IND vs PAK: పాకిస్థాన్‌పై ఇండియా గెలవాలంటే ఈ ఐదుగురు ప్లేయర్సే కీలకం
01 September 2023, 10:58 IST
- IND vs PAK: పాకిస్థాన్‌పై ఇండియా గెలవాలంటే ఈ ఐదుగురు ప్లేయర్సే కీలకం కానున్నారు. వీళ్లు ఎలా రాణిస్తారన్నదానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు టీమిండియా ప్రాక్టీస్
IND vs PAK: ఆసియా కప్ 2023లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్ గా భావించే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగబోతోంది. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల్లోని కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
పాకిస్థాన్ తో ఆడిన చివరి మూడు వన్డే మ్యాచ్ లలోనూ పైచేయి సాధించిన ఇండియా.. ఈసారి కూడా గెలవాలంటే ఈ ఐదుగురు ప్లేయర్స్ కీలకం కానున్నారు. వీళ్లు ఎలా రాణిస్తారన్నదానిపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
విరాట్ కోహ్లి.. టీ20 వరల్డ్‌కప్ రిపీట్ చేస్తాడా?
పాకిస్థాన్‌తో మ్యాచ్ అనే కాదు ఎవరితో ఆడినా.. విరాట్ కోహ్లి ఎలా రాణిస్తాడన్నదే కీలకం అవుతుంది. అందులోనే గతేడాది టీ20 వరల్డ్ కప్ లో అతడు పాకిస్థాన్ పై ఆడిన చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అందులోనూ గతేడాది ఇదే ఆసియా కప్ నుంచి తన పోయిన ఫామ్ తిరిగి అందుకున్న విరాట్.. ఇప్పుడు టాప్ ఫామ్ లో ఉండటం ఇండియాకు కలిసొచ్చేదే.
ఇక పాకిస్థాన్ పై కోహ్లి ఇప్పటి వరకూ 13 వన్డేలు ఆడాడు. 48.72 సగటుతో 536 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు (183) 2012 ఆసియా కప్ లో పాకిస్థాన్ పైనే చేయడం విశేషం. 2015 వరల్డ్ కప్ లో మరో సెంచరీ చేసిన తర్వాత ఈ 8 ఏళ్లలో పాకిస్థాన్ తో అతడు కేవలం మూడు వన్డేలే ఆడాడు. అందులో 81, 5, 77 రన్స్ చేశాడు. శనివారం మ్యాచ్ లో అందరి కళ్లూ ఈ రన్ మెషీన్ పైనే ఉంటాయనడంలో సందేహం లేదు.
రోహిత్ శర్మ - టాప్ లేపితేనే..
పాకిస్థాన్ పై గెలవాలంటే ఇండియా టాపార్డర్ చాలా కీలకం. ముఖ్యంగా కెప్టెన్, ఓపెనర్ అయిన రోహిత్ శర్మ పాక్ లెఫ్టామ్ పేసర్ షహీన్ అఫ్రిదిని ఎలా ఎదుర్కొంటాడన్నది చూడాలి. లెఫ్టామ్ పేస్ బౌలింగ్ లో ఇబ్బంది పడటం అతనికి అలవాటు. దీంతో ఈసారి షహీన్ బౌలింగ్ ను ఎంత సమర్థంగా ఎదుర్కొంటాడన్నది కూడా ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించనుంది.
వన్డేల్లో పాకిస్థాన్ తో రోహిత్ 16 మ్యాచ్ లలో 720 రన్స్ చేశాడు. అందులో రెండు సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ లో చివరిసారి ఆ టీమ్ తో ఆడినప్పుడు రోహిత్ కేవలం 113 బంతుల్లోనే 140 రన్స్ చేశాడు. అయితే తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్లో రోహిత్ ఈ మధ్య అంతగా ఫామ్ లో లేడు. ఈ నాలుగేళ్లలో కేవలం మూడు సెంచరీలే చేశాడు. దీంతో పాకిస్థాన్ తో శనివారం ఎలా ఆడతాడో చూడాలి.
జస్‌ప్రీత్ బుమ్రా - బాబర్ పని పడతాడా?
గాయం కారణంగా సుమారు 11 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు జస్‌ప్రీత్ బుమ్రా. అతడు వన్డే మ్యాచ్ ఆడి ఏడాది పైనే అయింది. ఇక చివరిసారి 2019 వరల్డ్ కప్ లో ఆ టీమ్ తో ఆడినప్పుడు బుమ్రా 8 ఓవర్లలో 52 రన్స్ సమర్పించుకున్నాడు. ఈసారి అతనిపై టీమ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. చాలా రోజుల రెస్ట్ తర్వాత చాలా ఫ్రెష్ గా వస్తున్న బుమ్రా మొదట్లోనే చెలరేగి పాక్ టాపార్డర్ ను లేపేస్తే ఇండియా పని సులువవుతుంది.
పాకిస్థాన్ తో బుమ్రా కేవలం 5 వన్డేలు ఆడాడు. అందులో 4 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. దీంతో ఇప్పుడా టీమ్ పై తన సత్తా చాటడానికి ఇదే సరైన సమయం. షమి, సిరాజ్ లతో కలిసి బుమ్రా చేయబోయే మ్యాజిక్.. ఇండియా విజయావకాశాలను మెరుగుపరుస్తుంది.
ఇషాన్ కిషన్.. మిడిలార్డర్ లో కీలకం
కేఎల్ రాహుల్ లేకపోవడంతో ఇప్పుడు తుది జట్టులో ఇషాన్ కిషన్ కచ్చితంగా ఉంటాడు. అయితే అతడు ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడన్నది కీలకం. అతని రెగ్యులర్ ఓపెనింగ్ స్థానంలో రోహిత్, గిల్ ఉన్నారు. మూడోస్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్ ఉంటారు.
దీంతో ఇషాన్ ఐదోస్థానంలో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఓపెనర్ గా అద్భుతాలు చేసే ఇషాన్.. ఈ స్థానంలో బాధ్యతాయుతంగా ఆడాల్సి రావచ్చు. వెస్టిండీస్ టూర్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలతో టాప్ ఫామ్ లో ఉన్న ఇషాన్.. ఆ బాధ్యత నెరవేరుస్తాడని టీమ్ ఆశిస్తోంది.
శుభ్‌మన్ గిల్.. ఆ ఫామ్ కొనసాగిస్తాడా?
ఏడాది కాలంగా అత్యంత నిలకడగా ఆడుతున్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్. ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్ లపై సెంచరీ, డబుల్ సెంచరీలతో చెలరేగాడు. దీంతో పాకిస్థాన్ పై అతని పాత్ర కీలకం కానుంది.
రోహిత్ తో కలిసి అతడు మంచి ఆరంభాన్ని ఇవ్వగలిగితే సగం మ్యాచ్ గెలిచినట్లే. ముఖ్యంగా పాక్ పేస్ త్రయం షహీన్ షా అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్ లను అతడు ఎలా ఎదుర్కొంటాడన్నది చూడాలి.