తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rishabh Pant: బెంగళూరు టెస్టులో ధోనీ రికార్డుని బద్ధలు కొట్టిన రిషబ్ పంత్, నెం.1 వికెట్ కీపర్‌గా ఘనత

Rishabh Pant: బెంగళూరు టెస్టులో ధోనీ రికార్డుని బద్ధలు కొట్టిన రిషబ్ పంత్, నెం.1 వికెట్ కీపర్‌గా ఘనత

Galeti Rajendra HT Telugu

19 October 2024, 15:14 IST

google News
  • MS Dhoni Test runs: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో రిషబ్ పంత్ దూకుడుగా ఆడుతున్నాడు. భారత్ జట్టుకి ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్‌తో కలిసి అసాధారణరీతిలో పోరాడుతున్నాడు. 

రిషబ్ పంత్, ధోని
రిషబ్ పంత్, ధోని (X)

రిషబ్ పంత్, ధోని

న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మ్యాచ్‌లో నాలుగో రోజైన శనివారం కేవలం 55 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న రిషబ్ పంత్.. టెస్టుల్లో వేగంగా 2500 పరుగుల మార్క్‌ని అందుకున్న భారత క్రికెటర్‌గా నిలిచాడు. కెరీర్‌లో పంత్‌కి ఇది 12వ టెస్టు హాఫ్ సెంచరీ.

ధోనీ కంటే వేగంగా

భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 69 ఇన్నింగ్స్‌ల్లో 2,500 పరుగుల మార్క్‌ని అందుకోగా.. రిషబ్ పంత్ కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు. దాంతో ధోనీ దశాబ్ధాల రికార్డుని బద్ధలుకొట్టిన పంత్ నెం.1 భారత వికెట్ కీపర్‌గా నిలిచాడు.

భారత క్రికెట్‌లో ఇప్పటి వరకు కేవలం నలుగురు వికెట్ కీపర్లు మాత్రమే 2,500 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు పరుగులు చేశారు. ఈ జాబితాలో ధోనీతో పాటు ఫరూక్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ

రికార్డులో నలుగురే

టెస్టు క్రికెట్లో భారత్ తరఫున 2500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన వికెట్ కీపర్లు కేవలం నలుగురు మాత్రమే. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ, రిషబ్ పంత్తో పాటు ఫరూక్ ఇంజనీర్, సయ్యద్ కిర్మాణీ ఉండగా.. తాజాగా పంత్ కూడా చేరాడు. సుదీర్ఘ కెరీర్‌లో ధోనీ టెస్టుల్లో 4,876 పరుగులు చేయగా.. సయ్యద్ కిర్మానీ 2,759 పరుగులు, ఫరూఖ్ ఇంజినీర్ 2,611 పరుగులు చేశారు.

మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కేవలం 46 పరుగులకే ఆలౌటవగా.. రిషబ్ పంత్ 20 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం న్యూజిలాండ్ టీమ్ 402 పరుగులు తొలి ఇన్నింగ్స్‌లో చేయడంతో భారత్ జట్టుకి 356 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటు ఏర్పడింది. దాంతో భారత్ జట్టుకి ఓటమి తప్పదని అంతా తేల్చేశారు.

కసిగా ఆడుతున్న పంత్

కానీ.. సర్ఫరాజ్ ఖాన్ (150), రిషబ్ పంత్ (89) అసాధారణంగా మ్యాచ్‌లో పోరాడుతున్నారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కి అజేయంగా ప్రస్తుతం 209 బంతుల్లో 170 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. దాంతో భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 408/3తో కొనసాగుతుండగా.. ఆధిక్యం 52 పరుగులు ఉంది.

మ్యాచ్‌లో ఇంకా ఆదివారం ఆట మిగిలి ఉంది. దాంతో కనీసం 250పైచిలుకు టార్గెట్‌ను న్యూజిలాండ్‌కి నిర్దేశించాలని టీమిండియా ఆశిస్తోంది. కానీ మ్యాచ్‌కి వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తోంది. మ్యాచ్‌లో తొలి రోజైన బుధవారం వర్షం కారణంగా ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం