IND vs BAN 2nd Test, Day 3: కాన్పూర్‌లో వర్షం లేదు.. కానీ మరో రీజన్‌తో ఈరోజు ఆట ఆలస్యం
29 September 2024, 9:50 IST
Kanpur Weather Report: కాన్పూర్ టెస్టుకి గత రెండు రోజుల నుంచి అంతరాయం కలిగిస్తున్న వరుణుడు ఈరోజు కాస్త కరుణించినట్లే కనిపిస్తున్నాడు. కానీ గత రెండు రోజుల నుంచి కురిసిన భారీ వర్షం కారణంగా ఈరోజు ఆట ఆలస్యం అవుతోంది.
కాన్పూర్ టెస్టు
IND vs BAN 2nd Test Live Updates: భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన ఆదివారం కూడా ఆట సాఫీగా జరిగేలా కనిపించడం లేదు.
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజు కేవలం 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమవగా.. రెండో రోజైన శనివారం వర్షం కారణంగా కనీసం ఒక్క బంతి కూడా పడలేదు. అయితే ఆదివారం ఉదయం నుంచి వర్షం లేనప్పటికీ.. ఆట ఆలస్యంగా ప్రారంభంకానుంది.
శనివారం అర్ధరాత్రి వరకు పడిన భారీ వర్షానికి కాన్పూర్ స్టేడియంలోని అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. దాంతో మ్యాచ్‌కి అనువుగా అవుట్ ఫీల్డ్‌ను సిద్ధం చేయడానికి గ్రౌండ్ సిబ్బంది సమయం కోరడంతో ఈరోజు ఆట కనీసం గంట ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్లేయర్లు, అంపైర్లు వెయిటింగ్
ఇప్పటికే స్టేడియానికి ఆటగాళ్లు, అంపైర్లు చేరుకోగా.. 10 గంటలకి మైదానాన్ని ఫీల్డ్ అంపైర్లు పరిశీలించనున్నారు. ఆ తర్వాతే ఈరోజు ఆట ఆరంభంపై ఓ క్లారిటీరానుంది. ఈరోజు కూడా ఆట సాధ్యంకాకపోతే మ్యాచ్ ఫలితం రావడం కష్టమే. ఒకవేళ మ్యాచ్ డ్రాగా ముగిస్తే బంగ్లాదేశ్ కంటే ఎక్కువగా నష్టపోయేది భారత్ జట్టే.
మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న బంగ్లాదేశ్ టీమ్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 107/3తో ఉంది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్ (6 బ్యాటింగ్: 13 బంతుల్లో 1x4), మొమినల్ హక్ (40 బ్యాటింగ్: 81 బంతుల్లో 7x4) ఉండగా.. భారత్ బౌలర్లలో ఆకాశ్ దీప్ 2 వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు.
టెస్టు డ్రా అయితే.. 4 పాయింట్లే
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా గత ఆదివారం ముగిసిన తొలి టెస్టులో భారత్ జట్టు 280 పరుగుల తేడాతో గెలిచి.. రెండు టెస్టుల సిరీస్‌లో ప్రస్తుతం 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రెండో టెస్టులోనూ గెలిస్తే సిరీస్ స్వీప్‌తో పాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నెం.1 స్థానాన్ని మరింత పదిలం చేసుకోనుంది.
కాన్పూర్ టెస్టు ఒకవేళ డ్రా అయితే మాత్రం బంగ్లాదేశ్‌తో కలిసి 4 పాయింట్ల చొప్పున భారత్ జట్టు పంచుకోవాల్సి వస్తుంది. అదే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే 12 పాయింట్లు లభిస్తాయి.