India vs Australia 1st ODI: ఆస్ట్రేలియాకు షాక్.. ఇండియాతో తొలి వన్డేకు ఆ ఇద్దరు ప్లేయర్స్ దూరం
21 September 2023, 16:07 IST
- India vs Australia 1st ODI: ఆస్ట్రేలియాకు షాక్ తగిలింది. ఇండియాతో తొలి వన్డేకు ఆ టీమ్ కు చెందిన ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ దూరమయ్యారు.
మొహాలీలో ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా టీమ్
India vs Australia 1st ODI: ఇండియాతో జరగబోయే తొలి వన్డేకు ముందు ఆస్ట్రేలియా టీమ్ కు షాక్ తగిలింది. ఈ మ్యాచ్ శుక్రవారం (సెప్టెంబర్ 22) మొహాలీలో జరగనుండగా.. ఈ మ్యాచ్ కు ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరమయ్యారు. గాయాలతో మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్ ఆడటం లేదని కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు.
తొలి వన్డేకు ముందు గురువారం (సెప్టెంబర్ 21) కమిన్స్ మీడియాతో మాట్లాడాడు. స్టార్క్, మ్యాక్స్‌వెల్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదని కమిన్స్ చెప్పాడు. వరల్డ్ కప్ కు ముందు తమ పూర్తిస్థాయి తుది జట్టును బరిలోకి దింపాలని చూస్తున్న ఆస్ట్రేలియాకు ఇది ఒకరకంగా బ్యాడ్ న్యూసే. మిచెల్ స్టార్క్ గజ్జల్లో గాయంతో బాధపడుతున్నాడు.
ఇండియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ నుంచీ స్టార్క్ ఈ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అయితే తర్వాతి రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉంటాడని కమిన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అటు ఇప్పటికే సౌతాఫ్రికా టూర్ కు కూడా సిద్ధమైన గ్లెన్ మ్యాక్స్‌వెల్ దూరం కావడం కూడా ఆస్ట్రేలియాకు మింగుడుపడనిదే.
నేను ఫిట్‌గా ఉన్నా: కమిన్స్
ఇక యాసెస్ సిరీస్ సందర్భంగా మణికట్టు గాయానికి గురై సౌతాఫ్రికా టూర్ కు దూరంగా ఉన్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాత్రం తాను ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు చెప్పాడు. వరల్డ్ కప్ కు ముందు ఈ మూడు వన్డేల సిరీస్ తమ సరైన టీమ్ కాంబినేషన్ ఏదో గుర్తించడానికి ఉపయోగపడుతుందని కమిన్స్ అన్నాడు. ఇక టాప్ ఫామ్ లో ఉన్న మార్నస్ లబుషేన్ పై కూడా కమిన్స్ భారీ ఆశలే పెట్టుకున్నాడు.
అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కాబోయే వరల్డ్ కప్ లో అక్టోబర్ 8న ఇండియా, ఆస్ట్రేలియా టీమ్స్ తలపడనున్నాయి. అంతకుముందు జరగబోయే ఈ మూడు వన్డేల సిరీస్ ఈ మెగా టోర్నీకి సిద్ధమవడానికి ఉపయోగపడనుంది.
ఐదుసార్లు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా.. ఇండియన్ కండిషన్స్ లో ఆడటానికి ఎప్పుడూ ఇబ్బంది పడింది. ఇప్పుడు ఇండియాతో సిరీస్ తోపాటు వరల్డ్ కప్ కూడా ఆ జట్టుకు పెద్ద సవాలే అని చెప్పొచ్చు.
ఇక ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేలకు టీమిండియాకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు వన్డేలకు రోహిత్, కోహ్లి, కుల్దీప్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినివ్వగా.. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి వచ్చాడు.