India vs England Live Score: తొలి సెషన్‌లోనే ఇంగ్లండ్ 5 వికెట్లు డౌన్.. టీమిండియా గెలుస్తుందా?
05 February 2024, 11:44 IST
- India vs England Live Score: విశాఖపట్నం టెస్టులో టీమిండియాపై విజయంపై కన్నేసింది. నాలుగో రోజు తొలి సెషన్ లోనే ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయింది. లంచ్ సమయానికి 6 వికెట్లకు 194 రన్స్ చేసింది.
నాలుగో రోజు తొలి సెషన్ లోనే 5 ఇంగ్లండ్ వికెట్లు తీసిన టీమిండియా ప్లేయర్స్ సంబరాలు
India vs England Live Score: హైదరాబాద్ లో ఇంగ్లండ్ చేతుల్లో ఎదురైన పరాభవానికి విశాఖపట్నంలో ప్రతీకారం తీర్చుకునే దిశగా టీమిండియా వెళ్తోంది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు లంచ్ సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 194 రన్స్ చేసింది.
ఇంగ్లండ్ విజయానికి మరో 205 రన్స్ అవసరం కాగా.. ఇండియా 4 వికెట్ల దూరంలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్ లో ఇండియన్ టీమ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
ఒకే సెషన్‌లో 5 వికెట్లు
భారీ లక్ష్యం ముందున్న, ఇండియన్ స్పిన్నర్లు ఊపు మీదున్నా ఇంగ్లండ్ మాత్రం నాలుగో రోజు తొలి సెషన్ లో ధాటిగానే ఆడింది. వికెట్ నష్టానికి 57 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. తొలి సెషన్ లోనే 137 రన్స్ జోడించడం విశేషం. అయితే ఈ క్రమంలో ఆ టీమ్ ఐదు వికెట్లు కోల్పోవడంతో ఇండియా మ్యాచ్ పై పట్టు బిగించింది.
తొలి సెషన్ లో ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోతోనూ ఉన్నా.. దాదాపు ప్రతి ఓవర్లో ఓ బౌండరీ బాదుతూ ఇండియన్ బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అయితే ఇండియన్ బౌలర్లు కూడా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 3 వికెట్లు తీసుకోగా.. బుమ్రా, కుల్దీప్, అక్షర్ తలా ఒక వికెట్ తీశారు. లంచ్ కు ముందు ఐదు నిమిషాల వ్యవధిలో ఇంగ్లండ్ రెండు కీలకమైన వికెట్లు కోల్పోయింది.
మ్యాచ్ ఎవరి వైపు?
ఇంగ్లండ్ నాలుగో రోజు తొలి సెషన్ లో రేహాన్ అహ్మద్ (23), ఓలీ పోప్ (23), జో రూట్ (16), జాక్ క్రాలీ (73), జానీ బెయిర్ స్టో (26) వికెట్లు కోల్పోయింది. లంచ్ కు ముందు క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన క్రాలీ, బెయిర్ స్టోరీ రెండు ఓవర్ల వ్యవధిలో ఔటయ్యారు. మొదట క్రాలీని కుల్దీప్ ఎల్బడబ్ల్యూగా ఔట్ చేశాడు. మరుసటి ఓవర్లోనే మరో బ్యాటర్ బెయిర్ స్టోను బుమ్రా వికెట్ల ముందుకు దొరకబుచ్చుకున్నాడు.
ప్రస్తుతం ఏ రకంగా చూసిన ఈ మ్యాచ్ లో టీమిండియా పైచేయి సాధించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వరుసగా వికెట్లు కోల్పోతున్నా.. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం ఆ జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్ తోపాటు బెన్ ఫోక్స్ క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ లంచ్ తర్వాత సెషన్ లో ఇండియన్ బౌలర్లను ఎంత మేర అడ్డుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
బజ్‌బాల్ ను నమ్ముకున్న ఇంగ్లండ్ ను తక్కువ అంచనా వేయలేం. అదే సమయంలో నాలుగో రోజు పిచ్ పై ఇంగ్లండ్ చేతిలో కేవలం 4 వికెట్లతో మరో 205 రన్స్ చేస్తుందనుకోవడం కూడా అత్యాశే అవుతోంది. ఈ నేపథ్యంలో ఐదు టెస్టుల సిరీస్ ను సోమవారమే (ఫిబ్రవరి 5) ఇండియా 1-1తో సమం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అది రెండో సెషన్ లోనే తేలిపోనుంది.