Rinku Singh: ఖరీదైన బంగ్లాను కొన్న భారత క్రికెటర్ రింకూ సింగ్, రోజుల వ్యవధిలోనే మారిపోయిన జీవితం
05 November 2024, 17:07 IST
Rinku Singh IPL 2025 Price: ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టి వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్ ధర.. ఒక్క సీజన్ వ్యవధిలోనే రూ.55 లక్షల నుంచి రూ.13 కోట్లకి పెరిగింది.
బంగ్లా కొన్న రింకు సింగ్
భారత క్రికెటర్ రింకూ సింగ్ జీవితం రోజుల వ్యవధిలో ఊహించని విధంగా మారిపోయింది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కి ఎంపికైన రింకూ సింగ్.. భారత్ జట్టుతో కలిసి సఫారీ గడ్డపైకి వెళ్లాడు.
నవంబరు 8 నుంచి అక్కడ దక్షిణాఫ్రికా టీ20 జట్టుతో 4 టీ20లను భారత్ జట్టు ఆడనుంది. అయితే.. ఈ సిరీస్ కోసం సఫారీ గడ్డపైకి వెళ్లే ముందుకు రింకూ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఉన్న ఓజోన్ సిటీ గోల్డెన్ ఎస్టేట్‌లో ఒక భారీ బంగ్లాను కొనుగోలు చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రూ.55 లక్షల నుంచి రూ.13 కోట్లు
ఐపీఎల్ 2025 సీజన్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ అక్టోబరు 31న రిటెన్షన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో రింకూ సింగ్ కూడా ఉన్నాడు. ఇటీవల భారత్ టీ20 జట్టులో మెరుపులు మెరిపిస్తున్న రింకూ సింగ్‌ని రూ.13 కోట్లకి కోల్‌కతా ఫ్రాంఛైజీ రిటెన్ చేసుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ క్రికెటర్ జీవితం మలుపు తిరగబోతోంది. ఐపీఎల్ 2024 సీజన్ కోసం రింకూ సింగ్‌కి కోల్‌కతా చెల్లించింది కేవలం రూ.55 లక్షలే కావడం గమనార్హం.
గృహప్రవేశం చేసి సఫారీ గడ్డపైకి
పేదరికం నుంచి వచ్చిన రింకూ సింగ్‌కి ఒక పెద్ద బంగ్లాని కొనుగోలు చేయాలనే కల ఉండేదట. సౌతాఫ్రికా టూర్‌కు బయలుదేరే ముందు రింకూ తన కుటుంబంతో కలిసి సంప్రదాయ పూజలు చేసి కొత్త ఇంట్లోకి ప్రవేశించాడు. గోల్డెన్ ఎస్టేట్ ఆఫ్ ఓజోన్ సిటీలోని ఇంటి నెంబరు.38లో ఇకపై రింకూ సింగ్ ఉండనున్నాడు. రింకూ సింగ్‌తో పాటు అతని తండ్రి ఖాన్ చంద్, తల్లి బీనా దేవి కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.
దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరడానికి రెండు రోజుల ముందు రింకూ సింగ్ అలీగఢ్ చేరుకుని.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
ఐపీఎల్‌లో రింకూ సింగ్ సంపాదన ఇలా
- 2017 - రూ.10 లక్షలు
- 2018 - రూ.80 లక్షలు
- 2019 - రూ.80 లక్షలు
- 2020 - రూ.80 లక్షలు
- 2021 - రూ.80 లక్షలు
- 2022 - రూ.55 లక్షలు
- 2023 - రూ.55 లక్షలు
- 2024- రూ.55 లక్షలు
- 2025 - రూ.13 కోట్లు
ఐపీఎల్‌లో రింకూ సింగ్ హవా
2017 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న రింకూ సింగ్ ఇప్పటివరకు 45 మ్యాచ్‌లు ఆడి 893 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండగా.. అతని స్ట్రైక్‌రేట్ 143.34గా ఉండటం గమనార్హం. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఒకే ఓవర్‌లో యశ్ దయాల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు కొట్టిన రింకూ సింగ్.. ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు.
భారత్ టీ20 జట్టులోనూ కీలక ప్లేయర్‌గా రింకూ సింగ్ ఎదిగాడు. టాప్ ఆర్డర్‌లో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల రింకూ సింగ్.. అలవోకగా సిక్సర్లు బాదగలడు. మరీ ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఫినిషర్‌గా రింకూ సింగ్‌కి అసాధారణ రికార్డు ఉంది.