Shashi Tharoor: సెంచరీలు కూడా సెలెక్టర్లకు కనిపించలేదా? - శ్రీలంక టూర్ సెలెక్షన్‌పై ఎంపీ శశి థరూర్ ట్వీట్
Shashi Tharoor on Bcci: శ్రీలంక టూర్ కోసం టీ20, వన్డే టీమ్‌లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. సెలక్షన్ కమిటీ తీరుపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన ట్వీట్ క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతోంది.
Shashi Tharoor on Bcci: జూలై నెలాఖరు నుంచి శ్రీలంకలో పర్యటించనుంది టీమిండియా. మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం వన్డే, టీ20 టీమ్‌లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఇటీవలే జింబాబ్వే సిరీస్‌లో మెరుపు సెంచరీతో అదరగొట్టిన అభిషేక్ శర్మ కు సెలెక్టర్లు హ్యాండిచ్చారు. టీ20లో అభిషేక్ శర్మ కొనసాగించడం ఖాయమని అభిమానులు అనుకున్నారు.
కానీ అతడికి మాత్రం నిరాశే ఎదురైంది. అలాగే వరల్డ్ కప్ మొత్తం బెంచ్‌కు పరిమితమైన చాహల్‌కు రెండు ఫార్మెట్స్‌లో స్థానం దక్కలేదు. సంజూ శాంసన్‌ను మాత్రం కేవలం టీ20ల కోసం మాత్రమే సెలెక్ట్ చేశారు.టీ20 వరల్డ్ కప్‌లో ఆల్‌రౌండర్ జట్టుకు ఉపయోగపడతాడని అనుకున్న శివమ్ దూబే దారుణంగా నిరాశపరిచాడు.
బ్యాటింగ్‌లో తేలిపోయాడు. ఒకే మ్యాచ్‌లో బౌలింగ్ చేసి దారాళంగా పరుగులు ఇచ్చాడు. శ్రీలంక టూర్‌లో వన్డే, టీ20 రెండు టీమ్‌లలో శివమ్ దూబేకు ఛాన్స్ దక్కింది.
సెలెక్షన్ కమిటీపై విమర్శలు...
శ్రీలంక టూర్ సెలెక్షన్‌పై క్రికెట్ వర్గాలతో పాటు అభిమానుల నుంచి తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. టీమ్ సెలక్షన్ ఏ మాత్రం బాగాలేదంటూ అభిమానులు మండిపడుతోన్నారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను పక్కనపెట్టి ఫెయిలవుతోన్న ఆటగాళ్లను ఎలా చోటు కల్పించారంటూ బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ సెలెక్టర్లపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చేసిన ట్వీట్ క్రికెట్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
సంజూ శాంసన్, అభిషేక్ శర్మ...
గత వన్డేలో సెంచరీ చేసిన ఆటగాడికి శ్రీలంక టూర్ కోసం ఎంపికచేసిన టీమ్‌లో చోటు దక్కలేదని సంజూ శాంసన్‌ను ఉద్దేశించి ఈ ట్వీట్‌లో శశిథరూర్ పేర్కొన్నాడు. జింబాబ్వే సిరీస్‌లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ టీ20 టీమ్‌లో కనిపించలేదని శశిథరూర్ అన్నాడు.
టీమ్ సెలక్షన్ చూస్తుంటే రికార్డులు, అద్భుతాలు సృష్టించే అటగాళ్ల ప్రతిభ, వారి ప్రదర్శన సెలెక్టర్లకు చాలా చిన్నగా కనిపిస్తోన్నట్లుగా ఉందని శశి థరూర్ ట్వీట్ చేశాడు. ఏది ఏమైనా ఇండియా టీమ్‌కు ఆల్ ది బెస్ట్ అంటూ చివరలో చురక అంటించాడు. అతడి ట్వీట్ క్రికెట్ వర్గాల్లో దుమారాన్ని రేపుతోంది.
సూర్య కుమార్ కెప్టెన్...
శ్రీలంక సిరీస్ కోసం టీ20 టీమ్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్ ఉన్నా శుభ్‌మన్‌గిల్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. హార్దిక్ పాండ్య కేవలం టీమ్ మెంబర్ మాత్రమే కనిపించనున్నాడు.
బుమ్రాకు విశ్రాంతి...
వన్డే టీమ్ కెప్టెన్‌గా రోహిత్ కొనసానున్నాడు. కోహ్లి కూడా శ్రీలంక టూర్ ఆడనున్నాడు. వీరిద్దరు విశ్రాంతి తీసుకోనున్నట్లు వార్తలొచ్చాయి. కోహ్లి, రోహిత్ శ్రీలంక టూర్ ఆడటానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బుమ్రా మాత్రం సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడికి సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు.
జూలై 27 నుంచి ఆగస్ట్ 7 వరకు ఈ సిరీస్ సాగనుంది. ఫస్ట్ టీ20 మ్యాచ్ జూలై 27 తొలి టీ20 మ్యాచ్ జరుగనుండగా...ఫస్ట్ వన్డే ఆగస్ట్ 2న జరుగనుంది.