Simi Singh: ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతోన్న స్టార్ క్రికెటర్ - ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు
06 September 2024, 10:45 IST
ఐర్లాండ్ స్టార్ క్రికెటర్ సిమీ సింగ్ లివర్ సంబంధించి వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్సను పొందుతున్నట్లు తెలిసింది.ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా ఎంట్రీ ఇచ్చిన సిమీ సింగ్ పంజాబ్‌లోని మొహాలీలో జన్మించాడు.
సిమీ సింగ్
Simi Singh:ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమీ సింగ్ లివర్ సంబంధిత వ్యాధితో హాస్పిటల్ పాలయ్యాడు. ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం సిమీ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ట్రీట్‌మెంట్‌కు దాతల నుంచి సహాయం కోసం సిమీ సింగ్ ఎదురుచూస్తోన్నట్లు సమాచారం. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సిమీ సింగ్ చికిత్సను పొందుతున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్...
త్వరలోనే సిమీసింగ్‌కు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్‌ను నిర్వహించేందుకు డాక్టర్లు ఏర్పాటు చేస్తోన్నట్లు తెలిసింది. సిమీ సింగ్‌కు అతడి భార్య ఆగమ్‌దీప్ కౌర్ కాలేయ దానం చేయనున్నట్లు తెలిసింది. గత ఏడాది కాలంగా అతడు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్నట్లు తెలిసింది. బెటర్ ట్రీట్‌మెంట్ కోసం ఐర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చినట్లు కుటుంబసభ్యులు చెప్పారు.
పంజాబ్‌లో పుట్టి...
ఐర్లాండ్ క్రికెట్ టీమ్‌లో కీలక ప్లేయర్‌గా కొనసాగుతోన్న సిమీ సింగ్ ఇండియాలోనే పుట్టాడు.పంజాబ్‌లోని మొహాలీలో జన్మించిన సిమీ సింగ్ ఇండియా తరఫున అండర్ 14, అండర్ 17 క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత ఐర్లాండ్‌కు వలస వెళ్లిన అతడు ఆ దేశం తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
వన్డేల్లో సెంచరీ...
2017లో ఐర్లాండ్ తరఫున కెరీర్‌ను ప్రారంభించిన సిమీ సింగ్ ఇప్పటివరకు 35 వన్డేలు, 53 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 593 రన్స్, 39 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాపై వన్డేల్లో డెబ్యూ సెంచరీని సాధించాడు. వన్డేల్లో యూఏఈపై పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. ఓ వన్లేల్లో ఐదు వికెట్లు, యాభై రన్స్ సాధించిన అతి తక్కువ మంది క్రికెటర్లలో ఒకరిగా సిమీ సింగ్ రికార్డ్ నెలకొల్పాడు.
ఆల్‌రౌండర్‌గా...
టీ20 కెరీర్‌లో 296 రన్స్ 44 వికెట్లు తీశాడు. అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ టాలెంట్‌తో ఐర్లాండ్‌కు చక్కటి విజయాల్ని అందించాడు. రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. అనారోగ్య సమస్యలతో ఐర్లాండ్ జట్టుకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నాడు. సిమీ సింగ్ కోలుకోవాలంటూ ఐర్లాండ్ క్రికెట్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.