Ind W vs SA W: మొన్న మెన్స్ వరల్డ్ కప్.. ఇప్పుడు వుమెన్స్ టెస్ట్ మ్యాచ్.. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఇండియన్ టీమ్
01 July 2024, 17:03 IST
Ind W vs SA W: సౌతాఫ్రికా మెన్స్ టీమ్ ను చిత్తు చేసి టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవగా.. ఇప్పుడు వుమెన్స్ టీమ్ 10 వికెట్ల తేడాతో ఏకైక టెస్ట్ లో విజయం సాధించింది. చివరి రోజు ఇండియన్ వుమెన్స్ టీమ్ గెలవడం విశేషం.
మొన్న మెన్స్ వరల్డ్ కప్.. ఇప్పుడు వుమెన్స్ టెస్ట్ మ్యాచ్.. సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించిన ఇండియన్ టీమ్
Ind W vs SA W: సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ తో జరిగిన ఏకైక టెస్టులో ఇండియన్ వుమెన్స్ టీమ్ 10 వికెట్లతో గెలిచింది. ఎన్నో రికార్డులు బ్రేకయిన ఈ మ్యాచ్ లో చివరికి హర్మన్‌ప్రీత్ టీమ్ సులువుగా విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో షెఫాలీ వర్మ డబుల్ సెంచరీ, స్మృతి మంధాన సెంచరీ, స్నేహ్ రాణా 8 వికెట్ల ప్రదర్శన ఇండియన్ టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించాయి.
పది వికెట్లతో సౌతాఫ్రికా చిత్తు
సౌతాఫ్రికా మెన్స్ టీమ్ తో శనివారం (జూన్ 29) జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియన్ మెన్స్ టీమ్ 7 పరుగులతో గెలిచి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలుసు కదా. ఇప్పుడు మన వుమెన్స్ కూడా అదే సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ తో జరిగిన ఏకైక టెస్టులో 10 వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఫాలో ఆన్ ఆడిన సౌతాఫ్రికా టీమ్ విధించిన 37 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండానే చేజ్ చేసింది.
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియన్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా 6 వికెట్లకు 603 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ, స్మృతి మంధానా సెంచరీతోపాటు రిచా ఘోష్, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ హాఫ్ సెంచరీలు చేశారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా కేవలం 266 పరుగులకే కుప్పకూలడంతో ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో స్నేహ్ రాణా 8 వికెట్లు తీసింది.
రెండో ఇన్నింగ్స్ లో దీటుగా..
అయితే సౌతాఫ్రికా ఫాలో ఆన్ ఆడుతూ.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కాస్త దీటుగా స్పందించింది. ఓపెనర్ లారా వోల్వార్ట్, సూనే లూస్ సెంచరీలు చేయడంతో ఆ టీమ్ 373 రన్స్ చేసింది. దీంతో ఇన్నింగ్స్ విజయం సాధించాలనుకున్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. అయితే కేవలం 37 పరుగుల లక్ష్యమే కావడంతో సులువుగానే చేజ్ చేసేశారు.
9.2 ఓవర్లలోనే ఓపెనర్లు షెఫాలీ వర్మ, శుభ సతీష్ వికెట్ నష్టపోకుండా చేజ్ చేశారు. దీంతో సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ తో జరిగిన ఏకైక టెస్టులో ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి రోజే పలు రికార్డులు నమోదైన విషయం తెలిసిందే. ఒకే రోజు ఇండియన్ టీమ్ ఏకంగా 525 పరుగులతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేయగా.. షెఫాలీ కేవలం 195 బంతుల్లోనే డబుల్ సెంచరీతో వుమెన్స్ క్రికెట్ లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదు చేసింది.