India vs England 1st Test Day 2 Score: రెండో రోజూ టీమిండియాదే.. హైదరాబాద్ టెస్టులో భారీ ఆధిక్యం
26 January 2024, 17:16 IST
- India vs England 1st Test Day 2 Score: ఇంగ్లండ్ తో హైదరాబాద్ లో జరుగుతున్న తొలి టెస్ట్ పై టీమిండియా పట్టు బిగించింది. తొలి రోజు బంతితో, రెండో రోజు బ్యాట్ తో చెలరేగిన ఇండియన్ టీమ్.. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సంపాదించింది.
రెండో రోజు ఇంగ్లండ్ బౌలర్లతో ఆటాడుకున్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా
India vs England 1st Test Day 2 Score: హైదరాబాద్ టెస్టులో టీమిండియా చెలరేగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు నష్టానికి 421 రన్స్ చేసి 175 పరుగుల ఆధిక్యం సంపాదించింది. జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు.
రెండో రోజు శుక్రవారం (జనవరి 26) చివరి ఓవర్ చివరి మూడు బంతులకు అక్షర్ వరుసగా 4, 6, 4 కొట్టడం విశేషం. ఇప్పటికే ఈ ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్ కు అజేయంగా 63 పరుగులు జోడించారు.
ఇంగ్లండ్‌కు ఇండియా బజ్‌బాల్ దెబ్బ
బజ్‌బాల్ స్టైల్ అంటూ ఇండియాలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కు దాని అసలు రుచేంటో టీమిండియానే చూపిస్తోంది. తొలి రోజు 23 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 రన్స్ చేసిన ఇండియన్ టీమ్.. రెండో రోజు 87 ఓవర్లలో మరో 302 పరుగులు చేయడం విశేషం. మొదట కేఎల్ రాహుల్, తర్వాత రవీంద్ర జడేజా బ్యాట్ తో చెలరేగారు. దీంతో ఇండియాను తక్కువకే కట్టడి చేయాలన్న ఇంగ్లండ్ ఆశలు నెరవేరలేదు.
తొలి రోజే ఇండియా స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ కుదేలైన అదే పిచ్ పై టీమిండియా బ్యాటర్లు మాత్రం స్వేచ్ఛగా ఆడుతున్నారు. కేఎల్ రాహుల్ 86, శ్రేయస్ అయ్యర్ 35, కేఎస్ భరత్ 41 పరుగులు చేసి ఔటవగా.. జడేజా 81, అక్షర్ పటేల్ 35 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఇండియా 6 వికెట్లు కోల్పోయినా.. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఇంగ్లండ్ స్పిన్నర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
ఆ టీమ్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ జో రూట్ 2, కొత్త బౌలర్ హార్ట్‌లీ రెండు, జాక్ లీచ్, రేహాన్ అహ్మద్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. శుభ్‌మన్ (23) మాత్రమే మరోసారి విఫలమై నిరాశ పరిచినా.. మిగతా బ్యాటర్లంతా ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.
జడేజా సూపర్ స్టార్ షో
తొలి రోజు బౌలింగ్ లో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన స్పిన్నర్ రవీంద్ర జడేజా.. రెండో రోజు బ్యాట్ తోనూ రాణించాడు. 223 పరుగుల దగ్గర శ్రేయస్ అయ్యర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జడేజా.. మొదట రాహుల్ తో, తర్వాత భరత్, అక్షర్ పటేల్ లతో విలువైన భాగస్వామ్యాలు ఏర్పరచి టీమిండియాకు మంచి స్కోరు అందించాడు.
ఓ పర్ఫెక్ట్ బ్యాటర్ లాగా ఆడుతూ స్వేచ్ఛగా షాట్లు ఆడిన జడేజా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 155 బంతుల్లో 81 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. బాధ్యతాయుతంగా ఆడుతూనే.. లూజ్ బాల్స్ ను బౌండరీలకు తరలించాడు. ప్రధాన బ్యాటర్లంతా 288 పరుగులకే పెవిలియన్ చేరినా.. తర్వాత భరత్, అక్షర్ లతో కలిసి ఇండియా స్కోరు 400 దాటేలా చేశాడు.
175 పరుగుల ఆధిక్యంతో టీమిండియా తొలి టెస్టును శాసించే స్థాయిలో నిలిచింది. పిచ్ పరిస్థితి, లీడ్ చూస్తుంటే.. మూడో రోజే ఇండియా మరో 50 పరుగుల ఆధిక్యం సంపాదించి.. ఇంగ్లండ్ ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
టాపిక్