IND vs ENG: సిరీస్ ఇండియాదే.. టెన్షన్ పెట్టినా గెలిచిన భారత్
26 February 2024, 14:28 IST
- IND vs ENG 4th Test: ఇంగ్లండ్‍పై నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను సొంతం చేసుకుంది. శుభ్‍మన్ గిల్ అర్ధ శతకంతో అదరగొట్టాడు.
IND vs ENG: సిరీస్ ఇండియాదే.. టెన్షన్ పెట్టినా గెలిచిన భారత్
IND vs ENG Test Series: స్వదేశంలో ఇంగ్లండ్‍పై టెస్టు సిరీస్‍ను భారత్ కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో అద్భుత విజయాన్ని టీమిండియా సాధించింది. 3-1తో దూసుకెళ్లి ఐదు టెస్టుల సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలిన ఉండగానే రోహిత్‍సేన కైవసం చేసుకుంది. రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. మ్యాచ్ నాలుగో రోజైన నేడు (ఫిబ్రవరి 26) రెండో సెషన్‍లో టీమిండియా గెలిచింది.
వరుస వికెట్లతో టెన్షన్
ఇంగ్లండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. అయితే, ఓ దశలో వెనువెంటనే మూడు వికెట్లు పడటంతో కాసేపు టెన్షన్ ఎదురైంది. రజత్ పటిదార్ (0), రవీంద్ర జడేజా (4), సర్ఫరాజ్ ఖాన్ (0) త్వరగా ఔటయ్యారు. దీంతో ఓ దశలో 99 పరుగులకు 2 వికెట్ల వద్ద ఉన్న భారత్.. 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
గిల్, జురెల్ అదుర్స్
అయితే, ఆ సమయంలో భారత యంగ్ స్టార్ శుభ్‍మన్ గిల్ (52 పరుగులు నాటౌట్) అజేయ అర్ధ శకతంతో అదరగొట్టగా.. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన యువ బ్యాటర్ ధృవ్ జురెల్ (39 పరుగులు నాటౌట్) మరోసారి మెరిశాడు. ఇద్దరూ క్రమంగా పరుగులు రాబట్టి లక్ష్యాన్ని కరిగించారు. మరో వికెట్ పడకుండా ఆడి.. టీమిండియాను గెలుపు తీరం దాటించారు. 72 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి భారత్ గెలిచింది. అంతకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (55) కూడా అర్ధ శకతంతో సత్తాచాటాడు.
రాణించిన రోహిత్
40/0 వద్ద నాలుగో రోజు ఆటకు భారత్ దిగింది. రోహిత్, యశస్వి జైస్వాల్ (37) దీటుగా ఆడారు. దీంతో భారత్ గెలుపు సునాయాసం అవుతుందని అందరూ భావించారు. అయితే, యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. 84 రన్స్ వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం అర్ధ శకతం చేశాక రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. రజత్ పాటిదార్ (0) కూడా ఎక్కువ సేపు నిలువలేదు. లంచ్ తర్వాత రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్‍ను వరుస బంతుల్లో ఔట్ చేశారు ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్. దీంతో టీమిండియా క్యాంప్‍లో టెన్షన్ మొదలైంది. అప్పుడు శుభ్‍మన్ గిల్, ధృవ్ జురెల్ నిలకడగా ఆడారు. ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఆడటంతో పాటు పరుగులు కూడా వేగంగా రాబట్టారు. గిల్ తన టెస్టు కెరీర్లో ఆరో అర్ధ శకతం చేరుకున్నాడు. ఆరో వికెట్‍కు అజేయంగా 72 పరుగుల జోడించారు గిల్, జురెల్. భారత్‍ను గెలిపించారు.
జురెల్ మరోసారి..
తన కెరీర్లో తొలి టెస్టు సిరీస్ ఆడుతున్న భారత యువ వికెట్ కీపింగ్ బ్యాటర్ ధృవ్ జురెల్ ఈ నాలుగో టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పీకల్లోతు కష్టాల్లో టీమిండియాను ఆదుకున్నాడు. ఇంగ్లండ్ చేతికి భారీ ఆధిక్యం వెళ్లకుండా ఎదురొడ్డి నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 149 బంతుల్లోనే 90 పరుగులు చేసి సత్తాచాటాడు జురెల్. తన టెస్టు కెరీర్లో తొలి అర్ధ శకతం చేశాడు. అద్భుతమైన బ్యాటింగ్‍తో మెప్పించాడు. మరో ఎండ్‍లో టేలెండర్లను పెట్టుకొని ఆడిన ఇన్నింగ్స్‌పై ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో జట్టుకు అత్యంత కీలకమైన సమయంలో అజేయంగా 39 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‍ను భారత గెలువడంలో జురెల్‍దే కీలకపాత్ర. దీంతో అతడికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 353 పరుగులు చేయగా.. భారత్ 307 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‍ను 145 పరుగులకే భారత బౌలర్లు కుప్పకూల్చారు. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లు, కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లిష్ జట్టు పనిపట్టారు. 192 పరుగుల లక్ష్యఛేదనను భారత్ నేడు పూర్తి చేసింది.
ఈ గెలుపుతో ఈ ఐదు టెస్టుల సిరీస్‍ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు మార్చి 7వ తేదీన ధర్మశాలలో మొదలవుతుంది.
టాపిక్