Gautam Gambhir : ఐపీఎల్ 2024కు గౌతమ్ గంభీర్ దూరం.. కారణం ఇదే
Gautam Gambhir : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లక్నో సూపర్‌జెయింట్స్ మెంటర్ గౌతమ్ గంభీర్ 2024 ఐపీఎల్ కు దూరమవనున్నట్టుగా తెలుస్తోంది. ఎన్నికల కారణంగా ఆయన దూరం ఉండనున్నట్టుగా సమాచారం.
వచ్చే ఏడాది సాధారణ లోక్‌సభ ఎన్నికల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్లో గౌతమ్ గంభీర్ పాల్గొనే అవకాశం లేదు. గంభీర్ తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. కాబట్టి, 2024 ఐపీఎల్ సమయంలో బిజీ షెడ్యూల్‌ను కలిగి ఉంటారు. నివేదికల ప్రకారం గౌతమ్ గంభీర్ లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీతో విడిపోడు. అయితే తన రాజకీయ బాధ్యతలపై దృష్టి సారించేందుకు కాస్త విరామం తీసుకోనున్నాడు.
జస్టిన్ లాంగర్‌ను లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమించిన తర్వాత, గౌతమ్ గంభీర్ ఫ్రాంచైజీని వదిలి కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరినట్లు వార్తలు వచ్చాయి. గౌతమ్ గంభీర్ వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి ఎందుకు వైదొలగాలని నిర్ణయించుకున్నాడనే విషయంపై తాజాగా క్లారిటీ వచ్చింది.
'గౌతమ్ గంభీర్ తదుపరి IPL సమయంలో రాజకీయ కమిట్‌మెంట్‌ల నుండి విరామం తీసుకునే అవకాశం ఉంది. అతను వేరే జట్టులోకి వెళ్లడం లేదా ఫ్రాంచైజీని విడిచిపెట్టడం లేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ పనులు ఉన్నాయి. కాబట్టి అతను వాటిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు.' అని నివేదికలు చెబుతున్నాయి.
గౌతమ్ గంభీర్ IPL 2022 ఎడిషన్‌కు ముందు లక్నో సూపర్‌జెయింట్‌లో చేరాడు. ఆయన మార్గదర్శకత్వంలో లక్నో జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఫ్రాంచైజీ రెండు పర్యాయాలు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. కానీ ఫైనల్స్‌కు చేరుకోవడంలో విఫలమైంది.
లక్నో సూపర్‌జెయింట్ ఇటీవల మాజీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్‌ను తొలగించి, అతని స్థానంలో జస్టిన్ లాంగర్‌ను నియమించింది. జట్టు వ్యూహాత్మక సలహాదారుగా MSK ప్రసాద్‌ను కూడా నియమించింది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్ 2024 పూర్తి ఎడిషన్ భారతదేశంలో జరిగే అవకాశం లేదు. 2009లో ఐపీఎల్ దక్షిణాఫ్రికాకు మారింది. 2014లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మొదటి అర్ధభాగం ఆడారు. ఆ తర్వాత 2019లో ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలగకుండా మొత్తం ఐపీఎల్ టోర్నీని రూపొందించారు. వచ్చే ఏడాది కూడా అదే జరగవచ్చు. ప్రస్తుతానికి అందరి దృష్టి 2023 వన్డే ప్రపంచకప్‌పైనే ఉంది.