India vs Zimbabwe 2nd T20: జింబాబ్వేకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. 46 బంతుల్లోనే సెంచరీ-india vs zimbabwe 2nd t20 abhishek sharma 46 balls hundred takes team india to huge total ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Zimbabwe 2nd T20: జింబాబ్వేకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. 46 బంతుల్లోనే సెంచరీ

India vs Zimbabwe 2nd T20: జింబాబ్వేకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. 46 బంతుల్లోనే సెంచరీ

Hari Prasad S HT Telugu
Jul 07, 2024 06:06 PM IST

India vs Zimbabwe 2nd T20: జింబాబ్వేకు చుక్కలు చూపించాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. సిక్సర్ల మోత మోగిస్తూ.. కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.

జింబాబ్వేకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. 46 బంతుల్లోనే సెంచరీ
జింబాబ్వేకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. సిక్సర్ల వర్షం.. 46 బంతుల్లోనే సెంచరీ

India vs Zimbabwe 2nd T20: తొలి మ్యాచ్ లో అనూహ్యంగా యంగిండియాకు షాకిచ్చిన జింబాబ్వేకు రెండో టీ20లో చుక్కలు కనిపించాయి. టీమిండియా తరఫున ఆడిన తొలి మ్యాచ్ లోనే డకౌటైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. రెండో మ్యాచ్ లోనే మెరుపు సెంచరీ చేశాడు. అతడు సిక్సర్ల మోత మోగిస్తూ కేవలం 46 బంతుల్లోనే సెంచరీ చేయడంతో ఇండియా 20 ఓవర్లలో.. 2 వికెట్లకు ఏకంగా 234 రన్స్ చేసింది. రుతురాజ్ కూడా హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో రింకు సింగ్ సిక్సర్ల మోత మోగించాడు.

అభిషేక్ వీరబాదుడు

ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున్ ట్రావిస్ హెడ్ తో కలిసి ఓపెనింగ్ చేసిన అభిషేక్ శర్మ ఎలా చెలరేగాడో మనకు తెలుసు. ఆ మెరుపులతోనే ఇప్పుడు టీమిండియాలోకి ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో డకౌటై నిరాశ పరిచినా.. రెండో మ్యాచ్ లో మాత్రం తన ఐపీఎల్ ఫామ్ కొనసాగించాడు. కేవలం 46 బంతుల్లో 8 సిక్స్‌లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు.

ముఖ్యంగా జింబాబ్వే బౌలర్ డియోన్ మయర్స్ ఒకే ఓవర్లో 28 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో అభిషేక్ వరుసగా 4, 6, 4, 6, 4 కొట్టడం విశేషం. అంతేకాదు తన సెంచరీని కూడా తనదైన స్టైల్లో వరుసగా మూడు సిక్సర్లు బాది చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే అతడు ఔటయ్యాడు. 28 పరుగులు దగ్గర ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అభిషేక్ తర్వాత చెలరేగిపోయాడు.

తనకు లైఫ్ దొరికిన తర్వాత అతడు కేవలం 22 బంతుల్లోనే 72 రన్స్ చేయడం విశేషం. అతనికి రుతురాజ్ గైక్వాడ్ చక్కని సహకారం అందించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2) విఫలమైన సమయంలో క్రీజులోకి వచ్చిన రుతురాజ్.. అభిషేక్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 137 పరుగులు జోడించడం విశేషం. అతడు చివరి వరకూ క్రీజులోనే ఉన్నాడు.

రుతురాజ్ కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ తో 77 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు రింకు సింగ్ 22 బంతుల్లో 5 సిక్స్ లు, 2 ఫోర్లతో 48 రన్స్ చేశాడు. చివర్లో వరుసగా రెండు సిక్స్ లతో ఇన్నింగ్స్ ముగించడం విశేషం.

ఇండియా తరఫున మూడో వేగవంతమైన సెంచరీ

అంతర్జాతీయ టీ20ల్లో ఇండియా తరఫున మూడో వేగవంతమైన సెంచరీ రికార్డును అభిషేక్ శర్మ నమోదు చేశాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత కేఎల్ రాహుల్ తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఇండియా తరఫున టీ20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు రోహిత్ పేరిట ఉంది. అతడు 2017లో శ్రీలంకపై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ఆ తర్వాత గతేడాది సూర్యకుమార్ యాదవ్ కూడా అదే శ్రీలంకపై 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇది ఇండియా తరఫున రెండో వేగవంతమైన సెంచరీ. ఇక 2016లో కేఎల్ రాహుల్ వెస్టిండీస్ పై 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇప్పుడా రికార్డును అభిషేక్ శర్మ సమం చేశాడు. అతడు కూడా 46 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్స్ లతో ఈ రికార్డు క్రియేట్ చేశాడు.

Whats_app_banner