Ind vs Pak T20 WC 2024: గెలిచేది కచ్చితంగా ఇండియానే: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
31 May 2024, 17:13 IST
- Ind vs Pak T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియా, పాకిస్థాన్ మధ్య జూన్ 9న కీలకమైన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇందులో కచ్చితంగా గెలిచేది ఇండియానే అని పాక్ మాజీ క్రికెటర్ అనడం గమనార్హం.
గెలిచేది కచ్చితంగా ఇండియానే: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
Ind vs Pak T20 WC 2024: ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కొన్ని రోజల ముందు నుంచే హడావిడి ఉంటుంది. రెండు జట్ల మాజీలు, అభిమాలను మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. విజయం తమదంటే తమదంటూ వాదించుకుంటారు. కానీ ఈసారి మాత్రం పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ స్పందిస్తూ.. కచ్చితంగా ఇండియానే గెలుస్తుందని తేల్చేశాడు.
కమ్రాన్ అక్మల్ అంచనా ఇది
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9న పాకిస్థాన్ తో ఇండియా తలపడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ గా దీనిని అభివర్ణిస్తారు. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ స్పందించాడు. ఈ మ్యాచ్ లో గెలిచేది ఇండియానే అని అతడు తేల్చి చెప్పాడు.
ఈ మ్యాచ్ పై మీ అంచనా ఏంటని ఇన్‌స్టాగ్రామ్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అక్మల్ స్పందించాడు. "కచ్చితంగా ఇండియానే" అని అక్మల్ స్పష్టం చేశాడు. అంతేకాదు ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి ఏంటో కూడా అందరికీ తెలుసని అతడు అనడం గమనార్హం. పాకిస్థాన్ తో సిరీస్ కంటే ఇంగ్లండ్ ప్లేయర్స్ ఐపీఎల్ మొత్తం ఆడి ఉంటే బాగుండేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ అనడాన్ని అక్మల్ ప్రస్తావించాడు.
పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి తెలుసు కదా?
వాన్ కామెంట్స్ పై అక్మల్ స్పందిస్తూ.. "గత కొన్ని రోజులుగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పాకిస్థాన్ క్రికెట్ ను అంత సీరియస్ గా తీసుకోకుండా ఏవో కామెంట్స్ చేస్తున్నాడు. ఇది బాధించే విషయమే కానీ అతని అంచనా సరైనదే" అని అక్మల్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ అన్నాడు.
"ప్రతి ఒక్కరికీ పాకిస్థాన్ క్రికెట్ దుస్థితి తెలుసు. ఐర్లాండ్ లాంటి చిన్న జట్లపైనా ఓడిపోతున్నాం. అది దృష్టిలో ఉంచుకొనే ఇది అంత కఠినమైన సిరీస్ కాదని వాన్ చెప్పి ఉంటాడు. ఆ తప్పు మాదే. పాకిస్థాన్ కాకుండా ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలాంటి టీమ్స్ ఉండి ఉంటే వాన్ ఈ మాట అనేవాడు కాదు. ఐపీఎల్లో బెస్ట్ బౌలర్లు, బ్యాటర్లు సుమారు 50 వేల మంది ప్రేక్షకుల ముందు ఆడతారు. అది చాలా కఠినమైన, నాణ్యమైన క్రికెట్" అని అక్మల్ అనడం విశేషం.
టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్
2007లో తొలిసారి జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ రెండుసార్లు తలపడ్డాయి. ఈ రెండుసార్లూ ఇండియానే విజయం సాధించింది. ఫైనల్లోనూ 5 పరగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచింది అప్పుడే. ఆ తర్వాత పాకిస్థాన్ 2009లో ఈ మెగా టోర్నీ గెలిచింది.
మరోవైపు 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ పాకిస్థాన్ ను ఇండియా చిత్తు చేసింది. ఈసారి పాకిస్థాన్ ఫైనల్ చేరినా.. అక్కడ ఇంగ్లండ్ చేతుల్లో ఓటమి తప్పలేదు. చెరో వరల్డ్ కప్ విజయంతో ఈసారి రెండు టీమ్స్ బరిలోకి దిగుతున్నాయి. మరి జూన్ 9న జరగనున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.
టాపిక్