IND vs PAK: రోహిత్ vs షహీన్, బుమ్రా vs బాబర్.. ఇండియా, పాకిస్థాన్ విజేతను తేల్చేది ఈ సమరాలే..-rohit vs shaheen and bumrah vs babar to decide india pakistan match winner cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Pak: రోహిత్ Vs షహీన్, బుమ్రా Vs బాబర్.. ఇండియా, పాకిస్థాన్ విజేతను తేల్చేది ఈ సమరాలే..

IND vs PAK: రోహిత్ vs షహీన్, బుమ్రా vs బాబర్.. ఇండియా, పాకిస్థాన్ విజేతను తేల్చేది ఈ సమరాలే..

Hari Prasad S HT Telugu
Aug 31, 2023 08:38 AM IST

IND vs PAK: రోహిత్ vs షహీన్, బుమ్రా vs బాబర్.. ఆసియా కప్ లో భాగంగా జరగనున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో విజేతను తేల్చేది ఈ టాప్ ప్లేయర్స్ మధ్య సమరాలే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో కీలకంగా మారనున్న షహీన్, రోహిత్ మధ్య ఫైట్
ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో కీలకంగా మారనున్న షహీన్, రోహిత్ మధ్య ఫైట్ (Getty Images)

IND vs PAK: ఆసియా కప్ 2023లో భాగంగా మరోసారి ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ సమరం చూసే అదృష్టం ఫ్యాన్స్ కు దక్కనుంది. శనివారం (సెప్టెంబర్ 2) ఈ దాయాదుల మధ్య జరగబోయే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

yearly horoscope entry point

వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ గా ఎదిగిన పాక్ టీమ్.. నాలుగేళ్ల తర్వాత ఆ ఫార్మాట్లో ఇండియాతో తలపడబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్ లో విజేతను తేల్చే కీలకమైన సమరాలు ఏవి? వీళ్లలో ఎవరు ఎవరిపై పైచేయి సాధించబోతున్నారు? అనే ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చూద్దాం.

రోహిత్ శర్మ vs షహీన్ అఫ్రిది

చాలా ఏళ్లుగా ఓ లెఫ్టామ్ పేస్ బౌలర్ ఇండియన్ టాపార్డర్ ను ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉన్నాం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మహ్మద్ ఆమిర్, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ట్రెంట్ బౌల్ట్.. 2021 టీ20 వరల్డ్ కప్ లో షహీన్ అఫ్రిది.. ఇలా లెఫ్టామ్ పేస్ బౌలర్లు మొదట్లోనే కొట్టిన దెబ్బ విజయావకాశాలను దెబ్బ తీసింది.

దీంతో ఇప్పుడు పాకిస్థాన్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ, షహీన్ అఫ్రిది మధ్య ఫైట్ ఆసక్తికరంగా మారింది. అఫ్రిదిపై రోహిత్ పైచేయి సాధిస్తే ఇండియా సగం మ్యాచ్ గెలిచినట్లే. నేపాల్ తో మ్యాచ్ లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి షహీన్.. ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు.

తొలి ఓవర్లోనే వికెట్లు తీయడం అతనికి అలవాటు. ఫుల్ లెంగ్త్, ఇన్‌స్వింగర్స్ తో రైట్ హ్యాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెడతాడు. రెండేళ్ల కిందట టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ ను అతడు డకౌట్ చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ అతన్ని ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరం.

కోహ్లి vs రౌఫ్

గతేడాది టీ20 వరల్డ్ కప్ లో హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కోహ్లి వరుసగా కొట్టిన రెండు సిక్స్ లను క్రికెట్ ప్రపంచం ఎప్పటికీ మరచిపోదు. ఆ సిక్స్ లే అసాధ్యమనుకున్న ఆ మ్యాచ్ లో ఇండియాను గెలిపించాయి. కానీ మళ్లీ తన బౌలింగ్ లో కోహ్లి అలాంటి షాట్లు ఆడలేడని రౌఫ్ వార్నింగ్ ఇచ్చాడు.

పైగా ఈ మధ్యే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ లపై మెరుగ్గా రాణించాడు. తొలి మ్యాచ్ లో నేపాల్ నూ దెబ్బ తీశాడు. ఈ నేపథ్యంలో రౌఫ్, కోహ్లిలలో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. టాప్ ఫామ్ లో ఉన్న కోహ్లి గతేడాది టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్ రిపీట్ చేయగలడా? అలా చేస్తే మాత్రం ఇండియాకు తిరుగుండదు.

బాబర్ ఆజం vs బుమ్రా

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో ఎంతో ఆసక్తి రేపుతున్న మరో సమరం బాబర్ వెర్సెస్ బుమ్రా. ఆసియా కప్ తొలి మ్యాచ్ నే సెంచరీతో మొదలుపెట్టిన బాబర్.. ఇండియాకు వార్నింగ్ పంపించాడు. అటు 11 నెలలు పాటు క్రికెట్ కు దూరంగా ఉండి ఈ మధ్యే ఐర్లాండ్ సిరీస్ తో వచ్చిన బుమ్రా.. ఈ ఛాలెంజ్ ను ఎంత మేర ఎదుర్కొంటాడన్నది చూడాలి.

రెండేళ్ల కిందట టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా బౌలింగ్ ను ఆటాడేసుకున్న బాబర్.. పాక్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. గతేడాది పాకిస్థాన్ తో ఆడిన మూడు సందర్భాల్లోనూ బాబర్ ను సమర్థంగా అడ్డుకుంది. అర్ష్‌దీప్, భువనేశ్వర్, రవి బిష్ణోయ్ అతన్ని తక్కువ స్కోరుకే ఔట్ చేశారు. మరి ఈసారి బుమ్రా ఆ పని చేయగలడా? కచ్చితంగా చేయగలిగితేనే ఇండియా మ్యాచ్ పై ఆశలు పెట్టుకోవచ్చు.

కుల్దీప్ vs ఇఫ్తికార్ అహ్మద్

పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. గతేడాది ఆసియా కప్ రెండో మ్యాచ్ లో టీమిండియా కొంప ముంచింది అతడే. ఇప్పుడు నేపాల్ తో తొలి మ్యాచ్ లోనూ మెరుపు సెంచరీతో ఇండియాకు డేంజర్ సిగ్నల్స్ పంపించాడు.

అయితే మిడిలార్డర్ లో అతన్ని కట్టడి చేయడానికి ఇండియా దగ్గర ఉన్న ఆయుధం కుల్దీప్ యాదవ్. ఈ మధ్య కాలంలో టాప్ ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ ఇద్దరి మధ్య సమరం ఆసక్తి రేపుతోంది.

ఇఫ్తికారే కాదు.. పాకిస్థాన్ జట్టులో రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్ లాంటి టాలెంటెడ్ బ్యాటర్లు కూడా ఉన్నారు. అటు బౌలింగ్ లో నసీమ్ షా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ లనూ తక్కువ అంచనా వేయలేం. ఇక తమ బాబర్ ఆజంను ఎప్పుడూ కోహ్లితో పోలుస్తుంటారు పాకిస్థానీలు.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిలో ఈసారి ఎవరు తమ టీమ్స్ ను గెలిపించుకుంటారన్నది చూడాలి. గతేడాది టీ20 వరల్డ్ కప్ లో కోహ్లియే పైచేయి సాధించాడు. ఈసారి మరింత హాట్ ఫామ్ లో ఉన్న విరాట్ మరోసారి చెలరేగితే చూడాలని ఇండియన్ ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు.

Whats_app_banner