IND vs ZIM 3rd T20: జింబాబ్వేపై భారత్ అలవోక గెలుపు.. సిరీస్‍లో ఆధిక్యంలోకి.. మైయర్స్ పోరాటం వృథా
IND vs ZIM 3rd T20: జింబాబ్వేపై మూడో టీ20లో భారత్ ఆడుతూ పాడుతూ గెలిచింది. దీంతో ఈ సిరీస్‍లో ఆధిక్యంలోకి వెళ్లింది. బ్యాటింగ్‍లో గిల్, గైక్వాడ్ అదరగొడితే.. బౌలర్లు సమిష్టిగా రాణించారు.
భారత జట్టు మరోసారి అదరగొట్టింది. జింబాబ్వేతో మూడో టీ20లో ఆల్‍రౌండ్ ప్రదర్శనతో అలవోకగా విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్.. ఆ తర్వాత బౌలింగ్‍లో సత్తాచాటి జింబాబ్వేను చిత్తు చేసింది. హరారే వేదికగా నేడు (జూలై 10) జరిగిన మూడో టీ20లో టీమిండియా 23 పరుగుల తేడాతో సునాయాసంగా గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
సూపర్ సుందర్
183 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు సమిష్టిగా నిలువరించారు. భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 4 ఓవర్లలో కేవలం 15 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా (15), జొనాథన్ క్యాంప్‍బెల్ (1), స్లివ్ మదాందే (37)ను సుందర్ ఔట్ చేశాడు. ఆవేశ్ కాన్ రెండు, ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ తీసుకున్నారు.
కుప్పకూలి కోలుకున్నా..
లక్ష్యచేధనలో జింబాబ్వే ఓ దశలో 39 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో డియాన్ మైయర్స్ (49 బంతుల్లో 65 పరుగులు; నాటౌట్) అజేయ అర్ధ శతకం చేశాడు. స్లివ్ మదాందే (37) నిలకడగా ఆడాడు. దీంతో జింబాబ్వే కోలుకుంది. ఓ దశలో గెలుస్తుందా అనిపించింది. అయితే, భారత బౌలర్లు మళ్లీ కట్టడి చేశారు. మొత్తంగా 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓడిపోయింది జింబాబ్వే . మయైర్స్ పోరాటం వృథా అయింది.
జింబాబ్వే ఓపెనర్ వెస్లీ మధెవెరె (1)ను రెండో ఓవర్లో ఔట్ చేశాడు భారత పేసర్ ఆవేశ్ ఖాన్. తర్వాతి ఓవర్లో తడివనషె మరుమని (13)ని ఖలీల్ అహ్మద్ పెవిలియన్‍కు పంపాడు. బ్రియన్ బెన్నెట్ (4)ను నాలుగో ఓవర్లో వెనక్కి పంపాడు ఆవేశ్. కెప్టెన్ సికిందర్ రజా (15), జోనాథన్ క్యాంప్‍బెల్ (1)ను వెనువెంటనే ఔట్ చేశాడు సుందర్. దీంతో 7 ఓవర్లలో 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో జింబాబ్వే కూరుకుంది.
పోరాడిన మైయర్స్, మదాందే
జింబాబ్వే లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మైయర్స్, మదాందే వీరోచితంగా పోరాడారు. ముఖ్యంగా మైయర్స్ చివరి వరకు నిలిచి.. అజేయ అర్ధ శకతం చేశాడు. ఆ ఇద్దరూ ఆరో వికెట్‍కు 77 పరుగుల భాగస్వామ్యం జోడించి పోరాడారు. అయితే, 17వ ఓవర్లో మదాందేను ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు టీమిండియా స్పిన్నర్ సుందర్. మైయర్స్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది.
శుభ్‍మన్, రుతురాజ్ అదుర్స్
అంతకు ముందు టీమిండియా కెప్టెన్ శుభ్‍మన్ గిల్ 49 బంతుల్లో 66 పరుగులతో అర్ధ శకతం చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో అదరగొట్టాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49 పరుగులు; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) కూడా రాణించాడు. టీ20 ప్రపంచకప్ జట్టులోని సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే ఈ మ్యాచ్ తుదిజట్టులోకి వచ్చారు. అయితే, శాంసన్ (12 నాటౌట్) చివర్లో రాగా.. దూబే బ్యాటింగ్‍కు దిగలేదు.
ఈ ఐదు మ్యాచ్‍ల సిరీస్‍లో భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 జూలై 13వ తేదీన జరగనుంది. ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.