Abhishek Sharma: 25 బాల్స్‌లో సెంచరీ - 396 స్ట్రైక్ రేట్ - దంచికొట్టిన సన్‌రైజర్స్ హిట్టర్ అభిషేక్ శర్మ
Abhishek Sharma: ఐపీఎల్ 2024లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో క్రికెట్ అభిమానులను అలరించిన సన్‌రైజర్స్ హిట్టర్ అభిషేక్ శర్మ క్లబ్ క్రికెట్‌లో 25 బాల్స్‌లోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 14 సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టాడు.
Abhishek Sharma: 2024 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ చేరుకోవడంలో అభిషేక్ శర్మ కీలక భూమిక పోషించాడు. ప్రత్యర్థి ఎవరనే పట్టింపులు లేకుండా ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టాడు. పదహారు మ్యాచుల్లో 204 స్ట్రైక్ రేట్‌తో 484 రన్స్ చేశాడు అభిషేక్ శర్మ. ఈ సీజన్‌లో 42 సిక్స్‌లు కొట్టిన అభిషేక్ శర్మ మోస్ట్ సిక్సెస్ అవార్డును సొంతం చేసుకున్నాడు. బౌలింగ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అభిషేక్ శర్మపై మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ప్రశంసలు కురిపించారు. అభిషేక్ శర్మను టీమ్ ఇండియాకు సెలెక్ట్ చేయాలంటూ సలహాలు ఇచ్చారు.
25 బాల్స్‌లో సెంచరీ...
ఐపీఎల్ జోరును క్లబ్ క్రికెట్‌లోనూ కొనసాగించాడు అభిషేక్ శర్మ. గురుగావ్ వేదికగా జరిగిన క్లబ్ క్రికెట్ మ్యాచ్‌లో 25 బాల్స్‌లోనే అభిషేక్ శర్మ సెంచరీ సాధించాడు. క్లబ్ క్రికెట్‌లో భాగంగా శనివారం పంటర్స్ 11, మారియో క్రికెట్ టీమ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పంటర్స్ 11 టీమ్‌కు ప్రాతినిథ్యం వహించిన అభిషేక్ శర్మ ప్రత్యర్థులకు చుక్కులు చూపించాడు.
14 సిక్సర్లు...
ఈ మ్యాచ్‌లో ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు అభిషేక్ శర్మ. 25 బాల్స్‌లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. సెంచరీ చేసిన తర్వాత బాల్‌కే అభిషేక్ శర్మ ఔట్ కావడంతో అతడి జోరుకు బ్రేక్ పడింది. ఈ మ్యాచ్‌లో 26 బాల్స్‌లో 103 రన్స్ చేశాడు అభిషేక్ శర్మ. అతడి ఇన్నింగ్స్‌లో 14 సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. సిక్సర్లు, ఫోర్లతోనే అతడు వంద పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ మొత్తంలో ఓ సింగిల్‌తో పాటు టుడీ తీశాడు అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్‌లో 396 స్ట్రైక్ రేట్‌తో అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేశాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ విధ్వంసం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
11 బాల్స్ మిగిలుండగానే...
ఈ టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మారియో క్రికెట్ క్లబ్ ఇరవై ఓవర్లలో 249 రన్స్ చేసింది. నదీమ్ ఖాన్ 74, కృనాల్ సింగ్ 60 పరుగులతో మారియో క్రికెట్ క్లబ్‌కు భారీ స్కోరు అందించారు. ఈ టీ20లో ఒక ఓవర్ బౌలింగ్ చేసిన అభిషేక్ శర్మ పదమూడు పరుగులు ఇచ్చాడు. వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
అభిషేక్ శర్మ మెరుపులతో మరో 11 బాల్స్ మిగిలుండగానే పంటర్స్ 11 టీమ్ గె లిచింది. అభిషేక్ శర్మతో పాటు పునీత్ మెహ్రా 52, లక్షయ్ 44 రన్స్ చేశారు.
జింబాబ్వే, వెస్టిండీస్ సిరీస్ లలో…
టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా జింబాబ్వే, వెస్టిండీస్‌లతో టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సీరిస్‌లలో అభిషేక్ శర్మకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఐపీఎల్ లీగ్‌లో మెరుపులు మెరిపించిన అభిషేక్ ప్లేఆఫ్స్ తో పాటు ఫైనల్‌లో మాత్రం అంచనాలకు తగ్గట్లుగా ఆడలేకపోయాడు. ఫైనల్‌లో కోల్‌కతా చేతిలో ఓటమి పాలైన సన్‌రైజర్స్ రన్నరప్ ట్రోఫీగో సరిపెట్టుకుంది.