India vs Zimbabwe: రజా మెరుపులు: టీమిండియాకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే.. అరంగేట్రం చేసిన సీఎస్‍కే బౌలర్-ind vs zim 4rd t20 sikandar raza smashing innings zimbabwe sets modest total for india tushar deshpand debutes ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India Vs Zimbabwe: రజా మెరుపులు: టీమిండియాకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే.. అరంగేట్రం చేసిన సీఎస్‍కే బౌలర్

India vs Zimbabwe: రజా మెరుపులు: టీమిండియాకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే.. అరంగేట్రం చేసిన సీఎస్‍కే బౌలర్

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 13, 2024 06:21 PM IST

India vs Zimbabwe 4th T20: భారత్‍తో నాలుగో టీ20లో మోస్తరు స్కోరు చేసింది జింబాబ్వే. కెప్టెన్ సికందర్ రజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జట్టుకు పోరాడే స్కోరు లభించింది.

India vs Zimbabwe: రజా మెరుపులు: టీమిండియాకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే.. అరంగేట్రం చేసిన సీఎస్‍కే బౌలర్
India vs Zimbabwe: రజా మెరుపులు: టీమిండియాకు మోస్తరు టార్గెట్ ఇచ్చిన జింబాబ్వే.. అరంగేట్రం చేసిన సీఎస్‍కే బౌలర్ (AFP)

భారత్‍తో సిరీస్ నిలుపుకోవాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‍లో జింబాబ్వే మోస్తరు స్కోరు చేసింది. కెప్టెన్ సికందర్ రజా హిట్టింగ్ చేయడంతో మంచి స్కోరు దక్కించుకుంది. హరారే వేదికగా భారత్‍తో నేడు (జూలై) జరుగుతున్న నాలుగో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఎలా సాగిందంటే..

రాణించిన ఓపెనర్లు.. అభిషేక్‍కు ఫస్ట్ వికెట్

ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు భారత కెప్టెన్ శుభ్‍మన్ గిల్. జింబాబ్వేకు ఓపెనర్లు తడివనాషే మరుమనీ (31 బంతుల్లో 32 పరుగులు), వెస్లీ మధెవెరె (24 బంతుల్లో 25 పరుగులు) ఆరంభంలో దీటుగా ఆడారు. భారత బౌలర్లను టెన్షన్ పెట్టారు. వరుసగా బౌండరీలు బాదారు. దీంతో 4 ఓవర్లలోనే జింబాబ్వేకు 35 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

భారత ఆటగాడు అభిషేక్ శర్మ ఈ ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 9వ ఓవర్లలో తడివనాషేను అభిషేక్ ఔట్ చేశాడు. దీంతో 63 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. ఈ సిరీస్‍లోనే భారత్ తరఫున అరంగేట్రం చేసిన అభిషేక్‍కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్.

పదో ఓవర్లోనే మరో ఓపెనర్ మరుమనీని భారత బౌలర్ శివం దూబే పెవిలియన్‍కు పంపాడు. బ్రియాన్ బెన్నెట్ (9), జొనాథన్ క్యాంప్‍బెల్ (3) ఎక్కువ సేపు నిలువలేకపోయారు. బెన్నెట్‍ను 14వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ పెవిలియన్‍కు పంపాడు. తర్వాతి ఓవర్లో అద్భుతమైన డైరెక్ట్ హిట్‍తో క్యాంప్‍బెల్‍ రనౌట్ చేశాడు భారత ప్లేయర్ రవి బిష్ణోయ్. దీంతో 96 పరుగులకే 4 వికెట్లను కోల్పోయింది జింబాబ్వే.

రజా హిట్టింగ్ ధమాకా

జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా (28 బంతుల్లో 46 పరుగులు; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ వేగంగా పరుగులు చేశాడు. దీంతో మందకొడిగా మారిన జింబాబ్వే స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఓ ఎండ్‍లో వికెట్లు పడినా రజా మాత్రం జోరు కొనసాగించాడు. అయితే, 19వ ఓవర్లో రజాను ఔట్ చేశాడు అరంగేట్ర పేసర్ తుషార్ దేశ్‍పాండే. తొలి మ్యాచ్‍లోనే వికెట్ సాధించాడు. డియాన్ మయెర్స్ (12), క్లివ్ మదాందే (7)ను చివరి ఓవర్లో ఔట్ చేశాడు ఖలీల్ అహ్మద్. మధ్యలో రజా సూపర్ హిట్టింగ్ చేయటంతో జింబాబ్వేకు మొత్తంగా 152 పరుగుల మంచి స్కోరు దక్కింది.

భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్‍పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, శివం దూబే తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా ముందు 153 పరుగుల టార్గెట్ ఉంది.

దేశ్‍పాండే అరంగేట్రం

ఐపీఎల్‍లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‍కే) తరఫున అదరగొడుతున్న తుషార్ దేశ్‍పాండే.. ఈ మ్యాచ్‍తో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. ఈ తొలి మ్యాచ్‍లోనే ఓ వికెట్ తీసి.. ఖాతా తెరిచాడు.

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‍లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ నాలుగో టీ20 గెలిస్తే సిరీస్ టీమిండియా కైవసం అవుతుంది.

Whats_app_banner