India vs Zimbabwe 3rd T20: హాఫ్ సెంచరీతో దుమ్మురేపిన గిల్.. రుతురాజ్ మెరుపులు.. టీమిండియా దీటైన స్కోరు
India vs Zimbabwe 3rd T20: జింబాబ్వేతో మూడో టీ20లో భారత కెప్టెన్ శుభ్‍మన్ గిల్ అర్ధ శకతంతో అదరగొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ కూడా రెచ్చిపోయాడు. దీంతో టీమిండియాకు మంచి స్కోరు దక్కింది.
జింబాబ్వేతో మూడో టీ20లో బ్యాటింగ్‍లో టీమిండియా దుమ్మురేపింది. కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (49 బంతుల్లో 66 పరుగులు; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకంతో అల్లాడిస్తే.. రుతురాజ్ గైక్వాడ్ హిట్టింగ్‍తో మెరిపించాడు. అయితే, ఒక్క రన్ తేడాతో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు గైక్వాడ్. హారారే వేదికగా నేడు (జూలై 10) ఆతిథ్య జింబాబ్వేతో నేడు జరుగుతున్న మూడో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ జట్టులో ఉన్న సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే ఈ మూడో టీ20లో టీమిండియా తుది జట్టులోకి వచ్చారు. భారత బ్యాటింగ్ ఎలా సాగిందంటే..
ఆరంభంలో ధనాధన్
ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది భారత్. ఓపెనర్లు శుభ్‍మన్ గిల్ (66), యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) మొదటి నుంచే దూకుడుగా ఆడారు. ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపారు. దీంతో 4.1 ఓవర్లకే 50 పరుగుల మార్క్ చేరింది భారత్. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించారు గిల్, జైస్వాల్. బౌండరీల మోత మోగించారు. అయితే, 8న ఓవర్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా బౌలింగ్‍లో జైస్వాల్ ఔటయ్యాడు.
రఫ్పాడించిన గిల్, గైక్వాడ్
యశస్వి జైస్వాల్ ఔటైనా శుభ్‍మన్ గిల్ జోరు కొనసాగించాడు. అయితే, గత మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ (10) ఎక్కువ సేపు నిలువలేదు. దీంతో 81 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు ఆచితూచి ఆడారు గిల్, రుతురాజ్ గైక్వాడ్. అయితే, కాసేపటికే మళ్లీ గేర్ మార్చారు. దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు గిల్. మరోవైపు రుతురాజ్ కూడా తన మార్క్ హిట్టింగ్‍తో బౌండరీలు బాదాడు.
అర్ధ శకతం తర్వాత కూడా కాసేపు అదరగొట్టాడు టీమిండియా స్టార్ గిల్. రుతురాజ్ కూడా హిట్టింగ్ చేశాడు. దీంతో 17.2 ఓవర్లలో 150 పరుగులకు భారత్ చేరింది. అయితే, గిల్ అదే ఓవర్లో ముజరబానీ బౌలింగ్‍లో క్యాచౌట్ అయ్యాడు. అయితే, రుతురాజ్ గైక్వాడ్ మాత్రం జోరు పెంచాడు. చివరి వరకు అదే జోరు కనబరిచాడు. 28 బంతుల్లోనే 49 పరుగులు చేశాడు రుతురాజ్. 4 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు. అయితే, చివరి ఓవర్ నాలుగో బంతికి ఔటై ఒక్క పరుగు తేడాతో అర్ధ శకతం మిస్ చేసుకున్నాడు. అయితే, గైక్వాడ్ హిట్టింగ్‍తో భారత్‍కు 182 పరుగుల మంచి స్కోరు దక్కింది. సంజూ శాంసన్ 7 బంతుల్లో 12 పరుగులు చేశాడు. శివమ్ దూబేకు బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు.
జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబానీ, సికిందర్ రజా తలా రెండు వికెట్లు తీశారు. జింబాబ్వే ముందు 183 పరుగుల భారీ లక్ష్యం ఉంది.
ఈ ఐదు టీ20ల సిరీస్‍లో జింబాబ్వే చేతిలో భారత్ తొలి మ్యాచ్‍లో షాకింగ్‍గా ఓడిపోయింది. రెండో టీ20లో టీమిండియా ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మూడో టీ20లో గెలిచిన జట్టు సిరీస్‍లో ఆధిక్యంలోకి వెళుతుంది.