Kuldeep Yadav at Simhachalam: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
Kuldeep Yadav at Simhachalam: టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నాడు. విశాఖపట్నంలో శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి ఇంగ్లండ్ తో జరగనున్న రెండో టెస్ట్ కోసం అతడు వెళ్లాడు.

Kuldeep Yadav at Simhachalam: ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్ సింహాచలం వెళ్లాడు. అక్కడ సింహాద్రి అప్పన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. టీమ్ లోని ప్లేయర్స్ లో అతనొక్కడే కనిపించగా.. ఒకరిద్దరు సహాయ సిబ్బంది కుల్దీప్ వెంట కనిపించారు. ఇంగ్లండ్ తో శుక్రవారం (ఫిబ్రవరి 2) నుంచి విశాఖపట్నంలో రెండో టెస్ట్ జరగనున్న విషయం తెలిసిందే.
సింహాచలంలో కుల్దీప్
టీమిండియా లెఫ్టామ్ లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సింహాచలం వెళ్లిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెస్ట్ మ్యాచ్ కోసం విశాఖపట్నం వెళ్లిన అతడు.. పక్కనే ఉన్న సింహాద్రి అప్పన్న దర్శనం కోసం వెళ్లాడు. అతనికి ప్రత్యేక ఆహ్వానం పలికిన అక్కడి ఆలయ సిబ్బంది.. ప్రత్యేక పూజల తర్వాత అప్పన్న చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆ తర్వాత కుల్దీప్ అక్కడి సిబ్బందితో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. కుల్దీప్ యాదవ్ హైదరాబాద్ లో ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆడలేదు. అయితే విశాఖలో జరగబోయే రెండో టెస్టులో మాత్రం తుది జట్టులోకి రానున్నాడు. తొలి టెస్ట్ ఆడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమవడంతో సీనియర్ స్పిన్నర్ అయిన కుల్దీప్.. తుది జట్టులోకి రావడం ఖాయంగా మారింది.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ టీమ్ ఇదే
ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన ఇంగ్లండ్ టీమ్.. రెండో టెస్టు ప్రారంభానికి ఒక రోజు ముందే తమ తుది జట్టును అనౌన్స్ చేసింది. టీమ్ లోకి సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ తిరిగి రాగా.. మరోసారి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది. సీనియర్ స్పిన్నర్ లీచ్ గాయంతో దూరం కాగా.. షోయబ్ బషీర్ అరంగేట్రం చేయనున్నాడు. హార్ట్‌లీ, రేహాన్ అహ్మద్ లతోపాటు జో రూట్ కూడా స్పిన్ బౌలింగ్ చేస్తాడు.
రెండో టెస్టుకు ఇంగ్లండ్ టీమ్ ఇదే
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్, రేహాన్ అహ్మద్, టామ్ హార్ట్‌లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్
టీమిండియాకు పరీక్షే
ఇక ఇండియన్ టీమ్ తమ తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తొలి టెస్టులో రాణించిన కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమయ్యారు. దీంతో వీళ్ల స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నది సమస్యగా మారింది. సర్ఫరాజ్, రజత్ పటీదార్ లలో ఒకరు అరంగేట్రం చేయనున్నారు. అయితే ఇప్పటికే కోహ్లి లేక ఢీలా పడిన మిడిలార్డర్ నుంచి రాహుల్ కూడా తప్పుకోవడం మరింత బలహీనమైంది.
ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో రెండో టెస్టు ఇండియాకు సవాలుగా మారనుంది. బజ్‌బాల్ అంటూ ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ టీమ్.. తొలి టెస్టులో ఆ స్టైల్లో ఆడకుండానే ఇండియాకు చెక్ పెట్టింది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉన్న ఆ టీమ్.. రెండో టెస్టులోనూ గెలవాలన్న పట్టుదలతో దిగుతోంది.