచ్ పట్టడం కూడా పెద్ద వివాదమైంది.