IND vs ENG: ఇంగ్లండ్‍కు భారీ టార్గెట్ ఇచ్చిన టీమిండియా.. గిల్ శతక మెరుపులు.. భరత్ మళ్లీ విఫలం
04 February 2024, 17:08 IST
- India vs England 2nd Test: రెండో టెస్టులో ఇంగ్లండ్‍కు టీమిండియా భారీ టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‍మన్ గిల్ శకతంతో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ రాణించగా.. చివర్లో అశ్విన్ కీలకమైన పరుగులు చేశాడు.
IND vs ENG: ఇంగ్లండ్‍కు భారీ టార్గెట్ ఇచ్చిన టీమిండియా.. గిల్ శతక మెరుపులు.. భరత్ మళ్లీ విఫలం
IND vs ENG 2nd Test Match: ఇంగ్లండ్‍తో రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇంగ్లిష్ జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజైన నేడు (ఫిబ్రవరి 4) రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. యంగ్ స్టార్ బ్యాటర్ శుభ్‍మన్ గిల్ (104) కీలకమైన సమయంలో శతకంతో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (45) మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మిగిలిన భారత బ్యాటర్లు రాణించలేకపోయారు. మొత్తంగా ఇంగ్లండ్‍కు 399 పరుగుల టార్గెట్ ఇచ్చింది భారత్. లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది.
28/0 వద్ద నేడు మూడో రోజు ఆటకు టీమిండియా బరిలోకి దిగింది. మూడో సెషన్‍లో 255 పరుగులకు ఆలౌటైంది. గిల్, అక్షర్ మినహా మిగిలిన బ్యాటర్లు ఎక్కువసేపు నిలువకపోవడంతో ఆశించిన స్థాయిలో స్కోరు రాలేదు. చివర్లో రవిచంద్రన్ అశ్విన్ (29) విలువైన పరుగులు చేశాడు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 143 పరుగుల ఆధిక్యాన్ని సాధించడం కలిసి వచ్చింది. దీంతో మొత్తంగా ఇంగ్లిష్ జట్టు ముందు 399 పరుగుల లక్ష్యం ఉంది.
ఆదుకున్న గిల్, అక్షర్
మూడో రోజు ఆట మొదలైన కాసేపటికే భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (13), యశస్వి జైస్వాల్ (17)ను ఇంగ్లండ్ స్టార్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పెవిలియన్‍కు పంపాడు. శ్రేయస్ అయ్యర్ (29) కాసేపు నిలిచినా.. రజత్ పటిదార్ (9) విఫలమయ్యాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ తరుణంలో భారత బ్యాటర్లు శుభ్‍మన్ గిల్, అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. నిలకడగా ఆడుతూనే పరుగులు రాబట్టారు. శుభ్‍మన్ గిల్ 132 బంతుల్లోనే శతకాన్ని చేరి అదరగొట్టాడు. టెస్టు క్రికెట్‍లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్‍కు గిల్, అక్షర్ 89 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వెనువెంటనే ఇద్దరూ ఔటయ్యారు.
నిలిచిన ఆశ్విన్
కేఎస్ భరత్ (6), కుల్దీప్ యాదవ్ (0) నిరాశపరచగా.. చివర్లో భారత సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడికి జస్‍ప్రీత్ బుమ్రా తోడుగా నిలిచాడు. 26 బంతులు ఆడిన బుమ్రా చివరికి ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగాడు. అయితే, వికెట్ పడకుండా అతడు అశ్విన్‍కు తోడుగా నిలిచాడు. మరో వైపు అశ్విన్ నిలకడగా ఆడి పరుగులు బట్టాడు. అయితే, కాసేపటికే అశ్విన్ కూడా ఔటవటంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది.
ఓ వికెట్ కోల్పోయి ఇంగ్లండ్
399 పరుగుల లక్ష్య ఛేదనకు రోజు చివర్లో ఇంగ్లండ్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 67 పరుగులు చేసింది. ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (28)ను భారత స్పిన్నర్ అశ్విన్ ఔట్ చేశాడు. జాక్ క్రాలీ (29 నాటౌట్), రెహాన్ అహ్మద్ (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రేపు నాలుగో రోజు ఆటను కొనసాగించనున్నారు. ఈ మ్యాచ్ గెలువాలంటే ఇంగ్లండ్‍కు ఇంకా 332 పరుగులు అవసరం. భారత్ గెలువాలంటే 9 వికెట్లు పడగొట్టాలి. ఐదు టెస్టుల సిరీస్‍లో తొలి మ్యాచ్ ఓడిన టీమిండియాకు ఈ రెండో టెస్టు గెలవడం చాలా కీలకం.
మళ్లీ నిరాశపరిచిన భరత్
భారత యువ వికెట్ కీపర్, తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ మరోసారి విఫలమయ్యాడు. తన హౌమ్ గ్రౌండ్ విశాఖపట్నంలో జరుగుతున్న ఈ టెస్టులోనూ నిరాశపరిచాడు. నేడు రెండో ఇన్నింగ్స్‌లో భరత్ కేవలం ఆరు పరుగులకే ఔటయ్యాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ బౌలింగ్‍లో మిడాన్‍లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. నిరాశగా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా 17 పరుగులకే ఔటయ్యాడు భరత్. టీమిండియాలో వచ్చిన మంచి అవకాశాన్ని అతడు వినియోగించుకోలేకపోతున్నాడు. దేశవాళీ క్రికెట్‍లో శతకాల మోతతో పరుగుల వరద పారించిన భరత్.. టీమిండియా తరఫున ఇప్పటి వరకు 7 టెస్టుల్లో ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు.