Kohli on Pakistan: పాకిస్థాన్ బౌలింగ్ కష్టమే.. కానీ..: కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్-kohli says bowling is pakistans strength ahead of match against them cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Kohli On Pakistan: పాకిస్థాన్ బౌలింగ్ కష్టమే.. కానీ..: కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Kohli on Pakistan: పాకిస్థాన్ బౌలింగ్ కష్టమే.. కానీ..: కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Sep 01, 2023 09:54 AM IST

Kohli on Pakistan: పాకిస్థాన్ బౌలింగ్ కష్టమే.. అంటూ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ టీమ్ తో ఆసియా కప్ లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) కీలకమైన మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌తో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లి ప్రాక్టీస్
పాకిస్థాన్‌తో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లి ప్రాక్టీస్ (PTI)

Kohli on Pakistan: ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బౌలింగే పాకిస్థాన్ బలమని, వాళ్ల బౌలింగ్ ఎదుర్కోవాలంటే ఏ బ్యాటర్ అయినా తన అత్యుత్తమ ఆట ఆడాలని అతడు అనడం విశేషం. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో ఇదే పాక్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ విరాట్ ఇండియాకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టిన విషయం తెలిసిందే.

yearly horoscope entry point

నిజానికి చివరి మూడు వన్డేలలో పాకిస్థాన్ పై ఇండియానే గెలిచింది. అయితే ఆ టీమ్ తో చివరిసారి 2019 వరల్డ్ కప్ సందర్భంగా వన్డే మ్యాచ్ ఆడింది. మళ్లీ నాలుగేళ్లకు ఆసియా కప్ లో భాగంగా శనివారం (సెప్టెంబర్ 2) ఆడాల్సి ఉంది. ఈ కీలకమైన మ్యాచ్ కు ముందు పాక్ జట్టు బౌలింగ్ పై కోహ్లి స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ తో అతడు మాట్లాడాడు.

"బౌలింగే వాళ్ల బలమని నేను భావిస్తాను. వాళ్ల దగ్గర చాలా మంచి బౌలర్లు ఉన్నారు. వాళ్లు తమ నైపుణ్యం ద్వారా మ్యాచ్ ను ఎప్పుడైనా మలుపు తిప్పగలరు. వాళ్లను ఎదుర్కోవాలంటే మన అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించాల్సిందే" అని కోహ్లి అన్నాడు. ఈ మధ్య కాలంలో విరాట్ తనకెంతో ఇష్టమైన వన్డే ఫార్మాట్ లో టాప్ ఫామ్ లో ఉండటం ఇండియాకు ఊరట కలిగించే విషయం.

కోహ్లి గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఆడిన 13 వన్డేల్లో 50.36 సగటుతో 554 రన్స్ చేశాడు. అంతకుముందు ఫామ్ కోల్పోయి తంటాలు పడిన అతడు మళ్లీ గాడిలో పడటానికి ఏం చేశాడన్నది కూడా వివరించాడు.

"నా ఆటను ఎలా మెరుగుపరచుకోవాలన్నదానిపైనే దృష్టి సారిస్తా. ప్రతి రోజూ, ప్రతి ప్రాక్టీస్ సెషన్, ప్రతి ఏడాది, ప్రతి సీజన్ ఇదే చేస్తా. సుదీర్ఘకాలంగా నిలకడగా రాణించడానికి ఇదే నాకు తోడ్పడుతుంది. ఆ మైండ్‌సెట్ లేకుండా పర్ఫామ్ చేయలేం. పర్ఫార్మెన్సే అంతిమ లక్ష్యం.

అది లేకపోతే హార్డ్ వర్క్ చేయడం ఆపేస్తాం. దానికి పరిమితి అంటూ ఏదీ లేదు. ప్రతి రోజూ మెరుగుదల కోసం నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ స్థితి నుంచి నా జట్టును ఎలా గెలిపించుకోవాలి అన్న మైండ్‌సెట్ ద్వారా మన పర్ఫార్మెన్స్ కూడా మెరగవుతుందని నేను బలంగా నమ్ముతాను" అని కోహ్లి అన్నాడు.

శనివారం ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే నేపాల్ ను చిత్తుగా ఓడించిన పాకిస్థాన్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అయితే ఈ కీలకమైన మ్యాచ్ కు వర్షం అడ్డుతగిలే అవకాశం ఉంది. శనివారం సుమారు 91 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Whats_app_banner