India vs Zimbabwe 2nd T20: అదిరిన వరల్డ్ ఛాంపియన్స్ దెబ్బ.. చిత్తుచిత్తుగా ఓడిన జింబాబ్వే
07 July 2024, 19:48 IST
- India vs Zimbabwe 2nd T20: టీ20 వరల్డ్ ఛాంపియన్స్ దెబ్బ అదిరిపోయింది. షాకింగ్ ఓటమి ఎదురైన మరుసటి రోజే జింబాబ్వేను చిత్తుచిత్తుగా ఓడించి గట్టి ప్రతీకారమే తీర్చుకుంది యంగిండియా.
అదిరిన వరల్డ్ ఛాంపియన్స్ దెబ్బ.. చిత్తుచిత్తుగా ఓడిన జింబాబ్వే
India vs Zimbabwe 2nd T20: వరల్డ్ ఛాంపియన్స్ దెబ్బ అంటే ఇలా ఉండాలి. ఊహించిన ఓటమి ఎదురైన 24 గంటల్లోనే దెబ్బకు దెబ్బ తీశారు. ఓ వైపు అభిషేక్ మెరుపు సెంచరీ.. మరోవైపు బౌలర్ల సమష్టి కృషితో రెండో టీ20లో జింబాబ్వేను ఏకంగా 100 పరుగులతో చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. తొలి టీ20లో 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఇదే యంగిండియా.. రెండో మ్యాచ్ లో మాత్రం ఏకంగా 234 పరుగులు బాదడం విశేషం.
జింబాబ్వే చిత్తు చిత్తు
తొలి టీ20లో 12 పరుగులతో సంచలన విజయం సాధించిన జింబాబ్వే రెండో టీ20లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లలో దారుణంగా విఫలమైంది. 235 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ టీమ్.. 18.4 ఓవర్లలోనే 134 పరుగులకు ఆలౌటైంది. అవేష్ ఖాన్, ముకేశ్ కుమార్ చెరో 3 వికెట్లు తీసుకున్నారు. అసలు ఏ దశలోనూ జింబాబ్వే లక్ష్యం వైపు వెళ్లలేదు.
తొలి 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసినా.. ధాటిగా ఆడిన బెన్నెట్ (9 బంతుల్లో 26) ఔటవడంతో ఆ టీమ్ గాడి తప్పింది. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఈ విజయంతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్ ను 1-1తో సమం చేసింది. మూడో టీ20 బుధవారం (జులై 10) జరగనుంది.
అభిషేక్ వీరబాదుడు
అంతకుముందు టీమిండియా 20 ఓవర్లలోనే 2 వికెట్లకు 234 పరుగుల భారీ స్కోరు చేసింది. అభిషేక్ మెరుపు సెంచరీ, రుతురాజ్ హాఫ్ సెంచరీ, రింకు సింగు చివర్లో మెరుపులతో వరల్డ్ ఛాంపియన్స్ రికార్డు స్కోరు సాధించింది.
ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున్ ట్రావిస్ హెడ్ తో కలిసి ఓపెనింగ్ చేసిన అభిషేక్ శర్మ ఎలా చెలరేగాడో మనకు తెలుసు. ఆ మెరుపులతోనే ఇప్పుడు టీమిండియాలోకి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో డకౌటై నిరాశ పరిచినా.. రెండో మ్యాచ్ లో మాత్రం తన ఐపీఎల్ ఫామ్ కొనసాగించాడు. కేవలం 46 బంతుల్లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు.
ముఖ్యంగా జింబాబ్వే బౌలర్ డియోన్ మయర్స్ ఒకే ఓవర్లో 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో అభిషేక్ వరుసగా 4, 6, 4, 6, 4 కొట్టడం విశేషం. అంతేకాదు తన సెంచరీని కూడా తనదైన స్టైల్లో వరుసగా మూడు సిక్సర్లు బాది చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే అతడు ఔటయ్యాడు. 28 పరుగులు దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ తర్వాత చెలరేగిపోయాడు.
తనకు లైఫ్ దొరికిన తర్వాత అతడు కేవలం 22 బంతుల్లోనే 72 రన్స్ చేయడం విశేషం. అతనికి రుతురాజ్ గైక్వాడ్ చక్కని సహకారం అందించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) విఫలమైన సమయంలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. అభిషేక్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 137 పరుగులు జోడించడం విశేషం. అతడు చివరి వరకూ క్రీజులోనే ఉన్నాడు.
రుతురాజ్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 77 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు రింకు సింగ్ 22 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 48 రన్స్ చేశాడు. చివర్లో వరుసగా రెండు సిక్స్ లతో ఇన్నింగ్స్ ముగించడం విశేషం.
ఇండియా తరఫున మూడో వేగవంతమైన సెంచరీ
అంతర్జాతీయ టీ20ల్లో ఇండియా తరఫున మూడో వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ శర్మ నమోదు చేశాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత కేఎల్ రాహుల్ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇండియా తరఫున టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ పేరిట ఉంది. అతడు 2017లో శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
ఆ తర్వాత గతేడాది సూర్యకుమార్ యాదవ్ కూడా అదే శ్రీలంకపై 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది ఇండియా తరఫున రెండో వేగవంతమైన సెంచరీ. ఇక 2016లో కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పై 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. అతడు కూడా 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్స్ లతో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.
టాపిక్