Ashwin on Pakistan: వన్డేల్లో పాకిస్థాన్ నంబర్.1గా ఎదిగేందుకు కారణాలివే: అశ్విన్.. ఆసియాకప్‍లో ఇతర జట్లకు వార్నింగ్!
Ashwin on Pakistan: పాకిస్థాన్ క్రికెట్ జట్టు వన్డేల్లో రాణిస్తుండేందుకు కారణాలను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. ఆసియాకప్‍లో పాక్ ఫేవరెట్‍గా ఉందని అన్నాడు. ఆ వివరాలివే..
Ashwin on Pakistan: ఆసియా కప్ టోర్నీ నేడు (ఆగస్టు 30) మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా, పాకిస్థాన్ ప్రధానమైన ఫేవరెట్లుగా ఉన్నాయి. గత ఆసియాకప్ ఎడిషన్‍లో శ్రీలంక విజేతగా నిలిచినా.. ఈసారి మాత్రం అందరి కళ్లు ఇండియా, పాక్‍పైనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆసియాకప్‍ను ఎక్కువ సార్లు గెలిచిన టీమ్‍గా భారత్ ఉండగా.. ఇటీవలి కాలంలో వన్డేల్లో పాక్ అదరగొడుతోంది. ఇటీవలే ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్‍ల్లో పాకిస్థాన్ నంబర్ వన్ ర్యాంకుకు చేరింది. ఈ తరుణంలో గత ఐదారు సంవత్సరాలుగా పాకిస్థాన్ జట్టు ఎదుగుతుండడానికి ఉన్న కారణాలను భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వివరించారు. ఆసియాకప్‍లో ఇండియాతో పాటు పాక్ కూడా ఫేవరెట్ అన్నారు. వివరాలివే..
బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ అద్భుతంగా రాణిస్తుడడం వల్ల ఐదారేళ్లుగా పాకిస్థాన్ జట్టు ఎదుగుతోందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వివిధ లీగ్‍ల్లో, వివిధ పరిస్థితుల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు ఆడుతున్నారని, పాక్ జట్టు గత ఐదారేళ్లుగా ఎదుగుతుండేందుకు ఇది ప్రధానమైన కారణంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి దేశంలో పాక్ ఆటగాళ్లు పీఎస్ఎల్ ఆడుతుండగా.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి దేశాల్లోనూ లీగ్స్ ఆడుతున్నారని అన్నారు. అందుకే ఆ అనుభవంతో పాకిస్థాన్ జట్టులోనూ ఆటగాళ్లు బాగా రాణిస్తున్నారని అన్నారు. తన యూట్యూబ్ చానెల్‍లో ఈ అభిప్రాయాలను అశ్విన్ వెల్లడించారు.
“ఇప్పుడు పాకిస్థాన్ జట్టును చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతోంది. ఐదారేళ్ల క్రితం ఆ జట్టు ఆసియా కప్, ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీల్లో ఇబ్బందులు పడేది. గతంతో వారు పెద్ద టోర్నీలు గెలిచారు. 1992 ప్రపంచకప్ కైవసం చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్‍ల్లోనూ బాగా రాణించారు. అయితే, ఐదారేళ్లుగా పాకిస్థాన్ ఎదిగేందుకు బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ప్రధాన కారణంగా ఉన్నారు” అని అశ్విన్ చెప్పారు.
పాకిస్థాన్ ఆటగాళ్లు కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా చాలా లీగ్‍ల్లో ఆడుతున్నారని అశ్విన్ చెప్పారు. ఐదారేళ్లుగా పాకిస్థాన్ ప్రపంచస్థాయి క్రికెటర్లను తయారు చేయడం మాత్రమే కాకుండా ఆ ఆటగాళ్లు పెద్ద టోర్నీల్లో రాణిస్తున్నారని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ఆసియాకప్, ప్రపంచకప్‍లో బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ నిలకడగా రాణిస్తే.. పాకిస్థాన్ పటిష్టమైన జట్టుగా అనిపిస్తుందని అశ్విన్ చెప్పారు. పాకిస్థాన్ ప్రస్తుతం అసాధారణమైన జట్టుగా ఉందని అశ్విన్ చెప్పారు. ఆసియా కప్‍లో పాకిస్థాన్‍ను ఓడించేందుకు చాలా కష్టపడాలని ఇతర జట్లకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు అశ్విన్.
పాకిస్థాన్ నుంచి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది లీగ్‍ల్లో ఆడుతున్నారు కాబట్టి వారి టాలెంట్ వెల్లడవుతోందని అశ్విన్ అన్నారు. ప్రతిభకు అవకాశమిచ్చే ఐపీఎల్ లక్ష్యం కూడా ఇదేనని చెప్పారు.
ఆసియాకప్‍లో ఇండియా, పాకిస్థాన్ మధ్య సెప్టెంబర్ 2వ తేదీన మ్యాచ్ జరగనుంది.