India vs England Live Score: బుమ్రా కూడా దంచి కొట్టాడు.. రాణించిన జురెల్, అశ్విన్.. టీమిండియా 445 ఆలౌట్
16 February 2024, 13:51 IST
- India vs England Live Score: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ధృవ్ జురెల్, అశ్విన్ రాణించడంతోపాటు చివర్లో బుమ్రా మెరుపులు ఇండియాకు మంచి స్కోరు అందించాయి.
రాణించిన అశ్విన్, జురెల్.. బుమ్రా మెరుపులు.. టీమిండియా భారీ స్కోరు
India vs England Live Score: రాజ్‌కోట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియన్ టీమ్ 445 రన్స్ చేసింది. 5 వికెట్లకు 326 పరుగులతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. మరో 119 పరుగులు జోడించి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. నిజానికి రెండో రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే నైట్ వాచ్‌మన్ కుల్దీప్, సెంచరీ హీరో జడేజా ఔటైనా.. తర్వాత ధృవ్ జురెల్, అశ్విన్, బుమ్రా ఇండియన్ టీమ్ కు మంచి స్కోరు సాధించి పెట్టారు.
టీమిండియా.. రాణించిన లోయర్ ఆర్డర్
టీమిండియా లోయర్ ఆర్డర్ చాలా అరుదుగా రాణిస్తుంది. ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో అదే జరిగింది. తొలి రోజు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలకు తోడు.. తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపులతో 5 వికెట్లకు 326 రన్స్ చేసిన ఇండియన్ టీమ్.. రెండో రోజు కూడా ఆ జోరు కొనసాగించింది. తొలి అరగంటలోనే ఓవర్ నైట్ బ్యాటర్లు ఇద్దరూ ఔటయ్యారు.
తన స్కోరుకు మరో 2 పరుగులు జోడించిన జడేజా 112 రన్స్ దగ్గర ఔటవగా.. కుల్దీప్ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఇండియన్ టీమ్ 5 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో 331 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. కనీసం 350 స్కోరైనా చేరుకుంటుందా అనిపించింది. అయితే ఈ సమయంలో తొలి టెస్ట్ ఆడుతున్న వికెట్ కీపర్ ధృవ్ జురెల్, సీనియర్ ప్లేయర్ అశ్విన్ జత కలిశారు.
జురెల్, అశ్విన్ భాగస్వామ్యం
ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ను మరోసారి గాడిలో పెట్టారు. మొదట్లో నెమ్మదిగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్న వీళ్లు తర్వాత మెల్లగా పరుగులు జోడించారు. 8వ వికెట్ కు ఈ ఇద్దరూ కలిసి 77 పరుగులు జోడించడంతో టీమ్ స్కోరు 400 దాటింది. ఈ క్రమంలో ధృవ్ జురెల్ 46, అశ్విన్ 37 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటవడంతో 415 పరుగుల దగ్గర 9 వికెట్ పడింది.
ఇక ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సమయం పట్టదనుకుంటున్న వేళ చివర్లో వచ్చిన బుమ్రా కాసేపు మెరుపులు మెరిపించాడు. అతడు 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 26 రన్స్ చేశాడు. దీంతో టీమ్ స్కోరు 445 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రేహాన్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక ఆండర్సన్, హార్ట్‌లీ, జో రూట్ తలా ఒక వికెట్ తీశారు.
ఇక తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ ఖాతా తెరవక ముందే 5 పరుగుల స్కోరు బోర్డుతో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అంతకుముందు ఇండియా ఇన్నింగ్స్ లో అశ్విన్ పిచ్ పై డేంజర్ జోన్ లో పరుగెత్తడంతో అంపైర్లు ఇండియాకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. దీంతో ఇంగ్లండ్ ఖాతా తెరవక ముందే ఆ టీమ్ కు 5 పరుగులు వచ్చాయి.
టాపిక్