Ind W vs SA W Test: సౌతాఫ్రికా వుమెన్స్ టీమ్ తో జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి రోజే ఇండియన్ టీమ్ ఓపెనర్లు చెలరేగిపోయారు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో షెఫాలీ వర్మ చరిత్ర సృష్టించగా.. టాప్ ఫామ్ లో ఉన్న స్మృతి మంధానా మరో సెంచరీ చేసింది. దీంతో ఇండియన్ టీమ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఏకంగా 4 వికెట్లకు 525 పరుగులు చేయడం విశేషం.
ఆడుతున్నది టెస్టు మ్యాచే అయినా.. తొలి రోజే ఇండియన్ వుమెన్స్ టీమ్ ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన వన్డే మ్యాచ్ స్థాయిలో చెలరేగిపోయారు. ఓవర్ కు 5 పరుగులకుపైనే చేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 292 పరుగులు జోడించడం విశేషం. ఇక 20 ఏళ్ల షెఫాలీ వర్మ కేవలం 194 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసింది.
గతంలో 248 బంతులతో అనబెల్ సదర్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్ లో షెఫాలీ బ్రేక్ చేసింది. ఇక టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో ఇండియన్ ప్లేయర్ గానూ షెఫాలీ నిలిచింది. గతంలో 22 ఏళ్ల కిందట మిథాలీ రాజ్ తొలిసారి డబుల్ సెంచరీ చేసింది. ఆ మ్యాచ్ లో ఆమె 407 బంతుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడి 214 రన్స్ చేసింది.
శుక్రవారం (జూన్ 28) సౌతాఫ్రికాతో షెఫాలీ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం మరింత ప్రత్యేకమనే చెప్పాలి. సఫారీ బౌలర్లపై ఆమె విరుచుకుపడింది. డబుల్ సెంచరీని కూడా రెండు వరుస సిక్స్ లు కొట్టి పూర్తి చేయడం విశేషం. చివరికి షెఫాలీ 197 బంతుల్లోనే 205 రన్స్ చేసి రనౌట్ గా వెనుదిరిగింది. ఆమె ఇన్నింగ్స్ లో ఏకంగా 23 ఫోర్లు, 8 సిక్స్ లు ఉన్నాయి.
ఇంకాసేపు క్రీజులో ఉండి ఉంటే ఓ ఇండియన్ వుమన్ ప్లేయర్ అత్యధిక పరుగుల రికార్డు కూడా బ్రేకయ్యేదే. ఇక వరల్డ్ రికార్డుకు 38 పరుగుల దూరంలో నిలిచిపోయింది. పాకిస్థాన్ వుమెన్స్ టీమ్ కు చెందిన కిరణ్ బలూచ్ 2004లో వెస్టిండీస్ పై చేసిన 242 పరుగులకే మహిళల క్రికెట్ లో ఇప్పటికీ అత్యధిక వ్యక్తిగత స్కోరుగా కొనసాగుతోంది.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేసిన స్మృతి మంధానా ఏకైక టెస్టులోనూ అదే ఫామ్ కొనసాగిస్తోంది. షెఫాలీ వర్మతో కలిసి తొలి వికెట్ కు స్మృతి ఏకంగా 292 రన్స్ జోడించింది. ఈ క్రమంలో ఆమె 161 బంతుల్లో 149 రన్స్ చేసింది. అందులో 27 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. షెఫాలీతో కలిసి ఆమె నెలకొల్పిన 292 పరుగుల భాగస్వామ్యం కూడా వుమెన్స్ క్రికెట్ లో అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం కావడం విశేషం.