Team India: జైస్వాల్, గిల్ ధనాధన్.. లక్ష్యాన్ని ఊదేసిన భారత్.. జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ.. సిరీస్ కైవసం
13 July 2024, 19:37 IST
- IND vs ZIM 4th T20: జింబాబ్వేతో నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‍మన్ గిల్ ధనాధన్ బ్యాటింగ్‍తో దుమ్మురేపారు. ఈ సిరీస్‍ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఖరారు చేసుకుంది భారత్.
Team India: జైస్వాల్, గిల్ ధనాధన్.. లక్ష్యాన్ని ఊదేసిన భారత్.. జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ.. సిరీస్ కైవసం
జింబాబ్వే గడ్డపై టీమిండియా మరోసారి సత్తాచాటింది. నాలుగో టీ20లో సత్తాచాటి.. సునాయాసంగా ఘన విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‍లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసుకుంది శుభ్‍మన్ గిల్ సారథ్యంలోని యంగ్ టీమిండియా. హరారేలో నేడు (జూలై 13) జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 10 వికెట్ల తేడాతో తేడాతో జింబాబ్వేపై గ్రాండ్ విక్టరీ కొట్టింది. 28 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ ఛేదించింది. 3-1తో ముందంజ వేసి.. సిరీస్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతీరుతో అలవోకగా భారత్ గెలిచింది.
జైస్వాల్ ధనాధన్.. సెంచరీ మిస్
153 పరుగుల లక్ష్యఛేదనలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‍మన్ గిల్ అదరగొట్టారు. చివరి వరకు నిలిచి వికెట్ పడకుండానే జట్టును గెలిపించేశారు. జైస్వాల్ 53 బంతుల్లోనే 93 పరుగులతో (నాటౌట్) దుమ్మురేపాడు. 13 ఫోర్లు, 2 సిక్స్‌లు బాదాడు. అయితే, సెంచరీకి ఏడు పరుగుల దూరంలో జైస్వాల్ నిలిచాడు. కొట్టేందుకు స్కోరు లేకపోవటంతో శకతం మిస్ అయింది. కెప్టెన్ గిల్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 57 పరుగులు సాధించాడు. ఇద్దరూ అర్ధ శతకాలతో దుమ్మురేపి జట్టును గెలిపించారు. దీంతో 15.2 ఓవర్లలోనే 156 పరుగులు చేసి విజయం సాధించింది భారత్. లక్ష్యాన్ని జైస్వాల్, గిల్ ఊదేశారు.
ముఖ్యంగా యశస్వి మొదటి నుంచి బౌండరీల మోత మోగించాడు. తన మార్క్ హిట్టింగ్‍తో అలరించాడు. ఓవైపు గిల్ సహకరిస్తూ ఎక్కువగా స్ట్రైకింగ్ జైస్వాల్‍కే ఇచ్చాడు. దూకుడు ఏ మాత్రం తగ్గించకుండా చితకబాదాడు యశస్వి. దీంతో 3.5 ఓవర్లలోనే 50 పరుగులను భారత్ దాటేసింది. అదే జోరు కొనసాగించిన జైస్వాల్ 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరాడు.
గిల్ కూడా..
కాసేపటి తర్వాత గిల్ కూడా బాదుడు మొదలుపెట్టాడు. యశస్వి కూడా హిట్టింగ్ కొనసాగించటంతో జింబాబ్వే బౌలర్లు చేతులు ఎత్తేశారు. ఆ ఇద్దరినీ కట్టడి చేయలేకపోయారు. యశస్వి, గిల్ దూకుడుతో భారత్ స్కోరు 9.4 ఓవర్లలోనే 100కు చేరింది. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేశారు. దీంతో లక్ష్యవేగంగా కరిగిపోయింది. అయితే, గిల్ దూకుడుగా ఆడటంతో జైస్వాల్ సెంచరీకి చేరలేకపోయాడు. లక్ష్యం తక్కువైపోయింది. మొత్తంగా గిల్, జైస్వాల్ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 28 బంతులు మిగిల్చి మరీ టీమిండియా గెలిచింది.
మెరిసిన రజా
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. కెప్టెన్ సికిందర్ రజా 28 బంతుల్లోనే 46 పరుగులతో మెరిశాడు. 2 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. ఓ దశలో జింబాబ్వే తక్కువ స్కోరు చేస్తుందనిపించినా.. రజా హిట్టింగ్‍తో మోస్తరు పరుగులు సాధించింది. ఓపెనర్లు తడివానషే మరుమనీ (32), వేస్లీ మధెవెరె (25) పర్వాలేదనిపించగా.. మిగిలిన వారు విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు, తుషార్ దేశ్‍పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివమ్ దూబే తలా ఓ వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‍తోనే భారత జట్టులోకి దేశ్‍పాండే అరంగేట్రం చేశాడు.
సిరీస్ కైవసం.. ఐదో టీ20 రేపే
ఐదు టీ20ల సిరీస్‍లో 3-1తో ఆధిక్యంలోకి వచ్చేసింది భారత్. తొలి మ్యాచ్‍లో షాకింగ్ పరాజయం ఎదురైనా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‍ల్లో గెలిచింది. ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‍ను పక్కా చేసుకుంది. టీమిండియా, జింబాబ్వే మధ్య రేపు (జూలై 14) చివరిదైన ఐదో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్‍తోనే ఈ టూర్ ముగియనుంది.