India vs England 3rd test: బెన్ డకెట్ మెరుపు సెంచరీ.. టీమిండియాకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
16 February 2024, 17:38 IST
- India vs England 3rd test: టీమిండియాకు మరోసారి బజ్‌బాల్ రుచి చూపించాడు ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్. అతడు మెరుపు సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 207 రన్స్ చేసింది.
బెన్ డకెట్ మెరుపు సెంచరీతో టీమిండియాకు దీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్
India vs England 3rd test: రాజ్‌కోట్ టెస్టులో టీమిండియా భారీ స్కోరుకు ఇంగ్లండ్ దీటుగా బదులిస్తోంది. తమ బజ్‌బాల్ స్టైల్లో ఆ టీమ్ ఓపెనర్ బెన్ డకెట్ మెరుపు సెంచరీ చేయడంతో ఇంగ్లండ్ టీమ్ రెండో రోజు 2 వికెట్లకు 207 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 445 పరుగులకు ఆలౌట్ కాగా.. ప్రస్తుతం ఇంగ్లండ్ ఇంకా 238 పరుగులు వెనుకబడింది. డకెట్ 133, రూట్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.
బెన్ డకెట్ వీర విహారం
టీమిండియాతో రెండో టెస్టులో బజ్‌బాల్ స్టైల్లో వేగంగా ఆడటానికి ప్రయత్నించి ఓడిపోయిన ఇంగ్లండ్.. మూడో టెస్టులోనూ అదే ఊపు కొనసాగించింది. ఆ టీమ్ ఓపెనర్ బెన్ డకెట్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టెస్ట్ మ్యాచ్ ను టీ20 స్టైల్లో ఆడుతూ కేవలం 88 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. ఇంగ్లండ్ తరఫున ఇండియాపై అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్ గా డకెట్ రికార్డు క్రియేట్ చేశాడు.
క్రీజులోకి వచ్చీ రాగానే బౌండరీల వర్షం కురిపించిన డకెట్.. ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. బుమ్రా, సిరాజ్, కుల్దీప్, అశ్విన్, జడేజా.. ఇలా ఎవరు బౌలింగ్ చేసినా పరుగుల వరద పారిస్తూ వెళ్లాడు. మొదట 39 బంతుల్లోనే 11 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తూ 88 బంతుల్లో 19 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ చేశాడు.
మొదట జాక్ క్రాలీ (15)తో కలిసి తొలి వికెట్ కు 13 ఓవర్లలోనే 89 పరుగులు జోడించాడు. తర్వాత ఓలీ పోప్ (38)తో కలిసి రెండో వికెట్ కు 93 పరుగులు జత చేశాడు. చివరికి రెండో రోజు ఆట ముగిసే సమయానికి డకెట్ 118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్ లతో 133 రన్స్ తో అజేయంగా ఉన్నాడు. అతని ఇన్నింగ్స్ లో బౌండరీల రూపంలోనే 96 పరుగులు రావడం విశేషం.
టీమిండియా భారీ స్కోరు
అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. తొలి రోజు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా సెంచరీలకు తోడు.. తొలి టెస్ట్ ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ మెరుపులతో 5 వికెట్లకు 326 రన్స్ చేసిన ఇండియన్ టీమ్.. రెండో రోజు కూడా ఆ జోరు కొనసాగించింది. తొలి అరగంటలోనే ఓవర్ నైట్ బ్యాటర్లు ఇద్దరూ ఔటయ్యారు.
తన స్కోరుకు మరో 2 పరుగులు జోడించిన జడేజా 112 రన్స్ దగ్గర ఔటవగా.. కుల్దీప్ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఇండియన్ టీమ్ 5 పరుగుల వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయింది. దీంతో 331 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి.. కనీసం 350 స్కోరైనా చేరుకుంటుందా అనిపించింది. అయితే ఈ సమయంలో తొలి టెస్ట్ ఆడుతున్న వికెట్ కీపర్ ధృవ్ జురెల్, సీనియర్ ప్లేయర్ అశ్విన్ జత కలిశారు.
8వ వికెట్ కు ఈ ఇద్దరూ కలిసి 77 పరుగులు జోడించడంతో టీమ్ స్కోరు 400 దాటింది. ఈ క్రమంలో ధృవ్ జురెల్ 46, అశ్విన్ 37 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ వెంటవెంటనే ఔటవడంతో 415 పరుగుల దగ్గర 9 వికెట్ పడింది.
చివర్లో వచ్చిన బుమ్రా కాసేపు మెరుపులు మెరిపించాడు. అతడు 28 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ తో 26 రన్స్ చేశాడు. దీంతో టీమ్ స్కోరు 445 పరుగులకు చేరింది. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 4, రేహాన్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు. ఇక ఆండర్సన్, హార్ట్‌లీ, జో రూట్ తలా ఒక వికెట్ తీశారు.
టాపిక్