తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Sa Vs Aus: ఆస్ట్రేలియా తరఫున దుమ్ము రేపిన భారత సంతతి స్పిన్నర్ తన్వీర్.. సౌతాఫ్రికా చిత్తు

SA vs Aus: ఆస్ట్రేలియా తరఫున దుమ్ము రేపిన భారత సంతతి స్పిన్నర్ తన్వీర్.. సౌతాఫ్రికా చిత్తు

Hari Prasad S HT Telugu

31 August 2023, 11:15 IST

google News
    • SA vs Aus: ఆస్ట్రేలియా తరఫున దుమ్ము రేపాడు భారత సంతతి స్పిన్నర్ తన్వీర్ సాంఘా. ఆ టీమ్ తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు తీయడంతో సౌతాఫ్రికా చిత్తుగా ఓడింది.
తన్వీర్ సాంఘా
తన్వీర్ సాంఘా

తన్వీర్ సాంఘా

SA vs Aus: సౌతాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించింది ఆస్ట్రేలియా. అయితే ఈ విజయంలో ఆసీస్ తరఫున తొలి మ్యాచ్ ఆడిన భారత సంతతి ఆటగాడు తన్వీర్ సాంఘా కీలకపాత్ర పోషించడం విశేషం. చివరి నిమిషంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న అతడు 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాను ఏకంగా 111 పరుగులతో చిత్తు చేసింది ఆస్ట్రేలియా.

సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియాకు ఇదే అతిపెద్ద టీ20 విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్ తోనే మిచెల్ మార్ష్ కెప్టెన్ గా తొలి మ్యాచ్ ఆడాడు. అంతేకాదు అతడు 49 బంతుల్లోనే 92 రన్స్ చేశాడు. దీంతో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 రన్స్ చేసింది. చివర్లో వచ్చిన టిమ్ డేవిడ్ కేవలం 28 బాల్స్ లోనే 64 రన్స్ చేశాడు.

అయితే తర్వాత చేజింగ్ లో సౌతాఫ్రికా పనిపట్టాడు 19 ఏళ్ల యువ స్పిన్నర్ తన్వీర్ సాంఘా. ఆడిన తొలి మ్యాచ్ లోనే 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా 115 పరుగులకే కుప్పకూలింది. భారత మూలాలు ఉన్న ఈ ప్లేయర్.. బిగ్ బాస్ లీగ్ లో సిడ్నీ థండర్స్ తరఫున 2020-21 సీజన్ లో 21 వికెట్లు తీసి ఆస్ట్రేలియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

2021లోనే న్యూజిలాండ్ టూర్ కు ఎంపికైనా కూడా ఆడే అవకాశం మాత్రం దక్కలేదు. మళ్లీ ఇన్నాళ్లకు సౌతాఫ్రికాతో తొలి టీ20లో తుది జట్టులో చోటు దక్కింది. ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ లోనే తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. నిజానికి అతడు అంతకుముందు రోజు రాత్రే ఆస్ట్రేలియా నుంచి సౌతాఫ్రికాలో అడుగుపెట్టాడు. అయినా ఈ స్థాయిలో రాణించిన తన్వీర్ పై కెప్టెన్ మార్ష్ ప్రశంసలు కురిపించాడు.

తన తొలి అంతర్జాతీయ వికెట్ గా సౌతాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ ను ఔట్ చేశాడు తన్వీర్. రెండు ఓవర్ల తర్వాత తనలాగే సౌతాఫ్రికా తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న డివాల్డ్ బ్రెవిస్ ను ఔట్ చేశాడు. తర్వాతి బంతికే ట్రిస్టన్ స్టబ్స్ ను డకౌట్ గా వెనక్కి పంపించాడు. ఇక చివరిగా మార్కో జాన్సన్ వికెట్ తీసి ఆడిన తొలి మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసుకున్న ఘనత సొంతం చేసుకున్నాడు.

ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ ప్రిలిమినరీ జట్టులో తన్వీర్ కు చోటు దక్కింది. అయితే ఆడమ్ జంపా, ఆస్టన్ అఘార్ లను వెనక్కి నెట్టి సాంఘాకు 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కడం కష్టమే. ఒకవేళ మూడో స్పిన్నర్ కావాలని సెలక్టర్లు భావిస్తే.. తన్వీర్ వరల్డ్ కప్ ఆడే అవకాశం కూడా దక్కించుకోవచ్చు.

తదుపరి వ్యాసం